కోమటి రెడ్డికి రోషమొచ్చింది 

Komatireddy Venkata Reddy Fires On KCR

02:43 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Komatireddy Venkata Reddy Fires On KCR

కాంగ్రెస్ నేత , మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ పక్షం (సిఎల్పీ) ఉపనేత కోమటి రెడ్డి వెంకట రెడ్డికి రోషం వచ్చింది. ఒకవైపు అయుత చండీయాగం చేస్తున్న కెసిఆర్ ఇంకో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు అనైతిక అధర్మ పనులతో పాపాలు చేయడం ఎందుకని ఆయన దెప్పి పొడిచారు. కాంగ్రెస్ గెలవకపొతే ఎంఎల్ఏ పదవి వదిలేసి , రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించేశారు. అది కాన్ఫిడెన్స్ కావచ్చు , కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కోసం కావచ్చు. అయితే చాలా కాలం తర్వాత తెలంగాణాలో ఇలా సవాల్ విసిరిన విపక్ష నేతలెవరూ కనిపించని పరిస్థితుల్లో కోమటి రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను , మరీ ముఖ్యంగా ఎంఎల్సి ఎన్నికలను వేడెక్కించాయి.

ఈ మధ్య కాలంలో జరిగిన వరంగల్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోవడం , స్థానిక సంస్థల ఎంఎల్సి ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించడం , చాలామంది కాంగ్రెస్ నేతలు టిఆర్ఎస్ గూటికి చేరడం , ఇంకా పలువురు చేరతారారని వార్తలు రావడం నేపధ్యంలో నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుండి తప్పుకుంటానని, టిఆర్‌ఎస్ ఓడితే ముఖ్యమంత్రి పదవికి కెసిఆర్ రాజీనామా చేయాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే తన సవాల్ మేరకు స్పీకర్‌కు నా రాజీనామా అందిస్తానని, ఆయన అంటూ గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామాను నేరుగా గవర్నర్‌కు అందించానని గుర్తుచేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ప్రజాసేవ తప్ప పదవులు ముఖ్యం కాదని వెంకట రెడ్డి అన్నారు. జిల్లాలో టిఆర్‌ఎస్‌కు మొత్తం 1110మంది స్థానిక ప్రజాప్రతినిధుల ఓటర్లలో కేవలం 138ఓట్లు మాత్రమే ఉన్నా అనైతికంగా పోటీకి దిగిందని, ‘స్థానిక' ఓటర్లను ప్రలోభాలకు, బెదిరింపులకు గురి చేస్తోందని ఆయన టిఆర్ఎస్ పై ద్వజమెత్తారు. దౌర్జన్యంగా ఎన్నికల్లో గెలిచేందుకు సిఎం కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం పోరాడిన కోమటిరెడ్డి కుటుంబాన్ని ఓడించేందుకు సిఎం కెసిఆర్ ఆంధ్ర పార్టీగా ఆయన తిట్టిన టిడిపి నుండి గత ఎన్నికల్లో ఎంపిగా పోటీ చేసి, పత్తా లేకుండా పోయిన వ్యాపారవేత్త చిన్నపరెడ్డిని పోటీకి పెట్టి వందల కోట్లు ఖర్చు చేయిస్తున్నార ని ఆయన ఆరోపించారు.

ఇంతకీ నల్గొండలో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ముచ్చెమటలు పోయిస్తున్నందునే, టిఆర్ఎస్ ని కట్టడి చేయడానికి కోమటిరెడ్డి సీరియస్ గా స్పందించారని తెలుస్తోంది. మరి కోమటి రెడ్డి వ్యూహం ఫలించి , విజయం సాధిస్తారో , టిఆర్ఎస్ దెబ్బకు చిత్తవుతారో చూడాలి.

English summary