రష్యాలో 'టీ' .. కాబూల్ లో 'టిఫిన్' .. పాక్‌లో డిన్నర్

Modi Visits Three Countries In One Day

12:46 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Modi Visits Three Countries In One Day

ఒకే రోజు మూడు దేశాలు చుట్టిన మోడీ...

సాదారణంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు బిజీ షెడ్యూల్ తో గడుపుతుంటారు. పొద్దున్న ఓ ఊళ్ళో , మధ్యాహ్నం మరో ఊళ్ళో , సాయంత్రం ఇంకోచోట వుంటారు. సినీమాల్లో అయితే ఈ తరహా ఎక్కువగా చూస్తుంటాం ... కానీ ఓ దేశ ప్రధాని అందునా భారత్ ప్రధాని ఒకే రోజు మూడు దేశాల్లో చుట్టి వచ్చారంటే అది సామాన్య విషయం కాదు. పైగా భారత్ ని శత్రువుగా పరిగణిస్తూ , వీలు చూసుకుని పొగబెట్టే పాకిస్తాన్ పర్యటన కూడా ప్రధాని ఈ మజీలీలో పూర్తిచేసారు. అది కూడా సడన్ గా చేసారు. విదేశాల్లో పర్యటిస్తూ తనదైన ముద్ర వేస్తున్న ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటన లో ఉండగానే నేరుగా కాబూల్ వెళ్లి అక్కడ నుంచి , పాక్ వెళ్ళారు. రాత్రికి డిల్లీ చేరుకున్నారు.

శుక్రవారం ఉదయం రష్యాలోని మాస్కో నుంచి ‘టీ’తో బయలుదేరిన ఆయన టిఫిన్ కు కాబూల్ కు చేరుకున్నారు. అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సాయంత్రానికి లాహోర్ కు చేరుకొని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో విందు పూర్తి చేశారు. రాత్రికి బయలుదేరి ఢిల్లీకి చేరుకొన్నారు. ఒకే రోజు మూడు దేశాల్లో గడిపి.. స్వదేశానికి చేరుకున్న ఘనతను మోడీ సొంతం చేసుకున్నారు.

ఒకరు కల గన్నారు - మరొకరు సుసాధ్యం చేసారు...

మోడీ చేసిన ఈ పర్యటన మామూలు విషయం కానే కాదు. ఎందుకంటే దీనివెనుక ఒకరి కల వుంది. డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా వుండగా ఇలాంటి కల గన్నారు. ఎలా అంటే, ఆయన 2007 జనవరిలో ఢిల్లీలోని ఫిక్కీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ‘‘అమృత్ సర్ లో అల్పాహారం.. లాహోర్ లో మధ్యాహ్నం భోజనం.. కాబూల్ లో రాత్రి విందు చేయాలి. మా పూర్వీకులు అలా జీవించారు. మనమళ్లు అలానే జీవించాలన్నదే నా కల’’ అన్నారు. 10 సంవత్సరాలు దేశాన్ని ఏలిన మన్మోహన్ తన కలను నెరవేర్చు కోడానికి ప్రయత్నించారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అయితే.. ఓ రకంగా ఆ కలను చిన్న మార్పుతో అది కూడా రివర్స్ లో నేటి ప్రధాని మోడీ నిజం చేసారు. . మన్మోహన్ అమృత్ సర్ నుంచి పర్యటన మొదలు పెట్టాలని కలగంటే , . మోడీ ఏకంగా రష్యా నుంచి మొదలు పెట్టి ఢిల్లీతో పూర్తి చేశారు. ఈవిధంగా ఒకరి కలను సాకారం చేసిన మొనగాడుగా మోడీ నిలిచారు.

ట్వీట్ చేసి అనుకోకుండా పాక్ వెళ్ళిన మోడీ ...

రష్యా, ఆఫ్గనిస్థాన్ పర్యటన అనంతరం డిల్లీ రావాల్సిన ప్రధాని మోడీ అనుకోకుండా పాకిస్తాన్ వెళ్లి సంచలనం సృష్టించారు. తాము పాక్ గడ్డపై కాలు మోపనున్నానని, ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయనున్నానని ఆయన ట్వీట్ చేసారు. తొలిసారిగా పాకిస్థాన్‌లో కాలుమోపిన స్వాగతం పలికేందుకు నవాజ్ షరీఫ్ స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చారు. దీంతో పుట్టిన రోజు శుభాభినందనలు, ఆపై ఇరు దేశాల ప్రధానుల మధ్య కాసేపు మాటా మంతీ ఎయిర్ పోర్టు లాబీల్లోనే జరిగిపోయాయి.

నాడు వాజ్ పాయి పర్యటిస్తే - నేడు ఆయన పుట్టినరోజు నాడే...

సరిగ్గా 12 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజపేయి పాకిస్థాన్‌లో పర్యటించారు. ఆ తర్వాత మళ్లీ అదే వాజపేయి 91వ పుట్టిన రోజున మోడీ పాకిస్థాన్‌లో పర్యటించారు. డిసెంబర్ 25నే పాకిస్థాన్ ప్రధాని తన 66వ జన్మదినోత్స వం కావడం , ఈ విధంగా ఇద్దరు నేతల పుట్టిన రోజులు కలవడం యాదృచ్చికమే. ఇక అదే రోజు యాదృచ్చికంగా మోడీ పాక్ వెళ్ళడం విశేషం.

మిశ్రమ స్పందన...

ప్రధాని మోడీ సడన్ గా పాకిస్తాన్ పర్యటించడం గురించి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రెండు రోజుల రష్యా పర్యటన అనంతరం కాబూల్‌కు వెళ్లిన ప్రధాని మోడీ అక్కడి నుంచి పాకిస్థాన్‌కు వెళ్లడంపై శివసేన మండి పడింది. కాంగ్రెస్ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తోంది. అయితే ప్రధాని పాకిస్థాన్ పర్యటనను బీజేపీ మంత్రులు, ఇతర నేతలు మాత్రం గట్టిగా సమర్ధిస్తున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ పాక్ పర్యటన వల్ల జాతీయ భద్రతపై తీవ్ర ప్రభావం పడుతుందని కాంగ్రెస్ ప్రతినిధి మనీష్ తివారీ వ్యాఖ్యానించారు. అది ముందుగా తీసుకున్న నిర్ణయం కాకుండా, అప్పటికప్పుడు అనుకున్నదే అయితే అది చాలా పిచ్చి వ్యవహారమని మండిపడ్డారు. బీజేపీ నేత నళిన్ కోహ్లీ, మంత్రి సుష్మా స్వరాజ్ మాత్రం ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలు ఉండటం ఈ ప్రాంత ప్రయోజనాలకు మంచిదని, అప్పుడే మన అభ్యంతరాలు కూడా చెప్పొచ్చని నళిన్ కోహ్లీ అన్నారు. రెండు దేశాలు శాంతిని నెలకొల్పేందుకు మంచి సంబంధాలు కొనసాగిస్తే, అది అందరూ స్వాగతించాలి కోరారు. ఇక సుష్మా స్వరాజ్ అయితే.. మంచి రాజనీతిజ్ఞత అంటే ఇదేనని, పొరుగు దేశాలతో ఇలాంటి సంబంధాలే ఉండాలని అన్నారు.

ప్రధాని మోడీ మాత్రం కాకతాళీయంగా పాక్ గడ్డపై కాలు పెట్టారని భావించలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మోడీ పాక్‌కు వెళ్లడంపై ముందుగానే ప్లాన్ చేసుకొని ఉండవచ్చని భావిస్తున్నారు . నిన్న ఉదయం ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్‌లో ప్రసంగానికి ముందు తన ట్విట్టర్ తాను నవాజ్ షరీఫ్‌తో మాట్లాడానని, జన్మదిన శుభాకాంక్షలు తెలిపానని మోడీ ట్వీట్ చేసిన మోడీ ఢిల్లీకి తిరిగి వచ్చే మార్గమధ్యలో షరీఫ్‌ను కలుస్తున్నట్లు చెప్పి ఆయనకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించారు. ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్ పార్లమెంటులో ప్రసంగిస్తూ, "కొన్ని దేశాలకు నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు" అని పాక్ పేరు చెప్పకుండానే సునిశిత విమర్శలూ చేశారు.

మొత్తానికి ప్రధాని మోడీ ఓ అద్బుతం ఆవిష్కరించి , మరోసారి పాజిటివ్ గా నెగిటివ్ గా కూడా వార్తల్లోకెక్కారు. భవిష్యత్తులో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీయనుందో వేచి చూడాల్సిందే .

English summary

Modi Visits Three Countries In One Day Russia, Kabul and Pakistan. Tea Party in Russia, Had breakfast in Kabul and Dinner in Pakistan.