ముద్రగడ దీక్ష ముగిసింది

Mudragada completes his hunger strike

12:56 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

Mudragada completes his hunger strike

గత 14 రోజులుగా ఆమరణ దీక్ష నిర్వహిస్తున్న కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఎట్టకేలకు ఆమరణ దీక్ష విరమించారు. కిర్లంపూడిలోని ఆయన నివాసంలో కొద్దిసేపటి క్రితంనల్లా విష్ణు , ఆకుల రామ కృష్ణ , తోట రాజీవ్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తుని విధ్వంసకారుల పేరిట అరెస్ట్ చేసిన కాపులను విడుదల చేయడంతో పాటు కాపుల పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కిర్లంపూడిలోని తన సొంతింటిలోనే జూన్ 9న ఆమరణ దీక్షకు దిగిన ముద్రగడను పోలీసులు బలవంతంగా అదేరోజు సాయంత్రం రాజమహేంద్రవరంలోని ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

అయితే ఆసుపత్రిలోనూ దీక్ష విరమణకు ససేమిరా అన్న ముద్రగడ.. అరెస్టైన కాపులంతా బెయిల్ పై విడుదల కావడంతో నేటి ఉదయం దీక్ష విరమణకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో దీక్ష విరమణ కోసం ఆయన మరికొన్ని డిమాండ్లు చేశారు. అరెస్టైన తరువాత విడుదలైన వారిని... తనను తన కుటుంబాన్ని పోలీసు వ్యానులో కిర్లంపూడి తీసుకెళ్లాలని డిమాండు చేశారు. అందుకు ప్రభుత్వం కాదంది. దీంతో తన సతీమణితో కలసి సొంత కారులోనే ముద్రగడ కిర్లంపూడి చేరుకున్నారు. విడతలవారీగా అరెస్టైన 13 మంది కాపులకు బెయిల్ రావడంతో దీక్ష విరమణకు సరేనన్న ముద్రగడ... కొత్త డిమాండ్లు వినిపించడంతో ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు.

ఈ నేపథ్యంలో ముద్రగడ దీని పై ఏం చేద్దామంటూ కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు - చిరంజీవిలతో ఫోన్ లో మంతనాలు జరిపారు. వారిద్దరి సూచనల మేరకు దీక్ష విరమణకు ఓకే అన్నారు. రాజమహేంద్రవరం ఆస్పత్రి నుంచి తన స్వగ్రామం కిర్లంపూడికి చేరుకున్నారు. దీంతో ప్రభుత్వం ముద్రగడకు పోలీసులతో భద్రత కల్పించింది. ఆయన కిర్లంపూడికి రాక సందర్భంగా రహదారి వెంట అనుచరులు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కిర్లంపూడికి పలువురు కాపు నేతలు తమ అనుచరులతో చేరుకోవడంతో గ్రామం కిటకిటలాడుతోంది.

మొత్తానికి దీక్ష విరమించడంతో 14 రోజులుగా రగులుతున్న ముద్రగడ వ్యవహారానికి ముగింపు కార్డు పడింది. అయితే కాపు జెఏసి ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు ముద్రగడ ప్రకటించారు.

English summary

Mudragada completes his hunger strike