దీక్ష -  విరమణ

Mudragada padmanabham End Indefinite Fast

04:40 PM ON 8th February, 2016 By Mirchi Vilas

Mudragada padmanabham End Indefinite Fast

ఎట్టకేలకు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు సఫలమవడంతో నాలుగు రోజులుగా చేస్తున్న దీక్షను ముద్రగడ దంపతులు విరమించారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కిర్లంపూడి లోని ఆయన నివాసంలో దాదాపు గంటన్నర సేపు ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, తోట త్రిమూర్తులు, కళా వెంకట్రావు, బొడ్డు భాస్కర రామారావు, తోట త్రిమూర్తులు , వర్మ తదితరులు ముద్రగడతో చర్చించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ముద్రగడ అంగీకరించారు. దీంతో వైద్యులు ఆయన నివాసానికి వెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు.

శాశ్వత పరిష్కారానికి చర్యలు : అచ్చెన్నాయుడు

కాపుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సానుకూలంగా ఉన్నారని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు దీక్ష విరమణ సన్దర్భంగా. మంత్రి మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయ ని అయితే సిఎమ్ చంద్రబాబు కాపులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో కాపు కమిషన్‌ ఏర్పాటు చేసినట్లు అచ్చెన్నాయుడు చెప్పారు. కాపు సామాజిక వర్గంలో పేదలు, ఆర్థికంగా వెనకబడిన వారికి సహాయం చేసేందుకు ఈ కమిషన్‌కు నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తునిలో జరిగిన అల్లర్లు అందరికీ బాధ కలిగించాయన్నారు. కాపు వర్గీయుల ముసుగులో కొందరు కావాలనే ఈ దుర్మార్గానికి పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ ఘటనలో కేసులన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేసి బాధ్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటామ ని ఆయన స్పష్టం చేసారు

హామీలు నిలబెట్టు కోవాలి : ముద్రగడ .....

ప్రభుత్వం తమకిచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని భావిస్తున్నట్లు ముద్రగడ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాపు కమిషన్‌కు ప్రస్తుతం రూ.500 కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని... వచ్చే బడ్జెట్‌లో ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు. తుని ఘటనలో అమాయకులపై కేసులు పెట్టినట్లు తన దృష్టికి వచ్చిందని... దానిపైనా పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. కాపు జాతికి తన జీవితాన్ని అంకితం చేశానని... వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాపులు మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి రానివ్వకుండా చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ముద్రగడ స్పష్టం చేశారు.కాపు కులంలో పేదలు, ఆర్థికంగా వెనకబడి ఉన్నవారికి రిజర్వేషన్లు కల్పించాలన్నదే తమ ప్రధాన డిమాండని, అవసరమైతే క్రిలేయర్ పెట్టాలని కూడా ముద్రగడ అన్నారు. . బీసీలకు ఎలాంటి నష్టం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కాపులకు రిజర్వేషన్ల కల్పించడం వల్ల బీసీలకు అన్యాయం జరిగితే తాము వూరుకోమన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తే క్షమించాలని ఆయన కోరుతూ, తమ విమర్శలు ఆవేదనతో చేసినవే తప్ప... ద్వేషంతో చేసినవి కాదన్నారు రిజర్వేషన్ కల్పిస్తే , సిఎమ్ కాళ్ళు కడుగుతామని ఆయన అన్నారు.. తమ పోరాటానికి మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీల నేతలు, పలు కుల సంఘాల నేతలకు పేరుపేరునా ముద్రగడ కృతజ్ఞతలు తెలిపారు.

నిర్భంధంలో నేతలు .....

కాగా గత శుక్రవారం నుంచి దీక్ష చేస్తున్న ముద్రగడను పరామర్సించి, సంఘీభావం తెల్పేందుకు వచ్చిన నేతలను రాజమండ్రిలో పోలీసులు నిర్భందించారు. కిర్లంపూడి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణరావు సోమవారం రాజమండ్రి చేరుకున్నారు. అయితే రాజమండ్రి నుంచి ఆయన కిర్లంపూడి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుని, ఆయన బస చేస్తున్న ఆనంద్‌ రెసిడెన్సీ హోటల్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మాట్లాడుతూ... ఇలా అడ్డుకోవడం చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాకుండా డిక్టేటర్ పాలన నడుస్తున్నట్లు వుందని విమర్శించారు. అలాగే

మధురపూడి ( రాజమండ్రి) విమానాశ్రయం వద్ద ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, రాజ్యసభ ఎంపీ చిరంజీవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముద్రగడ పద్మనాభంను పరామర్శించేందుకు వారు రాజమండ్రికి చేరుకున్నారు. వీరిని విమానాశ్రయం బయటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. వైస్సార్ సిపి నేత తోట చంద్ర శేఖర్ ని కూడా ఎయిర్ పోర్టులోనే పోలీసులు అడ్డుకున్నారు.

English summary

Kapu Leader Mudragada Padmanabham and his wife ends Indefinite Fast today.Andhra Pradesh Minister Acchennayudu and Kala Venkat Rao Discussed with Mudragada Padmanabham about the issue and then Mudragada end his Indefinite fast for Andhara Pradesh Government Accepting the demands on the issue