ఆమరణ దీక్ష ఆరంభం

Mudragada Padmanabham indefinite fast Starts today

12:03 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham indefinite fast Starts today

ఎట్టకేలకు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సతీ సమేతంగా ఆమరణ దీక్ష కు దిగారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు వెంటనే జీవో విడుదల చేయాలని, కాపు కార్పొరేషన్‌కు రూ.1900 కోట్లు విడుదల చేయాలని, తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలన్న డిమాండ్లతో శుక్రవారం ఉదయం 9గంటలకు తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన నివాసంలో సతీమణి పద్మావతితో కలిసి ముద్రగడ దీక్షలో కూర్చున్నారు. ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ బి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ముద్రగడ, ఆయన భార్యకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ముద్రగడ 86 కిలోల బరువు ఉన్నారని, బీపీ, షుగర్‌ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముద్రగడ సతీమణి పద్మావతి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీక్ష చేపట్టిన ముద్రగడను మాజీ మంత్రులు వట్టి వసంత్‌కుమార్‌, కొప్పన మోహన్‌రావు, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్‌, పలువురు కాపు సంఘం నాయకులు పరామర్శించారు.

మరోపక్క తుని ఘటనల తర్వాత పోలీసు నిఘా , బందోబస్తూ పెంచడంతో, కిర్లంపూడి గ్రామం మొత్తం పోలీసుల ఆధీనంలోకి వుంది. ఇప్పటికే కిర్లంపూడి కి ఎవరూ రావద్దని పోలీసులు స్పష్టం చేయడంతో ముద్రగడ నివాసంలోకి ఎవరినీ రానీయకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గ్రామంలోకి వచ్చే రహదారులపై నాలుగు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, గ్రామంలోకి వాహనాలను అనుమతించడంలేదు. తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ కిర్లంపూడిలోనే మకాం వేసి బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

English summary

Ex-Minister Mudragada Padmanabham started indefinite fasting at his house in Kirlampudi in EastGodavari District.Due to this protest kirlampudi was taken into the hand of police.Along with Mudragada Padmanabham his wife was also participating along with her husband