ఓ పక్క దీక్షకు ఏర్పాట్లు - మరోపక్క పోలీసు నిఘా

Mudragada Padmanabham Protest On 5th February

01:50 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Mudragada Padmanabham Protest On 5th February

మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కిర్లంపూడిలో శుక్రవారం సతీసమేతంగా తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అన్ని ఏర్పాట్లు సిద్ధంచేస్తున్నట్టు చెబుతున్నారు. మరోపక్క పోలీసు నిఘా హెచ్చింది. కాపులకు రిజర్వేషన్ , కాపు కార్పోరేషన్ కి వెయ్యి కోట్ల కేటాయింపు చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31న తుని సమీపంలోని వి కొత్తూరు కొబ్బరి తోటలో నిర్వహించిన కాపు ఐక్య గర్జన సందర్భంగా సడన్ గా రైల్ రోకో , రాస్తారోకో నిర్వహించడం , ఈ సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ని దగ్దం చేయడం , పోలీసు స్టేషన్లకు నిప్పు పెట్టడం , పోలీసులు - మీడియా - రైల్వే సిబ్బంది తదితరులపై దాడులు జరగడం తెల్సిందే. తమ డిమాండ్ల సాధనకు ముద్రగడ డేడ్ లైన్ విధించిన నేపధ్యంలో ప్రభుత్వం కాపు ప్రతినిధులతో చర్చలు జరిపింది. మంత్రి వర్గ ఉపసంఘం నియమించింది. ఇక బీసీలు కూడా కాపు రిజర్వేషన్ వ్యవహారం తమకు ఇబ్బంది కరమని స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. గడువు సమీపించడంతో రేపటి నుంచి ఆమరణ దీక్షకు దిగాలని ముద్రగడ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తన దీక్షకు ఎవరూ రావద్దని, ఇంటి దగ్గరే వుండి, ఓ పూట భోజనం మానేసి, వీధిలో కంచంపై గరిటతో కొడుతూ సంఘీభావం తెలపాలని పిలుపు నిచ్చారు. అయితే పెద్దయెత్తున యువత తరలిరావడానికి సిద్ధమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

అందుకే పోలీసుల నిఘా పెంచారు. కిర్లం పూడి , తుని , అమలాపురం తదితర ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసులను మోహరించారు. ముద్రగడ దీక్షకు మద్దతుగా పెద్దసంఖ్యలో యువత ఇక్కడకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు తమకు సమాచారం ఉందని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాశ్‌ పేర్కొంటూ, వారిని అడ్డుకునేందుకు జిల్లావ్యాప్తంగా వాహన తనిఖీలు చేపడుతున్నట్లు చెబుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ రావొద్దని సూచించారు. వాహనాల తనిఖీ కోసం 35 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు, జిల్లావ్యాప్తంగా 10 కంపెనీల ప్రత్యేక బలగాలు, నాలుగు కంపెనీల ర్యాపిడ్‌ ఫోర్స్‌తో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్పీ చెబుతున్నారు.శాంతియుతంగా ఆందోళన చేసేవారిని పోలీసులు ఏమీ చేయరని ఎస్పీ స్పష్టం చేశారు. ఆందోళన పేరుతో విధ్వంసాలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేసారు.

English summary

Ex-Minister Mudragada Padnabham to Indefinite Strike on tomorrow by demanding Reservations for Kapu Caste people.East Godavari S.P says that 35 check posts and 10 police forces have been bought to East Godavari district .