నేరగాళ్లకు, మోసాలకు అడ్డాగా నవ్యాంధ్ర 

Navyandhra Pradesh is changing as a den for Offenders and Cheaters

01:46 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Navyandhra Pradesh is changing as a den for Offenders and Cheaters

రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ మరో సింగపూర్, మలేషియా లా తీర్చిదిద్దడం సంగతి అలా ఉంచితే, నేరగాళ్లకు అడ్డాగా మారిపోతున్న వైనం కనిపిస్తోంది. పెరుగుతున్న నేరాలు, ఘోరాలు చూస్తుంటే నేరాంధ్రప్రదేశ్ గా రూపుదాల్చి, నేరాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తాజాగా అత్యంత వెనుకబడిన రాష్ట్రాలను సైతం పక్కకు నెట్టి క్రైమ్‌ రేటులో ఈ ఏడాది 4వ స్థానానికి చేరిపోయింది. ఇక ఆర్థిక మోసాలకు కొదవ లేకుండా వుంది. రాష్ట్రంలో నేరాల రేటు ప్రతి లక్షమంది జనాభాకి 225.1 గా ఉందని పోలీసు శాఖ ఇటీవల ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకి నేర నివేదిక అందించింది.

ఇందులో వెలుగుచూసిన వివరాలు ఓ సారి పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాల్లో అత్యధికంగా మోసాలే కావడం విశేషం. ఆర్థిక మోసాలకు యాభై లక్షల మంది సామాన్య డిపాజిటర్లు బలైనట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. వేలకోట్ల రూపాయల గోల్‌మాల్‌ జరిగింది. పదుల సంఖ్యలో బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2012 నుంచి 2015 వరకు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక నేరాల వల్ల దాదాపు పది లక్షల మంది సామాన్యులు నష్టపోయారు. అభయ, అగ్రి గోల్డ్‌, అక్షయ గోల్డ్‌, హెచ్ఐఎం, ఎస్‌ఐఎంఎస్‌ తదితర కంపెనీలకు సంబంధించి 15 కేసులు నమోదుకాగా, ఈ కేసుల్లో ఇరుక్కున్న డబ్బు రూ. 5,201.32 కోట్లని నివేదిక చెబుతోంది.

బ్యాంక్‌ మోసాలకు సంబంధించి 13 కేసులు నమోదు కాగా, రూ. 14.21 కోట్లు గోల్‌మాల్‌ అయ్యాయి. 2012 నుంచి 2015 వరకు రాష్ట్రంలో వివిధ రూపాల్లో జరిగిన ఆర్థిక నేరాల వల్ల రూ. 7,711.75 కోట్లు గోల్‌మాల్‌ అయిపోగా, అధికారులు కేవలం రూ. 4091.28 కోట్ల ఆస్తులు మాత్రం అటాచ్ చేశారు. సైబర్‌ నేరాలు 42.7 శాతం పెరిగిపోగా, విచారణకు అర్హమైన నేరాలు 3.92 శాతం, మహిళలపై నేరాలు 3.40 శాతం, హత్యలు 4.31 శాతం, దొమ్మీ కేసులు 33.4 శాతం, కిడ్నాప్‌ కేసులు 15.69 శాతం, నష్టం కలిగించే కేసులు 10.9, బందిపోటు దొంగతనాలు 28 శాతం, దొంగతనాలు 10.90 శాతం, చోరీలు 1.69 శాతం హెచ్చాయని ఆ నివేదిక తేటతెల్లం చేస్తోంది.

ఇక, ఆర్థిక నేరాలతో రాష్ట్రం అల్లకల్లోలంగా మారుతోందని, అమాయక ప్రజలే లక్ష్యంగా వేల కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పేసిన మోసపూరిత కంపెనీల దెబ్బకు లక్షల మంది సామాన్యులు ఆర్థికంగా చితికిపోయారని నివేదిక చెప్పే నిజాలు. మరి ఏలిన వారు ఎలాంటి తక్షణ చర్యలకు ఉపక్రమిస్తారో చూడాలి.

English summary

Navyandhra Pradesh is changing as a den for Offenders and Cheaters. As per latest reports it is becoming as a den for cheaters.