తాను చనిపోతూ.. 8 మందికి పునర్జన్మనిచ్చాడు

Nellore Subbareddy donated his organs to 8 people

04:08 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Nellore Subbareddy donated his organs to 8 people

కొందరు బతికుండగానే ఎందరినో వేధించుకు తింటారు. అలాంటి వాళ్ళు పోతే పోయాడురా, గొడవ వదిలింది అంటూ అనుకోవడం వింటుంటాం. కానీ, మానవత్వం మూర్తీ భవించిన 35 ఏళ్ల సుబ్బారెడ్డి ఆదర్శవంతుడిగా తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్నాడు. అందుకే చనిపోతానని తెలిసినా, ఏదైనా మంచి చేయాలన్న ఉద్ధేశ్యంతో ఎనిమిది మందికి అంతిమ ఘడియలో అవయవదానం చేసి పునర్జన్మనిచ్చాడు. నెల్లూరులోని నారాయణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా కరేడు గ్రామానికి చెందిన 35 ఏళ్ల సుబ్బారెడ్డి, నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలోని ఓ బ్రాందీ షాపులో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు.

ఈనెల 2న ఆయన బైక్ పై వెళ్తూ యాక్సిడెంట్ కి గురై కోమాలోకి వెళ్లాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా బాధితుడు బ్రెయిన్ డెడ్ అయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కుటుంబసభ్యుల అనుమతితో మంగళవారం సుబ్బారెడ్డి అవయవాలను సేకరించారు. గుండె, కిడ్నీ, ఊపిరితిత్తులు, లివర్, నేత్రాలను సేకరించారు. అవయవ సేకరణ విజయవంతం కావడంతో డాక్టర్లు, సుబ్బారెడ్డి ఫ్యామిలీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే కృష్ణపట్నం పోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా గుండెను గుంటూరుకు తరలించారు. సుబ్బారెడ్డి లివర్ ను విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి, ఊపిరితిత్తులను చెన్నైలోని పోర్టిస్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి, ఒక కిడ్నీని నారాయణ ఆసుపత్రికి, మరో కిడ్నీని తిరుపతిలోని స్విమ్స్ కి తరలించారు.

ఇక రెండు నేత్రాలను నెల్లూరులోని మోడరన్ ఐ ఆసుపత్రి సేకరించింది. అవయవాలను తరలింపులో ఎక్కడా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. మొత్తం సుబ్బారెడ్డి అవయవాలను 8 మందికి అమర్చడానికి ఏర్పాట్లు చకచకా చేసారు. తన మరణానంతరం అవయవాలను దానం చేయాలని భర్త చెప్పిన విషయాన్ని సుబ్బారెడ్డి సతీమణి శివకుమారి గుర్తు చేసుకుంది. తన భర్త అవయవాల ద్వారా మరో ఎనిమిది మందికి ప్రాణదానం చేసే అవకాశం వచ్చిందన్నారు. తనకు ఒక బాబు, పాప ఉన్నారని దాతలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలన్నారు. ఇప్పుడిప్పుడే అవయవ దానంపై అవగాహన పెరుగుతోంది. కొందరు అయితే మొత్తం చనిపోయాక తమ బాడీలను ప్రయోగశాలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

English summary

Nellore Subbareddy donated his organs to 8 people