ఫేస్ బుక్ లో కామెంట్స్ కి ట్రాన్స్ లేషన్ సౌకర్యం

New option in Facebook

01:11 PM ON 5th July, 2016 By Mirchi Vilas

New option in Facebook

సోషల్ మీడియాలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఫేస్ బుక్ ఎప్పటికప్పుడు సాంకేతిక అంశాలు అందుబాటులోకి తెస్తూ, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది. అధికారంలో ఫేస్ బుక్ వినియోగదారులకు ఇప్పుడు మరో శుభవార్త అందిస్తోంది. భిన్న భాషల్లో కామెంట్లను అనువదించగలిగే సాంకేతికత సాయంతో భాషాపరమైన అడ్డుగోడలను బద్దలుకొట్టేందుకు ఫేస్ బుక్ సమాయత్తమవుతోంది. 'మల్టీలింగువల్ కంపోజర్' పేరిట తమ సాఫ్ట్ వేర్ డెవలపర్లు ఓ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు సంస్థ వెల్లడించింది. ఓ భాషలో చేసిన కామెంట్లను ఈ సాంకేతికత సాయంతో భిన్న భాషల్లో చూసే వీలుంది.

అంటే వినియోగదారులు తమకు నచ్చిన భాషల్లో కామెంట్లను చూసుకోవచ్చన్నమాట. సమాచారాన్ని, ఆలోచనలను భిన్న భాషల్లో పంచుకునేందుకు ప్రజలు ఫేస్ బుక్ ను ఉపయోగిస్తున్నారు. 'నిజానికి 50 శాతం మంది ప్రజలు ఆంగ్లం కాకుండా ఇతర భాషల్లో మాట్లాడుకుంటున్నారు. అందుకే ప్రజలను అనుసంధానించడంలో భాషాపరమైన అడ్డుగోడలు బద్దలుకొట్టేందుకు ఎప్పటినుంచో మేం సమాలోచనలు జరుపుతున్నాం' అని ఫేస్ బుక్ సంస్థ తన బ్లాగ్ ద్వారా వెల్లడించింది. ఈ సాంకేతికతకు ఇప్పటికే కొన్ని పరీక్షలు పూర్తయ్యాయి. త్వరలో ఇది అందుబాటులోకి రాబోతోంది.

తొలిదశలో 45 భాషల్లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అకౌంట్ సెట్టింగ్స్ లోని 'లాంగ్వేజ్ సెలక్షన్' ఆప్షన్ ద్వారా దీన్ని ఉపయోగించిన వినియోగదారులు భిన్న భాషల్లో కామెంట్లను చూడగలిగారు. ఇంకా కామెంట్లు చేయగలిగారు. అయితే ప్రస్తుతం ఇది డెస్క్ టాప్ సేవలకే అందుబాటులో ఉందని, త్వరలో మిగతా వేదికలపైకీ దీన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఫేస్ బుక్ పేర్కొంది.

English summary

New option in Facebook