దేశ వ్యాప్తంగా ఎన్ఐఎ సోదాలు 

NIA Rides All Over India

06:26 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

NIA Rides All Over India

భారత గణతంత్ర వేడుకల సందర్భంగా అలజడి సృష్టించాలని తీవ్రవాదులు చేస్తున్న ప్రయత్నాలను పసిగట్టిన భద్రతా యంత్రాంగం అందుకనుగుణంగా చర్యలు చేపట్టింది. ఉగ్రవాదులు రెచ్చిపోయే ప్రమాదం పొంచివుందన్న ఉద్దేశ్యంతో యంత్రాంగం అప్రమత్తమైంది. దేశంలో దాడులకు పాల్పడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ(ఎన్‌ఐఏ) విస్తృత సోదాలు చేపట్టింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, బెంగళూరు, కోల్‌కతా, ఛండీగఢ్‌ తదితర నగరాల్లో భద్రతా బలగాలు విస్తృత తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో నలుగురు, బెంగళూరులో ఆరుగురు, మహారాష్ట్రలోని థానె నగరంలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శంషా బాద్ ఎయిర్ పోర్ట్ లోకి సందర్శకులను అనుమతించడం లేదు. ఈనెల 31వరకు సందర్శకులను అనుమతించరాదని నిర్ణయించిన సంగతి తెల్సిందే.

డిల్లీలో ముగ్గురు అనుమానిత వ్యక్తులు ప్రవేశించినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులు పఠాన్‌కోట్‌లో హెచ్‌పీ 01డీ 2440 నంబరు గల కారును అద్దెకు తీసుకుని, అనంతరం కారు డ్రైవర్‌ను చంపి డిల్లీకి వచ్చినట్లు భావిస్తున్నారు. డిల్లీ, పరిసర ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. డిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు.

కాగా ఈనెల 19న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు డిల్లీ పోలీసులు తెలిపారు. వీరందరినీ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. జనవరి 26న దిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలను భగ్నం చేయాలని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు కుట్రపన్నినట్లు నిఘావర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లో పట్టుబడిన అనుమానితుల వద్ద పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా మరో 25 మందిని ఎన్‌ఐఏ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు బోగట్టా. అదుపులో తీసుకున్నవారిని డిల్లీకి తరలించి పూర్తిస్థాయిలో విచారించనున్నట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. పట్టుబడిన వారంతా ఉగ్రవాదులకు సహకారం అందించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఓ ప్రకటన విడుదల చేయనున్నట్లు చెబుతున్నారు.

English summary

National Investigation Agency (NIA) rides all over in India because of the threat of terrorists on up coming Republic Day