భారత్ లో నైట్రోజన్ డయాక్సైడ్ పెరుగుతోంది

Nitrogen Dioxide Rate Rising In India

05:34 PM ON 17th December, 2015 By Mirchi Vilas

Nitrogen Dioxide Rate Rising In India

భారతదేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందట. ప్రధానంగా నైట్రోజన్ డయాక్సైడ్(NO2)స్థాయిలు గాలిలో ఎక్కువగా పెరుగుతున్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను ఆ సంస్థ తాజాగా విడుదల చేసింది. హై రిజల్యూషన్ గ్లోబల్ శాటిలైట్‌ల ద్వారా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాసా ఈ చిత్రాలను తీసింది. ఇందుకోసం భూమి మీద ఉన్న దాదాపు అనేక ప్రాంతాలను గత దశాబ్ద కాలంగా పరిశీలించింది. భారత్‌తోపాటు దక్షిణ ఆసియా దేశాల్లో గాలిలోని నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయిలు అధికమయ్యాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, ఐరోపాలు ఇప్పటి వరకు ఈ వాయువును అధికంగా విడుదల చేసే దేశాల్లో ఉండేవని, అయితే 2005 నుంచి 2014 వరకు ఈ రేటు తగ్గిందని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇదే కాల వ్యవధిలో దక్షిణ ఆసియా పరిధిలో ఈ వాయువు ఉత్పత్తి అయ్యే రేటు పెరిగిందని అన్నారు. పసుపు-గోధుమ రంగులో ఉండే నైట్రోజన్ డయాక్సైడ్ కార్లు, పవర్ ప్లాంట్లు, పరిశ్రమల నుంచి ఎక్కువగా విడుదలవుతుందని, ఆయా దేశాలు అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అక్కడి పారిశ్రామికీకరణ ఇతర వ్యవస్థల నిర్మాణం వల్ల ఈ వాయువు ఉత్పత్తి అవుతుందని నాసా సైంటిస్టులు తెలిపారు. NO2 విడుదల రేటులో బంగ్లాదేశ్ అన్ని దేశాల కన్నా ముందుందని తెలియజేశారు. నైట్రోజన్ డయాక్సైడ్‌ను తగ్గించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అప్పుడే దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, లేకపోతే శ్వాసకోశ వ్యాధులు రావడంతోపాటు ఇది మన ఆరోగ్యాలపై దుష్ప్రభావాన్ని చూపుతుందని నాసా శాస్త్రవేత్తలు అంటున్నారు.

English summary

Nasa satellite maps shows that during the 2005-2014 period, the emission of the nitrogen dioxide pollutant has gone up significantly in the South Asia region, including India