గ్రేటర్ ఎన్నికల్లో చిత్రాలెన్నో ....

Nomination Process Begins For GHMC Elections

12:27 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Nomination Process Begins For GHMC Elections

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జిహెచ్ఎంసి) ఎన్నికల కు సంబంధించి కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇక అభ్యర్ధుల తుది ఎంపిక, ప్రచార పర్వానికి పదును పెట్టేందుకు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. మొత్తం 150 డివిజన్లకు రెండువేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక గ్రేటర్ ఎన్నికల నామినేషన్ల ఘట్టంలో ఎన్నో చిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వారు సైతం ఇప్పుడు గ్రేటర్ బరిలో నిలుస్తున్నారు. కొందరు నేరుగా రంగంలోకి దిగుతుంటే, మరికొందరు సతీమణులు, ఇతర కుటుంబ సభ్యులను బరిలో దింపుతున్నారు. వివరాల్లోమి వెళితే, .....

మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి తార్నాక డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నారు. మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మెహదీపట్నం నుంచి మజ్లిస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డి రాంనగర్ డివిజన్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా పని చేసిన దిడ్డి రాంబాబుకు ఇప్పటి వరకు ఏ పార్టీ నుంచి టిక్కెట్ రాలేదు. కాగా 2014 ఎన్నికల్లో వైసిపి తరఫున ఖైరతాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన దివంగత పిజెఆర్ కుమార్తె విజయా రెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ కార్పోరేటర్ అభ్యర్థిగా బరిలో దిగారు.మాజీ కేంద్రమంత్రి, దివంగత ఆలె నరేంద్ర సతీమణి ఆలె లలిత గౌలిపుర డివిజన్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. టిడిపి మాజీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గతంలో సైదాబాద్ నుంచి కార్పోరేటర్‌గా పని చేశారు. ఇప్పుడు ఆ డివిజన్ మహిళ జనరల్ కావడంతో. ఆయన. సతీమణి స్వర్ణలతా రెడ్డిని టిఆర్ఎస్ నుంచి రంగంలో దింపారు. ఇక కాంగ్రెస్ పార్టీ మాజీ ఫ్లోర్ లీడర్ కాలేరు శ్రీనివాస్.. గోల్నాక మహిళా జనరల్ కావడంతో ఆయన భార్య పద్మను తెరమీదికి తెచ్చారు.. అదికూడా ఆయన టి ఆర్ ఎస్ లో చేరి, పద్మ ను ఆ పార్టీ నుంచి పోటీ పెట్టారు.

ఇటీవల టిఆర్ఎస్ లో చేరిన బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ ప్రకాశ్ గుడిమల్కాపూర్ టిక్కెట్ దక్కించుకున్నారు. ఉప్పల్ నుంచి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన టిఆర్ఎస్ ఇంఛార్జ్ బి సుభాష్ రెడ్డి ఇప్పుడు తన సతీమణి స్వర్ణను హబ్సిగూడ నుంచి కార్పోరేటర్ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నియోజకవర్గ టి ఆర్ ఎస్ ఇంఛార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి సతీమణి కవిత వెంకటేశ్వర కాలనీ నుంచి పోటీకి నిలిచారు. .

జూబ్లీహిల్స్ నుంచి టి ఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన మురళీ గౌడ్ నయుడు సంజయ్ గౌడ్ ఇప్పుడు యూసుఫ్ గూడ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. అంబర్ పేట నుంచి 2014 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసిన అహ్మద్ ప్రస్తుతం మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా అంబర్ పేట డివిజన్ నుంచి బరిలో నిలిచారు. రాజ్యసభ సభ్యుడు కె కేశవ రావు కూతురు విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. - మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ జాంబాగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ముప్పై ఏళ్ల క్రితం 1986లో తొలిసారిగా ముఖేష్ గౌడ్‌ జాంబాగ్‌ నుంచి పోటీ చేసి కార్పొరేటర్‌గా ఎన్నికై రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అందుకే ఇప్పుడు జాంబాగ్‌ నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించేందుకు ముఖేష్‌గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో నిలిచారు.

సోమాజిగూడ నుంచి విజయలక్ష్మి, అమీర్ పేట నుంచి శేషు కుమారి, వెంగళరావు నగర్ నుంచి కిలారి మనోహర్, కెపిహెచ్‌‍హి నుంచి అడుసుమిల్లి వెంకటేశ్వర రావు పోటీ చేస్తున్నారు. ఇక టిఆర్ఎస్ సీమాంధ్రులకు టిక్కెట్లు ఇచ్చింది. కనీసం పదిమందిని సెటిలర్లను రంగంలో దించాలని ఆపార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. మొత్తానికి గ్రేటర్ ఎన్నికల్లో మరిన్ని చిత్రాలు చోటుచేసుకోవడం ఖాయం.

English summary

Nomination process started started for 150 wards in GHMC elections