అగ్ర రాజ్యాలు వ్యతిరేకించినా, లాంగ్‌ రేంజ్‌ రాకెట్‌ ప్రయోగం

North Korea fires long-range rocket

09:55 AM ON 8th February, 2016 By Mirchi Vilas

North Korea fires long-range rocket

ఎట్టకేలకు ఉత్తరకొరియా ప్రభుత్వం ముందుగా అనుకున్నట్లుగానే లాంగ్‌ రేంజ్‌ రాకెట్‌ని ఆదివారం ఉదయం ప్రయోగించింది. టాంగ్‌చాంగ్‌ రీ లాంచ్‌ స్టేషన్‌ నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. అక్కడి కాలమానం ప్రకారం.. ఉదయం 9.30 గంటలకు రాకెట్‌ ప్రయోగం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు వెల్లడించాయి. రాకెట్‌ ఉపగ్రహాన్ని తీసుకెళ్లి విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్లు పేర్కొంది.

అయితే అగ్రదేశాలు దీన్ని ఖండించాయి. ఉపగ్రహం ముసుగులో క్షిపణిని ప్రయోగించారని ఈ దేశాలు భావిస్తున్నాయి. రెచ్చగొట్టే చర్యగా అమెరికా పేర్కొంది. ఉత్తర కొరియా ప్రయోగాన్ని జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబే తీవ్రంగా ఖండించారు.

కాగా ఈ ప్రయోగంతో పొరుగుదేశమైన దక్షిణకొరియా అప్రమత్తమైంది. దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హై జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమాచారం ఏర్పాటు చేసారు. వాస్తవానికి ఈ ప్రయోగాన్ని ఫిబ్రవరి 8-24 మధ్య చేపట్టనున్నట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. అయితే ప్రయోగం తేదీని ముందుకు జరిపినట్లు జపాన్‌ మీడియా వర్గాలు అంటున్నాయి.. ఆ ప్రకటన వెలువడిన 24 గంటల్లోపే రాకెట్‌ లాంచింగ్‌ పూర్తవడంతో ప్రపంచ దేశాలు ఉత్తరకొరియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తర కొరియా జనవరి 6న నాలుగోసారి నిర్వహించిన అణుబాంబు పరీక్షలను పలు దేశాలు ఖండించాయి. ఎలాంటి అణు పరీక్షలు, ఖండాంతర క్షిపణి ప్రయోగాలు చేపట్టరాదని ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాపై నిషేధం విధించింది. అయితే వాటిని ధిక్కరించి ఆ దేశం నేడు మరోసారి రాకెట్‌ ప్రయోగం చేపట్టింది.

మరోపక్క రాకెట్‌ లాంచ్‌తో అమెరికా అధ్యక్షుడు ఒబామా, మాజీ విదేశాంగ కార్యదర్శి హిలరీ క్లింటన్‌పై రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థులు విమర్శల దాడికి దిగారు. అసమర్థుడైన అధ్యక్షుడు ఉండటం వల్లే ఈ క్షిపణి ప్రయోగం జరిగిందని.. అసలు ఒబామా ఏం చేస్తున్నారో ఆయనకే తెలియదని రిపబ్లికన్‌ పార్టీ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఆరోపించారు.

English summary

North Korea has fired a long-range rocket, which critics say is a test of banned missile technology.The launch was condemned by Japan, South Korea and the US, who have requested an emergency meeting of the UN Security Council