కొత్త పార్లమెంట్ భవంతి కోసం కసరత్తు

Parliament Speaker Proposes For New Parliament Building

12:48 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Parliament Speaker Proposes For New Parliament Building

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత దేశానికి పార్లమెంట్ దేవాలయం లాంటిది. పిఎమ్ గా ప్రమాణం చేసాక తొలిసారి పార్లమెంట్ భవనం లోకి అడుగిడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ మెట్లకు పాదాభివందనం చేసిన సంగతి తెల్సిందే కదా. మరి 88ఏళ్ల క్రితం నిర్మించిన ప్రస్తుత పార్లమెంటు భవనం శిథిలావస్థకు చేరుకునేలా పరిస్థితి రాబోతోంది. దీనికి తోడు పెరుగుతున్న అవసరాలకు సరిపడా స్థలం అందుబాటులో లేదు. అందుకే అధునాతన సాంకేతిక సౌకర్యాలతో కొత్త పార్లమెంటు భవంతి సాకరమయ్యే అవకాశం కనిపిస్తోంది. నూతన ప్రాంగణ నిర్మాణ అవసరాన్ని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సూచిస్తున్నారు. ఈమేరకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడుకు సభాపతి లేఖ రాశారు.. అంతేకాదు ఈ ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖ.. కేంద్ర కేబినెట్‌ ముందు ఉంచుతుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.

ప్రస్తుత భవనాన్ని ‘గ్రేడ్‌-ఐ వారసత్వ నిర్మాణం'గా వర్గీకరించిన నేపథ్యంలో దానికి నిర్మాణ సంబంధ మరమ్మతులు, జోడింపులు, మార్పులు చేపట్టడానికి తీవ్ర పరిమితులు ఉన్నందున రెండు అవకాశాలను పరిశీలించాలని స్పీకర్‌ సూచించారు. ‘ప్రస్తుత పార్లమెంటు సముదాయంలోనే కొత్త భవనాన్ని నిర్మించి, కొన్ని వసతులు, సేవలను అందులోకి మార్చడం. . రాజ్‌పథ్‌కు మరోవైపున పార్లమెంటు కొత్త భవనాన్ని నిర్మించడం ఈ రెండు అంశాలు వున్నాయి' అని స్పీకర్ సుమిత్రా మహాజన్ స్పష్టంచేశారు. . ప్రస్తుత భవనానికి, ప్రతిపాదిత కొత్త సముదాయానికి మధ్య భూగర్భంలో ఒక మార్గాన్ని నిర్మించాలని ఆమె సూచించారు.

కొత్త భవన నిర్మాణం కోసం స్పీకర్‌ రాసిన లేఖలో ఇందుకు గల కారణాలను ప్రస్తావించారు. రాజ్యాంగంలోని 81వ అధికరణలోని క్లాజ్‌ (3) ప్రకారం.. 2026 తర్వాత లోక్‌సభలోని సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం పార్లమెంటు భవనంలో సీటింగ్‌ సామర్థ్యం 550 వరకే ఉండడంతో ఇక పెంచుకోవడానికి అవకాశం కూడా లేదు. అధికరణం ప్రకారం.. 2021 జనాభా లెక్కల ఆధారంగా ప్రాతినిధ్యాన్ని పెంచాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి . అయితే పార్లమెంటు ప్రాంగణ భవనం పాతదై పోతుండటం, కార్యకలాపాలు విస్తరించడం, సిబ్బంది పెరిగిపోవడం వంటి కారణాల వల్ల భవనానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని స్పీకర్‌ తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.

ప్రస్తుత భవనం 1927లో ప్రారంభించారని, అప్పట్లో సిబ్బంది, భద్రతా బలగాలు, సందర్శకులు, పార్లమెంటరీ కార్యకలాపాలు పరిమితంగా ఉండేవి. కాలక్రమేణా పార్లమెంటరీ కార్యకలాపాలు, సిబ్బంది, సందర్శకుల్లో ఎన్నో రెట్లు హెచ్చింది. పార్లమెంటరీ పర్యవేక్షణ విధుల పెరుగుదలకు అవకాశం ఉందని స్పీకర్‌ వివరించారు. అలాగే కమిటీల సంఖ్య, భద్రతా అవసరాలు పెరుగుతుండటం వల్ల ఖాళీ ప్రదేశానికి డిమాండ్‌ అనేక రెట్లు హెచ్చింది.

సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఎంపీలకు అధునాతన పరికరాలను సమకూర్చాల్సిన అవసరం ఏర్పడిందని స్పీకర్ అభిప్రాయపడుతున్నారు. . దీనివల్ల మెరుగైన సాంకేతిక సాధనాలను వారు ఉపయోగించగలగడంతోపాటు పార్లమెంటు కూడా కాగితరహితంగా మారుతుందని . ఇందుకోసం లోక్‌సభ చాంబర్‌లోని సీటింగ్‌ ఏర్పాట్లను పునర్‌వ్యవస్థీకరించాల్సి ఉంటుందని ఆ లేఖలో స్పీకర్ వివరించారు. దీనికి పరిమితులు ఉండటం వల్ల కొత్త భవన నిర్మాణాన్ని చేపట్టాలని ఆమె సూచించారు.

కాగా, కొత్త పార్లమెంటును నిర్మించాలన్న ప్రతిపాదన ఏడాది క్రితం జరిగిన బడ్జెట్ కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చింది. రానున్న 100 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ కేవీ థామస్ ఇప్పటికే సూచించారు.

స్పీకర్ సూచనతో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి కసరత్తు మొదలయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో వీలైనంత త్వరగా , ఆత్యాధునిక హంగులతో పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అయితే ప్రస్తుత భవనం స్థానంలోనే నిర్మిస్తారా , కొత్త ప్రదేశంలో నిర్మించడం ద్వారా పాత భవనాన్ని పురావస్తు శాఖకు అప్పగిస్తారా అనేది స్పష్టం కావాల్సి వుంది.

English summary