విమానంలో ప్రసవించి..బిడ్డను కోల్పోయి...

Philippine Woman Gives Birth On Flight

01:23 PM ON 3rd May, 2016 By Mirchi Vilas

Philippine Woman Gives Birth On Flight

ఇదో విషాద ఘటన ...విమానంలోనే ప్రసవమై, అనుకోకుండా హైదరాబాద్‌ వచ్చి చేరిన ఫిలిప్పైన్స్‌ మహిళకు తీరా నెలలు నిండని శిశువు మరణించటంతో దిక్కుతోచని స్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పర్యాటక శాఖ, అపోలో హాస్పిటల్స్‌ సాయమందించాయి. బిడ్డ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసారు. వివరాల్లోకి వెళ్తే , ఫిలిప్పైన్స్‌కు చెందిన 40ఏళ్ల గ్రేస్‌ అలెగ్జాండ్రియా దుబాయిలో నర్స్‌గా పనిచేస్తుంది. ఏడు నెలల గర్భిణి అయిన ఆమె స్వదేశంలో తల్లిదండ్రుల వద్దకు చేరేందుకు తన టీనేజ్‌ కుమారుడ్ని వెంటబెట్టుకొని దుబాయ్‌లో విమానం ఎక్కింది. అయితే గగనతలంలోనే ఆమెకు పురిటినొప్పులు మొదలయ్యాయి. విమానంలోనే ప్రసవం జరిగి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే నెలలు నిండని శిశువు పరిస్థితి, అటు తల్లి పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో దించేశాడు.

ఇవి కూడా చదవండి:భార్య డాన్స్ చేసిందని.. ఆమెను భర్త ఏం చేసాడో తెలుసా?

ముందస్తు సమాచారం అందుకొన్న అపోలో వైద్యులు ఆమెను విమానాశ్రయం నుంచి నేరుగా జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన బిడ్డకు నగరంలోనే క్రైస్తవ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపేందుకు ఆమె ప్రయత్నించింది. అయితే చర్చిల్లో సభ్యులైతేనే తమ శ్మశానాల్లో అంత్యక్రియలకు అవకాశం ఉంటుందని నగరంలో పలు చర్చిలు తేల్చి చెప్పటంతో... మృతదేహాన్ని భద్రపరిచారు. విషయం తెలుసుకొన్న తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మానవతా దృక్పథంతో వెంటనే స్పందించారు. అలెగ్జాండ్రియాకు సాయమందించాలని శాఖ అధికారులతోపాటు పోలీసులను ఆదేశించారు. సోమవారం వెంకటేశం స్వయంగా అపోలోకు వెళ్లి ఆమెకు భరోసా ఇచ్చారు. శిశువు భౌతిక కాయానికి మంగళవారం తిరుమలగిరి శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. అలాగే అపోలో ఆస్పత్రి బిల్లులతో పాటు, విమానం టికెట్‌, ఇతర ఖర్చులను పర్యాటక శాఖ భరిస్తుందని ప్రకటించారు. శిశువు అంత్యక్రియల అనంతరం మంగళవారం సాయంత్రం గ్రేస్‌ అలెగ్జాండ్రియాను విమానంలో ఫిలిప్పైన్స్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెంకటేశం వివరించారు.

ఇవి కూడా చదవండి:హీరో గోపీచంద్ భార్య రేష్మ గురించి మీకు తెలియని నిజాలు

English summary

A Philippine Woman Gives Birth On Flight while she was travelling in Dubai Flight. Pilot landed the flight Emergencyly at Shamshabad Airport.