కేంద్రమంత్రి దత్తన్నసహా నలుగురిపై  కేసు

Police Case On Central Minister Dattatreya

06:37 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Police Case On Central Minister Dattatreya

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన నేపధ్యంలో సైబరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏఐస్‌ఏ నాయకుడు ప్రశాంత్‌ ఫిర్యాదు మేరకు వీసీ అప్పారావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ(దత్తన్న), ఏబీవీపీ నాయకుడు సుశీల్‌కుమార్‌, బీజేవైఎం నాయకుడు విష్ణుపై కేసు నమోదు చేసినట్లు గచ్చిబౌలి సీఐ జూపల్లి రమేశ్‌ తెలిపారు.

హెచ్‌సీయూలో పరిశోధక(పిహెచ్ డి) విద్యార్థి వేముల రోహిత్‌ ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యార్థులు ఇందుకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ హెచ్‌సీయూలో ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా శవపరీక్ష కోసం రోహిత్‌ మృతదేహాన్ని తరలించడానికి యత్నించిన పోలీసులను విద్యార్థులు అడ్డగించారు. ఆదివారం రాత్రి పోలీసులు పలుమార్లు చేసిన ప్రయత్నాలను విద్యార్థులు భగ్నం చేశారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోహిత్‌ తల్లిదండ్రులు యూనివర్శిటీకి చేరుకోవడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో విద్యార్థులను చెదరగొట్టి మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. దీంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

కాగా విద్యార్థి ఆత్మహత్య ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించి, యూనివర్శిటీలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మానవ వనరుల అభివృద్ధిశాఖ ఓఎస్‌డీ షకీలా శంషు, డిప్యూటీ సెక్రటరీ సూరత్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ద్విసభ్య కమిటీని ఏర్పాటుచేసింది.

English summary

A police case filed on Central Minister Bandaru Dattatreya on Gachibowli