శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కాల్పుల కలకలం

Police Mock Drill In Shamshabad airport

02:59 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Police Mock Drill In Shamshabad airport

పంజాబ్ లోని పఠాన్ కోట్ ఘటన ఇంకా సమసిపోకుండానే హైదరాబాద్  శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయం లో కాల్పుల ఘటన కలకలం సృష్టించాయి. ఉత్కంఠ రాజ్యమేలింది. ఉదయం 11.గంటల ప్రాంతంలో ఓవైపు వచ్చిపోయే ప్రయాణికులు, మరోవైపు   సిబ్బంది ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు.

సడన్ గా సాయుధులైన నలుగురు ఉగ్రవాదులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి చొరబడ్డారు. అధునాతన ఆయుధాలతో కాల్పులు జరుపుతూ, విమానాశ్రయం ప్రధాన ద్వారం వైపు ఉన్న పార్కింగ్ ప్రాంతంలోకి దూసుకుపోతున్నారు.  ఇంతలో పార్కింగ్ ప్రాంతంలోని వాటర్‌ఫాల్స్ షో సైడ్ రోడ్డుపైకి రయ్.. రయ్‌మంటూ ఓ మినీ బస్సు ప్రయాణికులతో అక్కడికి వచ్చేసింది.  అక్కడే ప్రయాణికుల్ని తీసుకెళ్లేందుకు ఆగి ఉన్న బస్సులోకి నలుగురు ఉగ్రవాదులు చేతుల్లో ఏకే-47 తుపాకులతో నోటికి వచ్చినట్టు గట్టిగా అరుస్తూ బస్సులోకి ఇద్దరు ప్రవేశించారు. మరో ఇద్దరు బస్సు బయట నిలబడి కాల్పులు జరుపుతూ అటువైపు ఎవరూ రావొద్దని హెచ్చరించారు. బస్సు అరుపులు, కేకలు, హాహాకారాలు, ఆర్తనాదాలతో  భయానక వాతావరణం రాజ్యమేలింది. అసలు ఏం జరుగుతోందో తెలియని స్థితి.  ఇలా  దాదాపు రెండుగంటల పాటు  ఉత్కంఠ కొనసాగింది.  అంతలోనే ఎయిర్‌పోర్టు భద్రతా బలగాలు బస్సును చుట్టుముట్టాయి. ముసుగులు ధరించిన దుండగులు ఉగ్రవాదులని తేలిపోయింది. పక్కావ్యూహంతో భద్రతా సిబ్బంది ప్రాణాలకు తెగించి బస్సులోకి ప్రవేశించారు.

అలాగే  మరికొందరు బస్సు చుట్టు పహారా కాశారు. ఉగ్రవాదమూకల్లో ఇద్దరిని భద్రతాసిబ్బంది మట్టుపెట్టారు. మరో ఇద్దరిని ప్రాణాలతో పట్టుకున్నారు. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. హర్షద్వానాలు ... ఒక్కసారిగా నిశబ్దం ... కానీ  ఇదంతా నిజం కాదు... మాక్ డ్రిల్ అని తెల్సి అంతా నివ్వెరపోయారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు భద్రతా ఏర్పాట్లను పరీక్షించడానికి భద్రతాసిబ్బంది మాక్‌డ్రిల్ నిర్వహించారు. ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రదాడి నేపథ్యంలో సీఐఎఫ్‌ఎఫ్, ఆక్టోపస్, స్థానిక పోలీసు, తెలంగాణ స్పెషల్ పోలీసు, మెరైన్, బాంబు, డాగ్‌స్కాడ్స్, జీఎంఆర్ రక్ష సెక్యూరిటీ తదితర భద్రతావర్గాలు సంయుక్తంగా నిర్వహించిన మాక్‌డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ఎయిర్‌పోర్టు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ భరత్‌కుమార్ కాందార్, మాజీ డీజీపీ హెచ్‌జే దొర, సైబరాబాద్ జాయింట్ సీపీ శివధర్‌రెడ్డి, డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, ఏసీపీ అనురాధ, రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఆర్జీఐఏ) సీఐలు సుధాకర్, భాస్కర్‌రెడ్డి, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ భిక్షంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దేశంలోని కీలక ప్రాంతాలతోపాటు నిషేధిత ప్రాంతాల్లో చోటుచేసుకొంటున్న ఉగ్రవాదదాడుల నేపథ్యంలో.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై నిజంగా ఉగ్రవాద దాడులు జరిగితే.. ఆ అనూహ్య పరిణామాలను ఎలా తిప్పికొట్టాలి? , ఒకవేళ  అనుకోని  సంఘటనలు ఎదురైతే సాధారణ జనంలో ఆత్మస్థెర్యం కల్పించే లక్ష్యంగా మాక్‌డ్రిల్ నిర్వహించారు. సిబ్బందికి తగు సూచనలు, సలహాలు అందించి అవగాహన కల్పించారు.  అత్యాధునిక బాంబ్ డిటెక్టర్ రోబో పనితీరు, భద్రతా దళాల మెరుపుదాడులు గగుర్పాటు కల్గించాయి. మాక్ డ్రిల్ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని అధికారులు ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

1/9 Pages

English summary

Due to attack in pathankot air base central police teams CSIF and Octopus teams conducted a mock drill in Shamshabad airport