ఉగ్రవాదం క్యాన్సర్ లాంటిదన్న  రాష్ట్రపతి

Pranab Mukherjee Message On Republic Day Parade

10:25 AM ON 26th January, 2016 By Mirchi Vilas

Pranab Mukherjee Message On Republic Day Parade

'ఉగ్రవాదం ఎటువంటి సిద్ధాంతాలు లేని ఒక యుద్ధం. అదొక క్యాన్సర్. దాన్ని పదునైన కత్తితో తొలగించాలి. ఇక దేశాల మధ్య విభేదాలుంటాయి. వీటిని చర్చలతో పరిష్కరించుకోవచ్చు. అయితే తూటాల వర్షంలో శాంతి చర్చలు కుదరదు' అని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సోమవారం స్పష్టం చేశారు. భారత 67వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసిన నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పొరుగు వారికి ఎంత దగ్గరగా ఉంటే విభేదాలకు అంతగా ఆస్కారం ఉంటుందన్నారు. విభేదాలను పరిష్కరించుకోవడానికి నాగరిక పద్ధతి ఉందని ఆయన చెబుతూ చర్చలు నిరంతర కార్యక్రమంగా ఉండాలన్నారు.సంస్కరణలు, ప్రగతి కారక చట్టాలు తీసుకురావడం శాసనకర్తల కర్తవ్యమని, నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇతరుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం, ఏకాభిప్రాయ సాధనకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు.

'20వ శతాబ్దంలో శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానంలో గణనీయమైన విప్లవం చోటుచేసుకోవడంతో 21 వ శతాబ్దంలో కడు పేదరికాన్ని నిర్మూలించేలా సంపదను పెంచడానికి దేశాలన్నీ తమ శక్తిని ధారబోస్తాయన్న ఆశాభావం ఉండేది. ఈ శతాబ్దపు తొలి పదిహేనేళ్లలో ఈ ఆశావాదం సన్నగిల్లింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో మునుపెన్నడూ లేని రీతిలో హింస చోటు చేసుకుంది. ప్రాంతీయ అసమానతలు పెచ్చరిల్లాయి. అత్యంత క్రూరత్వాన్ని సంతరించుకునేలా యుద్ధం రూపురేఖలను ఉగ్రవాదం మార్చేసింది. ప్రపంచంలోని ఏ మూలా సురక్షితమని ఇప్పుడు చెప్పలేం' అని రాష్ట్రపతి విచారం వ్యక్తంచేశారు. అంతులేని విద్వేషమే ఉగ్రవాదానికి ప్రేరణ. ఉన్మాద లక్ష్యాలే ఉగ్రవాదానికి స్ఫూర్తి. ఇది ఎటువంటి సిద్ధాంతమూ లేని యుద్ధం. ఉగ్రవాదంలో మంచి ఉగ్రవాదం, చెడు ఉగ్రవాదం అనేవి లేవు. ఉగ్రవాదమనేది పూర్తిగా క్రూరమైనది. వ్యూహాత్మక స్థిరత్వ అసలు ఆధారమైన సరిహద్దులను తిరస్కరించడం ద్వారా ఉగ్రవాదులు చట్టబద్ధమైన పాలనను బలహీన పర్చాలని అనుకుంటారు. అక్రమార్కులు సరిహద్దులను విఫలం చేయగల్గితే ఇక మనం అస్తవ్యస్త యుగం వైపు వెళ్తున్నట్లే. అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఉన్న ఈ సమయంలో ప్రపంచానికి మనమొక ధ్రువతారలా అవతరించే చరిత్రాత్మక అవకాశం ఉపఖండంలో ఉంది. పొరుగుదేశాలతో ఎప్పటి నుంచో ముడిపడి ఉన్న భావోద్వేగ, భౌగోళిక-రాజకీయ సంక్లిష్ట అంశాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నించాలి' అని రాష్ట్రపతి సూచించారు.

అసహన, హింసాత్మక, అహేతుక శక్తుల నుంచి మనల్ని మనం రక్షించుకోవాల ని రాష్ట్రపతి పేర్కొన్నారు. భారత్‌లో మనలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాన్ని కొనసాగించే హక్కు ఉందని ఆయన స్పస్తంచేస్తూ, . అయితే ఈ హక్కుకు.. ముఖ్యంగా నగరాల్లో భంగం వాటిల్లుతోందన్నారు. అక్కడ కాలుష్యం ప్రమాదకర స్థాయులకు చేరింద ని, బహుళ వ్యూహాలు, వివిధ స్థాయుల్లో చర్యలు అవసర మని చెప్పారు.

English summary