అక్కడ పొగ తాగేస్తున్న గర్భిణులు

Pregnancy women smoking cigarettes

05:58 PM ON 21st June, 2016 By Mirchi Vilas

Pregnancy women smoking cigarettes

పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ ప్రకటనలు ఎక్కడబడితే అక్కడ ఊదర గొట్టేస్తున్నా, పొగ తాగడం వలన వచ్చే అనర్ధాల గురించి ఎంతగా విస్తరిస్తున్నా, షరా మామూలే అన్నట్లు ఉంది పరిస్థితి. పైగా పురుషులే కాదు మహిళలు అందునా గర్భిణీలు కూడా పొగ తాగేస్తున్నారు. ఇక ఆపడం ఎవరి తరం అన్నట్టు వ్యవహారం ఉంది. వాస్తవంగా చూస్తే, గర్భం దాల్చినప్పుడు మహిళలు పుట్టబోయే పిల్లల కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. పొగ తాగడం లాంటి అలవాట్లున్నా మానేస్తారు. కానీ ఆస్ట్రేలియాలోని గర్భిణులు మాత్రం పిల్లలు అధిక బరువుతో పుట్టకూడదని, కాన్పు ఎక్కువ నొప్పి లేకుండా తేలిగ్గా అవ్వాలని సిగరెట్లు తాగుతున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది.

పదేళ్ల పాటు పొగతాగడం పై చేసిన పరిశోధనలో.. సిగరెట్లు తాగితే వచ్చే అనారోగ్య సమస్యల కన్నా కాన్పు సమయంలో వచ్చే నొప్పుల గురించే వారు ఎక్కువగా భయపడుతున్నారని, అందుకే ఈ అలవాటు చేసుకుంటున్నట్లు వెల్లడైంది. సిగరెట్ ప్యాకెట్ల పై రాసిన పొగతాగడం పిల్లల బరువు తగ్గిస్తుంది అన్న క్యాప్షన్ ని వారు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, నిజానికి దాని అర్థం పిల్లలు ఉండవలసిన బరువు కన్నా తక్కువగా ఉంటారని, దాంతో వారికి భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి సిగరెట్ తాగవద్దు అని హెచ్చరించడానికి అలా రాస్తారని ఆస్ట్రేలియా నేషనల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు.

చిన్న వయసులో గర్భం దాల్చిన వారు ఇలా భయపడుతున్నారని పేర్కొన్నారు. కొందరేమో అలవాటు లేకపోయినా సిగరెట్లు తాగుతుంటే మరికొందరు ఎక్కువగా తాగేస్తున్నట్లు చెప్తున్నారు. ఈ నివేదిక స్మోక్ ఫ్రీ అనే పత్రికలో ప్రచురించారు. ఏదైనా విషయాన్ని తమకు అనువుగా అన్వయించుకోవడంలో మనుషుల తెలివితేటలు అమోఘం అంటారు కదా, ఇప్పుడీ పొగ తాగడం కూడా లానే ఉంది.

English summary

Pregnancy women smoking cigarettes