'ప్రేమకు' పట్టాభిషేకం చేసి 35 ఏళ్ళు

Premabhishekam Completes 35 Years

11:36 AM ON 18th February, 2016 By Mirchi Vilas

Premabhishekam Completes 35 Years

తెలుగు సినీ చరిత్రలో ఇదో అరుదైన రికార్డు ... ప్రేక్షకులను ధియేటర్ దాకా రప్పించడమే కాదు, చివరికంటా సీట్లలో కూర్చోబెట్టిన మేటి చిత్రం ఇది ... ఎన్నో రికార్డులను తిరగరాసిన ప్రేమ కావ్యం ఇది ... దర్శకరత్నను బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఆవిష్కరించిన చిత్రం ఇది. నటసామ్రాట్ అక్కినేని సినీ జీవితంలో ఓ మైలు రాయి ఇది. అదే 'ప్రమాభిషేకం'. ప్రేమ, త్యాగం మిళితం చేసి ప్రేమకథా చిత్రాలు రూపొందించడానికి ఊతమిచ్చిన చిత్రం ‘ప్రేమాభిషేకం’ . అసలు ఈ సినిమా వచ్చి , విజయవంతమైన వెంటనే చాలా మంది దర్శకనిర్మాతలు ఆలాంటి చిత్రాల వైపు అడుగులు వేశారంటే, ఈ సినిమా వేసిన ప్రగాఢముద్ర ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, దాసరి నారాయణరావు కాంబినేషన్‌ ని శిఖరాగ్రస్థాయికి చేర్చిన చిత్రమిది. ఒక సినిమా కమర్షియల్‌గా చారిత్రక విజయం సాధించడంతో పాటు ‘క్లాసిక్‌’గా ప్రశంసలు అందుకోవడం ‘ప్రేమాభిషేకం’ చిత్రం రుజువు పరిచింది. కొందరు అభిమానులు ఈ చిత్రాన్ని అప్పట్లో 50సార్లు , 100సార్లు కూడా చూసిన సందర్భాలున్నాయి. ఈ చిత్రం విడుదలై ఫిబ్రవరి 18కి సరిగ్గా 35 ఏళ్లు.

‘ప్రేమాభిషేకం’ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం... ఇలా అన్నీ తానై పనిచేశారు దాసరి కృషికి, దేవదాసు తర్వాత అంతటి స్థాయిలో అక్కినేని చేసిన నటనకు మంచి గుర్తింపు లభించింది. అందుకే 37 కేంద్రాల్లో విడుదలైన ‘ప్రేమాభిషేకం’ 30 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకోవడమే కాకుండా అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో కనివిని ఎరుగని రికార్డులు సృష్టించింది. అలాగే ఒక్క అదోనిలో తప్ప మిగిలిన 29 కేంద్రాల్లో 25 వారాలు ఏకధాటిగా ప్రదర్శింపబడింది. 21 కేంద్రాల్లో 200 రోజులు, 10 కేంద్రాల్లో 300రోజులు, 8 కేంద్రాల్లో 365 రోజులు, 6 కేంద్రాల్లో 500 రోజులు, 3 కేంద్రాల్లో 75 వారాలు ఆడిన ఈ చిత్రం సంచలన విజయం సొంతం చేసుకుంది. లేట్‌ రిలీజ్‌లో మరో 13 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకున్న ‘ప్రేమాభిషేకం’ సినిమా సాధించిన రికార్డులు అప్పటికీ, ఇప్పటికీ చెక్కు చెదర లేదు.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తీసిన ఈచిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, మురళీమోహన్, గుమ్మడి, ప్రభాకర్ రెడ్డి, పద్మనాభం, ఈశ్వరరావు, మాస్టర్‌ హరి, జయసుద, శ్రీదేవి, కవిత, నిర్మల, పుష్పలత, టున టున (ముంబై) తదితరులు నటించిన ఈ చిత్రానికి స్వర చక్రవర్తి సంగీతం సూపర్బ్. 1981 జూన్ 14న విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో ‘ప్రేమాభిషేకం’ చిత్ర శతదినోత్సవం జరిగింది. చెన్నై నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చార్టర్డ్‌ ఫ్లయిట్‌లో నటీనటులు, సాంకేతిక నిపుణులు విజయవాడ చేరుకున్నారు. ఒక రోజు ముందుగానే అక్కినేని, అన్నపూర్ణ, వెంకట్‌ విజయవాడ చేరుకుని ఉత్సవ ఏర్పాట్లకు తుదిమెరుగులు దిద్దారు. అప్పటి డీజీపీ ఎం.వి.నారాయణరావు సభకు అధ్యక్షత వహించారు. బాలీవుడ్‌ నటుడు జితేంద్ర ముఖ్య అతిథి. ఎన్టీఆర్‌ జ్ఞాపికలు అందజేశారు. ఈ సినిమా రజతోత్సవం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించగా, ‘కన్నడ కంఠీరవ’ రాజ్‌కుమార్‌, ‘నడిగర్‌ తిలకం’ శివాజీగణేశన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులకు, స్టూడియో స్టాఫ్‌కి హెచ్.ఎం.టి వాచీలను నిర్మాతలు వెంకట్‌, నాగార్జున బహుకరించారు. ఇక చెన్నైలోని ఉడ్‌లాండ్స్‌ హోటల్‌లో ‘ప్రేమాభిషేకం’ స్వర్ణోత్సవం నిర్వహించగా, డి.వి.యస్‌.రాజు సభకు అధ్యక్షత వహిం చారు. ‘ప్రేమాభిషేకం’ హిందీ వెర్షన్ హీరో జితేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్గయ్య వ్యాఖ్యాతగా వ్యవహరించారు. డిసెంబర్‌ 14న నెల్లూరులో ‘ప్రేమాభిషేకం’ మూడు వందల రోజుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ అధ్యక్షత వహించిన ఈ సభకు ఎన్ టి ఆర్ భార్య బసవతారకం, అక్కినేని సతీమణి అన్నపూర్ణ, దాసరి సతీమణి పద్మ హాజరు కావడం ఒక ప్రత్యేకత. రావుగోపాలరావు ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

కేన్సర్ ఇతివృత్తం జొప్పించి ప్రేమ కావ్యంగా మలిచిన ప్రేమాభిషేకం సినిమాలో ప్రేమ సుందరిగా శ్రీదేవి, వ్యభిచారిణి పాత్రలో జయసుధ పోటాపోటీగా నటించారు. ఈ సినిమా షూటింగ్‌ 1980 సెప్టెంబర్‌ 20న అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. రెండు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది. ‘కోటప్పకొండకు వస్తానని మొక్కుకున్నా...’, ‘వందనం అభివందనం’ పాటల్ని మాత్రం చెన్నైలో చిత్రీకరించారు. అక్కినేని పుట్టినరోజున ప్రారంభమైన ‘ప్రేమాభిషేకం’ చిత్రం ఎఎన్ఆర్ పెళ్ళిరోజు (ఫిబ్రవరి 18)న విడుదలైతే, అక్కినేని ‘బ్రదర్‌’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే మహానటుడు ఎన్టీఆర్‌ పుట్టిన రోజు అయిన ఈ సినిమా మే 28కి వంద రోజులు పూర్తి చేసుకుంది. ప్రేమకు పట్టం కట్టిన ప్రేమాభిషేకం ఈనాటికీ టివిలో వచ్చినా అభిమానులు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తుంటారు.

English summary

Akkineni Nageswara Rao's legendary film "Premabhishekam"Completes 35 Years today.This film was directed by Legendary Director in Telugu Film Industry Dasari Narayana Rao.In this film along with Nageswara Rao,murali mohan,Gummadi,Esawara Rao,PaDManabham,JayaSudha,SriDevi and few other actors were acted in this movie.