రద్దయిన పెద్ద నోట్లకు యమ గిరాకీ

Premium For Exchange Of Old Currency Notes

12:21 PM ON 16th December, 2016 By Mirchi Vilas

Premium For Exchange Of Old Currency Notes

అదేమిటి రద్దయిన నోట్లను ఎలా వదిలించుకోవాలా అని కొందరు ఎదురు చూస్తుంటే, గిరాకీ పెరగడమేమిటని అనుకుంటున్నారా? ఇది నిజం. మరో పదిహేను రోజుల్లో ఎందుకూ కొరగాని చిత్తు కాగితాలుగా మిగిలిపోతాయనుకుంటున్న 500, 1000 రూపాయల నోట్లను ఎదురు డబ్బిచ్చి కొనుగోలు చేసేందుకు కొన్ని సంస్థలు, కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. దీంతో రద్దయిన పెద్ద నోట్లకు హఠాత్తుగా గిరాకీ పెరిగింది. పుస్తకాల్లో చూపించిన సంపాదనకు అనుగుణంగా నగదు నిల్వలు చేతుల్లో లేని కంపెనీలు, వ్యక్తులకు ఇప్పుడు రద్దయిన నోట్ల కోసం ఎగబడుతున్నట్టుగా చెబుతున్నారు. సాధారణంగా కంపెనీలు, వ్యక్తులు బ్యాలెన్స్ షీట్లలో కొంత క్యాష్ ఇన్ హ్యాండ్ కింద చూపిస్తారు. ఇదంతా తెల్లధనమే.

ఇక రోజువారి అవసరాలు, అనుకోని అక్కరల కోసం అప్పటికప్పుడు ఉపయోగించుకునేందుకు ఈ నగదును ఉపయోగిస్తారు. చాలా సందర్భాల్లో ఇలాంటి నగదును సంస్థలు, వ్యక్తులు ఇతర అవసరాల కోసం మళ్లిస్తారు. కొన్ని సందర్భాల్లో అధికారులకు లంచాలు ఇవ్వడానికి, లెక్కల్లో చూపే వెసులుబాటులేని కొనుగోళ్ల కోసం వినియోగిస్తారు. స్థిరాస్తుల కొనుగోళ్ల సందర్భంగా రిజిసే్ట్రషన్ ధరకు, డీల్ ధరకు మధ్య ఉండే తేడాను కూడా ఈ రకం సొమ్ముతోనే సర్దుబాటు చేస్తారు. ఈ క్యాష్ ఇన్ హ్యాండ్ కు కూడా లెక్కలు పక్కాగానే ఉండాలి. అనూహ్యంగా పెద్ద నోట్లు రద్దుకావడంతో, ఈ లెక్క సర్దుబాటు కంపెనీలు, వ్యాపార సంస్థలకు తలనొప్పిగా మారింది. క్యాష్ ఇన్ హ్యాండ్ గా చూపిన మొత్తాన్ని కూడా ఇప్పుడు బ్యాంకుల్లో జమచేయకతప్పదు. డిసెంబర్ లోగా బ్యాంకుల్లో జమచేయాల్సి రావడంతో కంపెనీలో రద్దయిన పాత నోట్ల కోసం పరుగులు తీస్తున్నాయి.

ఈ క్రమంలో కోటి రూపాయల విలువైన పాత కరెన్సీ కోసం పరుగులు తీస్తున్నవారు 5-6 లక్షల రూపాయలు అదనంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టు తెలిసింది. అంటే 5-6 శాతం వరకు ప్రీమియం ఆఫర్ చేస్తున్నారన్నమాట. ఇప్పటి వరకు భారీగా నల్లధనం ఉన్న ఆసాములు పాతనోట్లను మార్చుకునేందుకు కొత్త నోట్లకు ప్రీమియం చెల్లిస్తూ వచ్చారు. ఈ ప్రీమియం 30-40 శాతం వరకు నడిచింది. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చేతుల్లో నగదు లేకపోవడం, పుస్తకాల్లో మాత్రం క్యాష్ ఇన్ హ్యాండ్ గా కనిపిస్తుండటంతో డిసెంబర్ 30లోగా ఈ సొమ్మును సర్దుబాటుచేసి బ్యాంకుల్లో జమచేయడం అనివార్యంగా మారింది. లేనిపక్షంలో ఐటి శాఖ నుంచి ప్రశ్నలను ఎదుర్కోవాలి. కార్పొరేట్ వ్యవహారాల శాఖకు జవాబు చెప్పుకోవాలి. రద్దయిన 500,1000 రూపాయల నోట్లలో ఇప్పటికే దాదాపు 85 శాతం బ్యాంకులకు చేరింది. మరో పదిహేను రోజులు మాత్రమే పాత కరెన్సీ డిపాజిట్ కు గడువుంది.

ఇది కూడా చూడండి: కేదారనాధ్ క్షేత్ర విశిష్టత ఏమిటో తెలుసా ...

ఇది కూడా చూడండి: సూర్యనార్ కోవిల్ లో సూర్యుని ప్రత్యేకతలు ఏమిటో తెలుసా

English summary

Premium For Illegal Exchange Of Old Currency Notes.