క్రీడా పురస్కారాలతో ఖుషి ఖుషీ ....

President Pranab Mukherjee Gave Awards To Olympic Athletes

11:23 AM ON 30th August, 2016 By Mirchi Vilas

President Pranab Mukherjee Gave Awards To Olympic Athletes

దేశంలో మహిళా క్రీడా శక్తికి అత్యున్నత పురస్కారాలు దక్కాయి. ఒలింపిక్‌ స్టార్లు పీవీ సింధు, సాక్షి మాలిక్‌, దీపా కర్మాకర్‌తోపాటు షూటర్‌ జీతూరాయ్‌ను క్రీడల్లో ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్నతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సత్కరించారు. అథ్లెటిక్స్‌ కోచ్‌ నాగపురి రమేష్‌ ద్రోణాచార్య.. మాజీ అథ్లెట్‌ సత్తి గీత ధ్యాన్‌చంద్‌ జీవనసాఫల్య పురస్కారం అందుకున్నారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో నలుగురికి ఖేల్‌ రత్న, 15 మందికి అర్జున, ఆరుగురికి ద్రోణాచార్య, ముగ్గురికి ధ్యాన్‌చంద్‌ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డుల చరిత్రలో నలుగురు ప్లేయర్లను ఖేల్‌ రత్నకు ఎంపిక చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

ఖేల్ రత్న గ్రహీతలు ....

రాజీవ్‌ గాంధీ ఖేల్‌ రత్న అవార్డులను పీవీ సింధు (బ్యాడ్మింటన్‌), దీపా కర్మాకర్‌ (జిమ్నాస్టిక్స్‌), జీతూ రాయ్‌ (షూటింగ్‌), సాక్షి మాలిక్‌ (రెజ్లింగ్‌) అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రతి ఒక్కరికీ పతకం, ప్రశంసా పత్రంతోపాటు రూ. 7.5 లక్షల నగదు బహుమతిని అందజేశారు.

ద్రోణాచార్య .....

నాగపురి రమేష్‌ (అథ్లెటిక్స్‌), సాగర్‌ మల్‌ దయాళ్‌ (బాక్సింగ్‌), రాజ్‌ కుమార్‌ శర్మ (క్రికెట్‌), బిశ్వేశ్వర్‌ నంది (జిమ్నాస్టిక్స్‌), ప్రదీప్‌ కుమార్‌ (స్విమ్మింగ్‌, లైఫ్‌టైమ్‌), మహావీర్‌ సింగ్‌ (రెజ్లింగ్‌, లైఫ్‌టైమ్‌)లు ద్రోణాచార్య అవార్డులు అందుకున్నారు.

అర్జున అవార్డులు ...

రజత చౌహాన్‌ (ఆర్చరీ), లలితా బాబర్‌ (అథ్లెటిక్స్‌), సౌరవ్‌ కొఠారి (బిలియర్డ్స్‌, స్నూకర్‌), శివ్‌ థాపా (బాక్సింగ్‌), అజింక్యా రహానె (క్రికెట్‌), సుబ్రత పాల్‌ (ఫుట్‌బాల్‌), రాణీ రాంపాల్‌ (హాకీ), వీఆర్‌ రఘునాథ్‌ (హాకీ), గుర్‌ప్రీత సింగ్‌ (షూటింగ్‌), అపూర్వి చండేలా (షూటింగ్‌), సౌమ్యజిత ఘోష్‌ (టేబుల్‌ టెన్నిస్‌), వినేష్‌ ఫొగట్‌ (రెజ్లింగ్‌), అమిత కుమార్‌ (రెజ్లింగ్‌), సందీప్‌ సింగ్‌ మాన్‌ (పారా అథ్లెటిక్స్‌), వీరేంద్ర సింగ్‌ (రెజ్లింగ్‌, చెవిటి) అర్జున అవార్డులు పొందారు. ఒక్కొక్కరిని మెమెంటో, సర్టిఫికెట్‌తోపాటు రూ. 5 లక్షల క్యాష్‌ అవార్డుతో సత్కరించారు.

ఇంకా వీరు కూడా ...

ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌: సత్తి గీత (అథ్లెటిక్స్‌), సిల్వనస్‌ డంగ్‌ డంగ్‌ (హాకీ), రాజేంద్ర ప్రహ్లాద్‌ షెల్కే (రోయింగ్‌).

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ (మాకా) ట్రోఫీ 2015-16: పంజాబ్‌ యూనివర్సిటీ, పాటియాలా.

English summary

President Pranab Mukherjee Gave Awards To Olympic Athletes PV Sindhu, Sakshi Malik, Dipa Karmakar, Jitu Rai.