పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్ - ఇదో రికార్డు

PSLV success

01:36 PM ON 22nd June, 2016 By Mirchi Vilas

PSLV success

భారతీయులకు ఎంతో గర్వకారణం ఈరోజు.. ఎందుకంటే భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) రోదసీలో ఒకే రాకెట్ ద్వారా ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 20 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి, మరో చరిత్ర సృష్టించింది. తద్వారా తన సత్తా చాటింది. బుధవారం ఉదయం 9.26 గంటలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి పీఎస్ఎల్వీ సి-34 వాహక నౌక నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. భారత్ కు చెందిన కార్టోశాట్ -2సి, మన దేశ విద్యా సంస్థలకు సంబంధించిన రెండు ఉప గ్రహాలు, అమెరికా, కెనడా, జర్మనీ, ఇండోనేషియాకు చెందిన 17 ఉపగ్రహాలను వాహకనౌక నింగిలోకి మోసుకెళ్లింది.

వీటిలో ప్రధానమైనది కార్టోశాట్ -2సి. దీని బరువు 727.5 కిలోలు, 20 ఉపగ్రహాల మొత్తం బరువు 1,288 కిలోలు, గూగుల్ కు చెందిన 110 కిలోల స్కైశాట్ కూడా వీటిలో ఉంది. 2014 జులై 19న రష్యాకు చెందిన డీఎన్ఈపీఆర్ రాకెట్ 37 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇప్పటివరకూ ఇదే రికార్డు. దీని రూపకల్పనకు అయిన వ్యయం రూ.350 కోట్లు. ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఇదీ గత రికార్డు. తర్వాతి స్థానం అమెరికాదే. ఆ దేశానికి చెందిన మినోటార్-1 రాకెట్ 2013 నవంబర్ 19న ఒకేసారి 29 ఉపగ్రహాలను మోసుకెళ్లింది. పీఎస్ఎల్వీ వాహక నౌక మూడు దశలు విజయవంతంగా పూర్తి చేసింది.

నింగిలోకి చేరిన పీఎస్ఎల్వీ ఉప గ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు 26 నిమిషాల సమయం పట్టింది. పీఎస్ఎల్వీ సి-34 ప్రయోగం విజయవంత కావడంతో శాస్త్రవ్తేతలు హర్షం వ్యక్తం చేశారు. ఎంసీసీ నుంచి ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్, సీనియర్ శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వీక్షించారు. కార్టోశాట్ -2సి ఉపగ్రహం దేశ సైనిక సామర్థ్యాన్ని ఇనుమడింప చేయడమే కాదు, ఇది నిఘాకు సంబంధించి ఎంతో ఉపయోగపడనుంది. ఇలాంటి ఉపగ్రహాలు అమెరికా, చైనా, ఇజ్రాయిల్ వద్ద మాత్రమే ఉన్నాయి. తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో దాన్ని నిజం చేస్తోంది. ఇది అంతరిక్షం నుంచి అత్యంత కచ్చితమైన చిత్రాలు, వీడియోలను తీసి, భూమికి చేరవేస్తుంది.

ఇందులో ప్యాన్ క్రొమాటిక్ కెమెరా, మల్టీస్పెక్ట్రల్ పరికరం వల్ల ఈ సామర్థ్యం ఒనగూరింది. గతంలో పంపిన కార్టోశాట్- 2, 2ఎ, 2బి ఉపగ్రహాల్లోని కెమెరాలకు 0.8 మీటర్ల కచ్చితత్వం ఉంది. ప్రస్తుతం పంపే కార్టోశాట్ -2సిలో దాన్ని మరింత ఆధునికీకరించి, 0.65 మీటర్ల కచ్చితత్వం సాధించేలా రూపొందించారు. కార్టోశాట్ -2సి ఉపగ్రహం సైనిక అవసరాలకే కాక ప్రకృతి విపత్తుల సమయాల్లో సేవలు అందిస్తుంది. విపత్తు విస్తృతిని అంచనా వేయడానికి, సహాయ చర్యలకు ఉపయోగపడనుంది. కార్టోశాట్ -2సిలో అందించే చిత్రంలోని ప్రాంత ఉష్ణోగ్రత, వాటి చుట్టుపక్కల ఉష్ణోగ్రతలను అంచనా వేయవచ్చు.

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలకు, తీరప్రాంత నిర్వహణకు, రహదారుల నెట్వర్క్ పరిశీలనకు, నీటి సరఫరా పై అధ్యయనానికి, భూవినియోగ తీరు పై మ్యాప్ లు తయారు చేయడానికి ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించవచ్చు.

ప్రధాని మోడీ అభిననందన...

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీసి -34 విజయవంతం కావటంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు తెలిపారు. '20 ఉపగ్రహాలు నింగిలోకి దూసుకెళ్లాయి. ఇస్రో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉపగ్రహాలు రూపొందించడంలో పుణె, చెన్నైకు చెందిన విద్యార్థులు కీలక పాత్ర పోషించడం అభినందనీయం. శాస్త్రవిజ్ఞానంలో యువత ఆసక్తి చూపడం ఆనందంగా ఉంది' అని ప్రధాని ట్వీట్‌ చేశారు.

English summary

PSLV success