ప్రత్యక్ష దైవం సూర్యుని జన్మదినం - రథసప్తమి

Radha Sapthami On Sunday

10:23 AM ON 13th February, 2016 By Mirchi Vilas

Radha Sapthami On Sunday

మన కంటికి కనిపించే దైవం సూర్యుడు ... ఈ ప్రపంచానికి వెలుగునిస్తూ, సకల జీవ రాశులకు ప్రాణ శక్తి రావడానికి దోహదం చేస్తున్న సూర్య భగవానుడు ఆదిత్యకశ్యపులకు జన్మించాడు. సూర్యభగవానుడి జన్మదినాన్నే రథసప్తమి అంటారు. ఈ రోజునుండి పగటి సమయం ఎక్కువగా, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇతర మాసాలలో సప్తమి తిథులకన్నా మాఘమాసంలో వచ్చే శుక్ల పక్షంలోని సప్తమి ఎంతో విశిష్టత వుంది. సూర్యుడి గమనం ఉత్తరాయణం, దక్షిణాయణం. ఆషాఢమాసం నుండి పుష్యమాసం వరకు దక్షిణాయణం అంటారు. ఏడు గుర్రాలు పూన్చిన సూర్యని రథం దక్షిణాయణంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయణ ప్రారంభం అవుతుంది, సూర్యుడు తన దిశానిర్దేశాన్ని ఈ రోజునుండే మార్చుకుంటాడు. సూర్యుడు ఉదయం వేళ బ్రహ్మ స్వరూపంగా, మధ్యాహ్న సమయంలో ఈశ్వరుడిగా, సాయంత్రం విష్ణు స్వరూపుడిగా ఉంటాడ ని చెబుతారు. అందుకే మనం సూర్యుడిని త్రిసంధ్యలలో ప్రార్థిస్తే, త్రిమూర్తులకు పూజ చేసినంత ఫలితం ఉంటుందని చెబుతారు. శీతాకాలం నుండి వేసవి కాలపు సంధిస్థితిలో వచ్చే రధ సప్తమి కూడా ఓ పండుగే. వసంత, గ్రీష్మ ఋతువుల మధ్యలో వస్తుంది.

ఏడు సంఖ్యతో అనుబంధం ....

సూర్యుడికి ఏడవ సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్యుడి రథానికి పూన్చిన గుర్రాలు ఏడు. వారానికి రోజులు ఏడు. వర్ణాలలో రంగులు ఏడు. తిథులలో ఏడవది సప్తమి. ఇలా ఏడూ అంకెకు సూర్యునికి ప్రాధాన్యత , అనుబంధం వున్నాయి. మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణంతో సమాన మని కూడా అంటారు. సప్తమి రోజున సూర్యోదయానికి పూర్వమే మేల్కొని స్నాన, జప, అర్ఘ్యం, తర్పణ, దానాలు చేస్తే, అనేక కోట్ల పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తుంద ని అంటారు. సూర్యుడికి 'అర్కః' అనే నామం కూడా వుంది. అర్క అంటే జిల్లేడు ఆకు అని అర్ధం. అందుకే సూర్యుడికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. రథసప్తమి రోజున ఏడు జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానమాచరిస్తారు.

జననీ త్వంహి లోకానాం సప్తమీ సపసప్తికే !

సప్తంయా హ్యదితే దేవి నమస్తే సూర్యమాతృకే !!

అని జపిస్తూ నదీస్నానం చేస్తే, ఏడు జన్మలలో చేసిన పాపాలు నశిస్తాయని గర్గమహాముని ప్రభోదించాడు. స్నానం అయిదు రకాలు నదీ స్నానం కలిగి ఉంటుందని పండితులు చెబుతున్నారు. అవి సూక్తము, సూర్యుడి ముందు ముగ్గు వేసి, ఆవుపిడకలపై ఆవుపాలతో పొంగలి చేసి, చిక్కుడు ఆకులపై ఆ పొంగలిని పెట్టి సూర్యుడికి నివేదించాలి. ఇక సూర్యుడు జన్మించిన ఈ మాఘమాసంలో రథసప్తమి రోజున సూర్యుడిని పూజించే అవకాశం లేనివారు ఎదో ఒక ఆదివారం రోజున పూజించినా సత్ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.

సూర్య మంత్రం .....

ఇక సూర్యమంత్రాన్ని స్తుతిస్తే దారిద్యాన్ని పాలద్రోల వచ్చునని పండితులు అంటున్నారు. "ఓం హ్రీం ఘృణిః సూర్య ఆదిత్యః శ్రీం" అనే మంత్రాన్ని రోజుకు 3వేల సార్లు చొప్పున 40 రోజుల్లో 120,000 సార్లు చేస్తే ఆర్థిక సమస్యలు, ఈతిబాధలు తొలగిపోయి సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతా యని అంటారు.

English summary