కోర్టుకి  సోనియా అండ్ సన్ - భారీ భద్రత 

Rahul And Sonia To Appear In Court Today

11:23 AM ON 19th December, 2015 By Mirchi Vilas

Rahul And Sonia To Appear In Court Today

నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ పాటియాలా హౌస్ కోర్టుకు శనివారం హాజరు అవుతున్నారు. దీంతో కోటు దగ్గర భారీ భద్రత ఏర్పాటుచేశారు. కోర్టు ఏరియాల్లో ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఏర్పాట్లను ఇంటెలిజెన్స్ బ్యూరో స్వయంగా పరిశీలించింది. కోర్టు ప్రాంగణంలో 16 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

ఈ కేసులో తమకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సోనియా, రాహుల్ కోర్టును కోరే అవకాశం వుందని అంటున్నారు. తొలుత అక్బర్ రోడ్‌లోవున్న పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా పాటియాలా కోర్టుకు వెళ్లాలని నేతలు నిర్ణయించినప్పటికీ, న్యాయ నిపుణుల సలహా మేరకు చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు భావిస్తున్నారు. కోర్టు విచారణలో పార్టీ ఏమాత్రం జోక్యం చేసుకోబోదని, అందుకే ఎవరూ న్యాయస్థానంకు రావొద్దని కార్యకర్తలకు సూచించామని కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ఇప్పటికే స్పష్టంచేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో ఎలాంటి రాజకీయం లేదని బిజెపి నేత డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి పేర్కొంటూ , ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకోకపోతే, సోనియా గాంధి - రాహుల్ గాంధి లకు జైలు ఖాయమని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. జనతా పార్టీ అధ్యక్షుడుగా వున్నప్పుడు నేషనల్ హెరాల్డ్ వ్యవహారంపై డాక్టర్ స్వామి పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసు పూర్వాపరాలలోకి వెళితే, నేషనల్ హెరాల్డ్ పత్రిక సంస్థ అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్‌కు కాంగ్రెస్ రూ.90.25 కోట్ల రుణాన్ని ఇచ్చింది. 2010 డిసెంబర్ 10న ఈ మొత్తాన్ని వసూలు చేసే బాధ్యతను యంగ్ ఇండియా లిమిటెడ్(వైఐఎల్) అనే చారిటీ సంస్థకు పార్టీ రూ.50 లక్షలకు అప్పగించింది.

ఇంత పెద్ద మొత్తాన్ని వసూలు చేసే హక్కును వైఐఎల్‌కు రూ.50 లక్షలకే అప్పగించాల్సిన అవసరం ఏమొచ్చింది? దీనివెనుక ఉద్దేశాలపై కోర్టు సందేహాలు వ్యక్తంచేసింది. మరోవైపు బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా ఇదే అంశాలను లేవనెత్తారు... అంతేకాదు వైఐఎల్‌లో సోనియా, రాహుల్‌లకు చెరో 38శాతం కలిపి 76 శాతం వాటా ఉన్నట్లు డాక్టర్ స్వామి ప్రధాన ఆరోపణ. హెరాల్డ్‌కున్న ఆస్తులను చట్టబద్ధంగా సోనియా కుటుంబం సొంతం చేసుకుందంటూ డాక్టర్ స్వామి పిటిషన్ మేరకు చీటింగ్ కేసు నమోదైంది.

ఈ కేసులో దాదాపు 5 వేల కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను సోనియా అండ్ కో సొంతం చేసుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కోర్టు కి హాజరు కాకుండా ఉండేందుకు హైకోర్టు కి అప్పీలు చేసినా ఫలితం లేకపోవడంతో శనివారం కోర్టుకి వస్తున్నారు. ఏం జరుగుతుందని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

English summary

All India Congress Comitee President Sonia Gandhi and Vice-President Rahul Gandhi will appear in a trial court in Delhi in the National Herald case today