హెచ్ సి యు లో ముగిసిన రాహుల్ దీక్ష 

Rahul Gandhi Concern In HCU

07:17 PM ON 30th January, 2016 By Mirchi Vilas

Rahul Gandhi Concern In HCU

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్సియు) లో రోహిత్‌ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం విద్యార్థులు చేపట్టిన ‘మహాదీక్ష’ ముగిసింది. విద్యార్థులకు మద్దతుగా ఉదయం నుంచి ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దీక్షలో కూర్చున్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పి.ఎ.సంగ్మా, రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజు, విద్యార్థులు దీక్షలో పాల్గొన్నారు. దిల్లీ జేఎన్‌యూ, మద్రాస్‌ యూనివర్సిటీ, ఇఫ్లూ, ఓయూ విద్యార్థులు, హెచ్‌సీయూ ఎస్సీ, ఎస్టీ ఫోరం అధ్యాపకులు దీక్షలో పాల్గొని మద్దతు తెలపగా, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమత సైనిక్‌ దళ్‌ కవాతు నిర్వహించి రోహిత్‌కు నివాళులర్పించారు.

గత అర్ధరాత్రి హెచ్సియు కి చేరుకున్న రాహుల్ ఈ ఉదయం దీక్షలో కూర్చుని, సుమారు 8గంటల పాటు దీక్ష సాగించారు. అనంతరం రాహుల్‌కు అధ్యాపకులు, విద్యార్థులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రభుత్వం చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ‘ఎంతో మంచి విద్యార్థిని కోల్పోయాం. రోహిత్‌ కుటుంబానికి అన్యాయం జరిగింది. దేశవ్యాప్తంగా విశ్వ విద్యాలయాల్లో రోహిత్‌ లాంటివారు ఉన్నారు. సత్యం కోసం మాట్లాడే హక్కు, స్వేచ్ఛ రోహిత్‌కు ఇవ్వలేదు. ఇలాంటి ఘటనలు భవిష్యత్‌లో జరగకూడదు. రోహిత్‌కు జరిగిన అవమానం దేశంలో ఎవరికైనా జరగవచ్చు. అలా జరగకుండా ఉండాలంటే కులవివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలి’ అని అన్నారు. తన భావజాలాన్ని జనంపై రుద్దడానికి బిజెపి యత్నిస్తోందని రాహుల్‌ ఆరోపించారు.

కాగా ఒక పక్క రాహుల్‌ దీక్ష కొనసాగుతుంటే మరోపక్క హెచ్‌సీయూ ప్రధాన గేటు వద్ద ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన కు దిగారు. శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపిస్తూ రాహుల్‌ గోబ్యాక్‌ అంటూ నినదించారు. ఆన్దోలనాకురులు లోపలకు వెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఇక మరోపక్క హెచ్‌సీయూలో దీక్ష చేపట్టిన రాహుల్‌గాంధీకి మద్దతుగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్‌ నేతలు షబ్బీర్‌ అలీ, వి.హనుమంతరావు, వంశీచందర్‌ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

English summary

All India Congress Comitee Vice President Rahul Concern on demanding government to take action on accused people of Hyderabad Central University(HCU) incident Hyderabad.