హెచ్ సి యూలో మిడ్ నైట్ ' రాహుల్'       

Rahul Gandhi Visits HCU At Mid Night

09:57 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Rahul Gandhi Visits HCU At Mid Night

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి( హెచ్ సి యూ) వచ్చారు. అదికూడా అర్ధరాత్రి వేళ... పిహెచ్ డి విద్యార్ధి వేముల రోహిత్‌ ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఈ నెల 19న హెచ్‌సీయూకు వచ్చి అక్కడ రోహిత్‌ కుటుంబాన్ని పరామర్శించి, విద్యార్థుల ఉద్యమానికి మద్దతు తెలిపిన రాహుల్‌ శుక్రవారం అర్ధరాత్రి మరోసారి వచ్చారు. విద్యార్థుల నిరసనదీక్షలో పాల్గొన్నారు. రోహిత్‌ ఆత్మహత్య తదనంతర పరిణామాల నేపథ్యంలో అతని కుటుంబానికి న్యాయం, ఇతర డిమాండ్ల సాధనకు పోరాడుతున్న విద్యార్థులకు మరోసారి సంఘీభావం తెలపాలని రాహుల్‌ ఈ పర్యటనకు వచ్చినట్లు తెలిసింది. ప్రత్యేక విమానంలో బేగంపేటకు రావాలని ముందుగా భావించిన రాహుల్ ..చివరికి ఇతర ప్రయాణికులతో పాటు డిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి 12 గంటలకు జరిగే కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనాలని భావించినా విమానం ఆలస్యం కావడంతో దానికి హాజరుకాలేకపోయారు. రాత్రి 11 గంటలకు ర్యాలీని విద్యార్థులు ప్రారంభించారు. అర్థరాత్రి హెచ్‌సీయూకి చేరుకున్న రాహుల్‌ గాంధీ నేరుగా రోహిత్‌ స్మారక స్థూపం వద్ద నివాళులర్పించి దీక్షలో కూర్చున్నారు. ఈ దీక్షలో రోహిత్‌ తల్లి రాధిక, సోదరుడు రాజా, పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉన్నారు. శంషాబాద్‌ నుంచి వస్తున్న రాహుల్‌ గాంధీ వాహన శ్రేణిని ఏబీవీపీ కార్యకర్తలు 200 మంది అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. రాహుల్‌ పర్యటనను పురస్కరించుకొని పోలీసులు విశ్వవిద్యాలయంలో భారీఎత్తున భద్రత ఏర్పాట్లు చేశారు.

కాగా శుక్రవారం మధ్యాహ్నం వరకు రాహుల్‌ పర్యటనపై సందిగ్ధం నెలకొంది. దీనిని పూర్తిగా ప్రైవేటు కార్యక్రమంగా పేర్కొన్న రాహుల్‌.. కాంగ్రెస్‌ పార్టీ నేతలెవరూ పాల్గొనవద్దని సూచించారు. దీంతో ఎవరికీ సమాచారం అందలేదు. అయితే సాయంత్రం ఆయన పర్యటన వివరాలు వెల్లడయ్యాయి. నగరంలోనే ఉన్న దిగ్విజయ్‌సింగ్‌ పర్యటన వివరాలు ధ్రువీకరించారు. ఇక శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగే నిరసన దీక్షలో రాహుల్ పాల్గొన్నారు. మరోపక్క రాహుల్‌ పర్యటనకు నిరసనగా ఏబీవీపీ కళాశాలలకు బంద్‌కు పిలుపునివ్వడంతో పోలీసులు బందోబస్తు పెంచారు. ఓ పక్క నిరసన దీక్ష , మరోపక్క బంద్ ఘటనలతో హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక గ్రేటర్ ఎన్నికల ప్రచారం కూడా రేపటితో పరి సమాప్తం అవుతున్నందున ప్రచారం తారాస్థాయికి చేరింది.

English summary