మరో రెండు రోజులు రత్నాచల్ వుండదు

Ratnachal Express Cancelled For Two Days

11:14 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Ratnachal Express Cancelled For Two Days

తూర్పుగోదావరి జిల్లా తునిలో జనవరి 31న కాపు ఐక్యగర్జన ఉద్యమకారుల దాడిలో కాలిపోయిన రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను పునరుద్ధరించేందుకు మరింత సమయం పడుతోంది. దీన్ని పునరుద్ధరించాలంటే 24 బోగీలు అవసరం కాగా , బోగీల కొరత కారణంగా పునరుద్ధరణ ఆలస్యమవుతోంది. దీంతో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను 3, 4 తేదీల్లో రద్దుచేసినట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో అదనపు బోగీలు లేని విషయాన్ని రైల్వేబోర్డు దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ప్రతిరోజూ ఉదయం విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లి.. మధ్యాహ్నం అక్కడినుంచి విజయవాడకు తిరిగివచ్చే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రాధాన్యాన్ని వివరిస్తూ రైల్వే బోర్డుకు దక్షిణమధ్య రైల్వే ఇప్పటికే రెండు లేఖలు రాసింది.

ఇతర రైల్వేజోన్ల నుంచి బోగీలను సర్దుబాటు చేయాలని రైల్వే బోర్డుకి రాసిన లేఖలో దక్షిణ మధ్య రైల్వే కోరింది. అయితే రైల్వేబోర్డు నుంచి వెంటనే హామీ రాకపోవడంతో దక్షిణమధ్య రైల్వే అధికారులు బుధ, గురువారాల్లో కూడా రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రత్నాచల్‌లో బోగీలు కేవలం కూర్చునేందుకు మాత్రమే ఉద్దేశించినవి కావడంతో అలాంటివి సమకూర్చడంలో ఇబ్బంది ఉన్నట్లు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. దక్షిణమధ్య రైల్వే జోన్‌ జీఎం రవీంద్రగుప్తా రైల్వేబోర్డు అధికారులతో మాట్లాడారని.. బోగీలు రాగానే రైలును పునరుద్ధరిస్తామని సీపీఆర్వో ఉమాశంకర్‌కుమార్‌ చెబుతున్నారు. ఇప్పటికే మూడు రోజులుగా రత్నాచల్ తిరగకపోవడం, మరో రెండు రోజులపాటు రాద్దుకావడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లకు గురువవుతున్నారు. విజయవాడ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసేవారికి రత్నాచల్ ఎంతో దోహదపడుతూ వస్తోంది. ఎప్పుడూ కిటకిట లాడుతూ తిరిగే రత్నాచల్ ఇంకా పట్టలేక్కపోవడం పలువురిని కలచి వేస్తోంది.

English summary