బాబు గారి డాబుపై కమలదళం కినుక

Relation Between TDPAnd BJP

09:41 AM ON 7th January, 2016 By Mirchi Vilas

Relation Between TDPAnd BJP

' రాష్ట్రం విడిపోయాక ఎపి అనాధ అయింది. ... కేంద్ర సాయం లేదు ... రాజధాని లేదు ... ఏమి చేయాలన్నా చేతిలో చిల్లిగవ్వ లేదు ... ప్రత్యేక హోదా లేదు ... ప్రత్యేక ప్యాకేజీ లేదు .... అసలు మనల్ని పట్టించుకునే ష్టితిలో కంద్రం లేదు ' తరచూ విపక్షాల కంటే , తెలుగు తమ్ముళ్ళ నుంచి వినిపించే గళం ఇది. కానీ ఇంతవరకు కేంద్రం చేసిన సాయంతోనే ఎపి సిఎమ్ చంద్రబాబు పనులు సాగిస్తున్నారే తప్ప, మరొకటి కాదని, కేంద్రం ఇచ్చిన నిధులతో షోకులు చేస్తూ , పైకి మాత్రం బీద అరుపులు అరుస్తున్నారని కమల దళం అంటోంది. ఈ మధ్య బిజెపి శ్రేణులు కౌంటర్ బానే ఇస్తున్నారు.

బిజెపి నేత ఒకరు చెప్పిన వివరాలను పరిశీలిస్తే, కేంద్ర సాయం బానే వుంది అనిపిస్తుంది. మరి టిడిపి వాళ్ళు ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారో అర్ధం కాని ప్రశ్న. అయితే బిజెపి ఎదగకుండా చేయాలన్న్నదే బాబు వ్యూహమని అందుకే అన్నీ తెల్సి కూడా బిజెపిని బద్నాం చేయడానికి బాబు గారు మౌనం దాలుస్తున్నారని బిజెపి వారి వాదన. ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను భాగస్వామ్యం చేయకపోగా , కేంద్రం ఇచ్చిన పధకాలను సైతం తన సొంత పదకాలుగా టిడిపి ప్రచారం చేసుకుంటోందని బిజెపి నేతల ఆవేదన. ఎల్ ఇ డి బల్బుల పధకాన్ని ప్రవేశపెట్టి, పది రూపాయలకు బల్బు అందిస్తుంటే , కనీసం బిజెపి వాళ్ళను ఇన్వాల్వ్ చేయడం లేదు సరికదా, అసలు మోడీ ప్రస్తావన కూడా మరిచారని కొన్ని చోట్ల బిజెపి శ్రేణులు మీడియాకు చెప్పుకొచ్చారు.

ఇళ్ళ పధకంలో ఎక్కడా లేని విధంగా ఎపికి రెండు లక్షల ఇళ్ళు ఇస్తే , కనీసం మోడీ గురించి చెప్పడం లేదని కమలనాధుల ఆరోపణ. మొన్నటికి మొన్న ఎంఎల్సి రాజేంద్ర ప్రసాద్ కాబోయే ప్రధాని చంద్రబాబు అంటూ వ్యాఖ్యలు చేయడం , దీనిపై చిలవలు పలవలు రావడంతో స్వయంగా చంద్రబాబు స్పందించి ,ఇలాంటి వ్యాఖ్యలు తగవని చెప్పడం ద్వారా డాబుగా వ్యవహరించారని బిజెపి నేతల వాదన. అయినా పరిస్థితి మారలేదు. నిన్నటికి నిన్న మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి ఏకంగా బాబు పధకాలను చూసి ప్రధాని మోడీ బెంబేలెత్తి పోతున్నారనే వ్యాఖ్య చేసినట్లు వార్తలు రావడం , దీనిపై సోషల్ మీడియాలో కధనాలు వస్తుండడం వంటి విషయాలని బిజెపి ప్రస్తావిస్తోంది.

ఇక కేంద్రప్రభుత్వం వివిధ రూపాల్లో ఇప్పటివరకూ సాయం చేసిన విషయాన్ని కమలనాధులు ప్రస్తావిస్తున్నారు. అమరావతి కోసం నికరంగా 23వేల కోట్లను మంజూరు చేసింది. ఇందులో 20వేల కోట్లు రాజధాని ఎక్స్ టెర్నల్ రోడ్లు. నిమిత్తం నితిష్ గడ్కరీ మంజూరు చేశారు. కేవలం భూ సేకరణ చేస్తే ఆ పరిహారాలు కూడా తామే ఇచ్చి, 3 ఏళ్ళలో రోడ్లు పూర్తి చేస్తామని ప్రతిపాదిస్తే, 4 ఏళ్ళు కావాలని రాష్ట్రం ఈ వ్యవధిని పొడిగించింది. వెయ్యి కోట్లు వెంకయ్యనాయుడు గారి శాఖ నుంచి, మరో 2వేల కోట్లు ఇతర కేంద్ర శాఖల నుంచి వచ్చాయట. 'ఇవి గాక హెరిటేజ్ సిటీ కోటా, అమృత్ సిటీ కోటాల్లో సుమారు 200 కోట్లు వస్తున్నాయి. మొన్నటి శంకుస్థాపనకి వేసిన ఆహ్వానం కార్డు, కొట్టిన కొబ్బరికాయ ఖర్చు తో సహా సమస్తం కేంద్ర నిధులే తప్ప ఇంతవరకూ రాజధాని కోసం ఒక్క రూపాయి కూడా రాష్ట్రం వ్యయం చేసింది లేదుట. భూములు రైతులు ఇచ్చారు, వాళ్ళకి ఒక్క పైసా కూడా ఇచ్చింది లేదు, నిధులు కేంద్రం ఇచ్చింది, కనీసం ఇది ప్రస్తావించింది లేదు. ఇక జనం భూమి, పధకం పేరిట కేంద్రం సొమ్ముతో బాబు సోకు చేస్తున్నారు. కేంద్రం ఏమీ చేయకపోతే ఈ డబ్బు ఎక్కడిది.. పాపం బాబు అప్పు చేసి సొంతసొమ్ము ఖర్చు చేస్తున్నారా' అని బిజెపి నేతలు లక్కలతో సహా రేవు పెట్టేస్తున్నారు.

కాగా మొత్తం మన రాజధాని కోసం కేంద్రప్రభుత్వం అక్షరాలా లక్షా ఏభై వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందిట. అందులోనుంచే రాజధాని నిర్మాణం చేస్తారు.. కానీ తాను చమటలు కక్కేస్తూ ఉంటారు.. అప్పుడు కూడా మోడి ఏ సాయం చేయకుండానే బాబు గారు సీంగపూర్ మలేశియా, జపాన్ సాయంతో రాజధాని కట్టారని అనుకునేలా టిడిపి వ్యవహారం వుందని బిజెపి వాళ్ళు మండిపడుతున్నారు.

ఇది గ్రహించే చంద్రబాబు మొత్తానికి నోరు విప్పి , కేంద్ర సహకారం వల్లనే, ఎన్నో సాధించుకోగల్గుతున్నామని, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నారని వ్యాఖ్యానించారని బిజెపి నేతలు గుర్తుచేస్తున్నారు.

మొత్తానికి ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు నుంచీ చూస్తే, తప్పనిసరి పరిస్థితుల్లోనే పొత్తు సాగుతోందన్న విషయం యిట్టె అర్ధమవుతోంది. ఇక తెలంగాణాలో గ్రేటర్ ఎన్నికల్లో కూడా బిజెపి - టిడిపి మధ్య విభేదాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీల మధ్య పొత్తు సవ్యంగా ఉంటుందా , సమీకరణలు మారతాయా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే.

English summary

One Of The Andhra Pradesh BJP Leader said that Central Government Has helping Andhrapradesh government in all ways. But TDP government says that Central Government was not helping to A.P