మోడీకి మన్మోహన్ సలహాదారు కితాబు 

Sanjaya Baru Complinets To Modi

01:02 PM ON 11th January, 2016 By Mirchi Vilas

Sanjaya Baru Complinets To Modi

ఓ పార్టీకి చెందిన ప్రధాని దగ్గర సలహాదారుగా పనిచేసిన వ్యక్తి మరో పార్టీ కి చెందిన ప్రధానిపై ప్రసంసలు కురిపించిన వైనం ఇది. అంతేకాదు తాను పనిచేసిన ప్రధాని సమర్దుడే అయినా,సదరు పార్టీ యే ఆయన్ని బలహీన పరిచిందని కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ అనతికాలంలోనే అంతర్జాతీయ నేతగా ఎదిగి, రాజనీతిజ్ఞుడిగా రాణిస్తున్నారని ఆకాశానికి ఎత్తేసారు. ఆయన ఎవరో కాదు, మాజీ ప్రధాని మన్మోహన్‌కు మీడియా సలహాదారుగా పనిచేసిన ప్రముఖ పాత్రికేయుడు సంజయ్‌బారు. వివరాల్లోకి వెళితే,

హైదరాబాద్‌ సాహితీ వేడుక (హెచ్‌ఎల్‌ఎఫ్‌) ముగింపు ఉత్సవాల్లో ‘భారత ప్రధానమంత్రులు’ అనే అంశంపై నిర్వహించిన చర్చలో సంజయ్ బారు పాల్గొన్నారు. మరో పాత్రికేయుడు కింగ్‌షుక్‌నాగ్‌ కూడా హాజరయ్యారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటినుంచి ఈనాటి వరకు పరిణామాలు , ఆయా ప్రధానుల పనితీరుని ఆయన విశ్లేషించారు. ఈ చర్చకు అజయ్‌గాంధీ ప్రయోక్తగా వ్యవహరించారు.

దేశ ప్రజల్ని ఒప్పించటం ఈజీ కాదు..

ఈ సందర్భంగా సంజయ్ బారు మాట్లాడుతూ, ‘‘ఒత్తిడికి లొంగకుండా అమెరికాతో సంబంధాలను ప్రధాని మోడీ గాడిలో పెట్టారు. ఆఫ్రికా దేశాల మనసు మళ్లీ గెల్చుకున్నారు. పాక్‌తో సత్సంబంధాలకు బానే కృషిచేస్తున్నారు. ఆయన లాహోర్‌ పర్యటన విజయవంతమైంది. అందుకే పఠాన్‌కోట్‌ ఘటన చోటు చేసుకుంది. విదేశాంగ నీతిలో మోదీ ప్రయత్నాలు బావున్నాయి. కానీ దేశ ప్రజల్ని ఒప్పించటమంటే. విదేశాంగనీతిలో నెగ్గినంత సులభం కాదు, అలాగని అది అసాధ్యం కూడా కాదు’’ అంటూ కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయం వ్యక్తం చేసారు.

నెహ్రూ - పివి హయాం భేషే

'ఏ పరిస్థితుల్లో పదవిని చేపట్టి.. ఎలాంటి పరిస్థితుల్లో వదిలి వెళుతున్నారనే అంశాల ఆధారంగా ఓ ప్రధానిని బేరీజు వేయాలి. ఆ లెక్కన చూసినప్పుడు నెహ్రూ, పీవీ నరసింహారావులు క్లిష్టమమైన పరిస్థితుల్లో పదవిని చేపట్టారు. నెహ్రూ ఏ దేశం ఎదుర్కోని సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తే, పీవీ ప్రధాని పదవి చేపట్టేనాటికి భారత్‌ అన్నిరకాలుగా దయనీయ స్థితిలో ఉంది. అలాంటి స్థితి నుంచి అందరి దృష్టిని ఆకర్షించే స్థితికి పీవీ తీసుకొచ్చారు.

పివికి దక్కాల్సినత పేరు దక్కలేదు ....

‘‘మనదేశంలో బలమైన ప్రధాని, బలమైన ముఖ్యమంత్రులున్న తరాన్ని ఇప్పుడే తొలిసారి చూస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదే. రాష్ట్రాల అవసరాలు, ముఖ్యమంత్రుల సమర్థత ప్రధానికి తెలుసుకాబట్టి అందుకు అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా. ఇక గతంలో ఆధిక్యంలేకుండా సంకీర్ణ ప్రభుత్వాలను నడిపినవారే బాగా రాణించారు. 400 పైచిలుకు సీట్లు గెల్చుకున్న రాజీవ్‌గాంధీ విఫలంకాగా, మైనార్టీ సర్కారును నడిపిన పీవీ నరసింహారావు అద్భుతాలు సృష్టించారు.అయితే, పీవీకి రావల్సినంత పేరు దక్కలేదు. 'ఇక మోదీ గద్దెనెక్కే సమయానికి కూడా భారత్‌ పరిస్థితి ఏమీ బాలేదు. మరి ఆయన ఎలాంటి వారసత్వాన్ని మిగులుస్తారో చూడాలి. ఇప్పటికైతే బానే చేస్తున్నారు’’ అని సంజయ్‌బారు విశ్లేషించారు.

మన్మోహన్ ని కాంగ్రెస్సే బలహీన పరిచింది .....

మన్మోహన్‌ పాలనపై బారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రత్యామ్నాయ సమర్థ అధికారాన్ని చూపించాలన్న ఉద్దేశంతో వాజ్‌పేయి తొలిసారి ప్రధానిగా రాణించేందుకు ఆరెస్సెస్‌ సహక రించింది. ఇక సంకీర్ణాలకు తాము సానుకూలమే అని నిరూపించేందుకు 2004లో మన్మోహన్‌కు ప్రధానిగా కాంగ్రెస్‌ పూర్తి మద్దతిచ్చింది. ప్రణబ్‌ముఖర్జీ ఉపప్రధాని అయ్యేందుకు ప్రయత్నించినా సోనియా అంగీకరించలేదు. కానీ, 2009లో పార్టీ మళ్లీ గెలిచాక తీరు మారింది. నిజానికి మన్మోహన్‌ కారణంగానే కాంగ్రెస్‌ 2009లో విజయం సాధించింది. అయినా, కాంగ్రెస్‌ అప్పటినుంచి మన్మోహన్‌ను బలహీన పరచటం మొదలెట్టింది' అని సంజయ బారు తెగేసి చెప్పారు.

రాహుల్ ఓట్లు రాబట్టలేరు.....

2012 యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించి ఉంటే రాహుల్‌ను ప్రధానిని చేసి, మన్మోహన్‌ను రాష్ట్రపతి చేయాలనుకున్నారు. రాహుల్‌ అప్పుడే కాదు, ఇప్పటికీ ఓట్లు రాబట్టలేకపోతున్నారు. కుంభకోణాల సంక్షోభాన్ని కాంగ్రెస్‌ సరిగ్గా పరిష్కరించలేదు. చివరకు లోక్‌పాల్‌ బిల్లును ప్రతిపక్షాలు రాశాయంటే ఆ ప్రభుత్వం ఎంత బలహీనపడిందో అర్థం చేసుకోవచ్చు’’ అని సంజయ్‌బారు అన్నారు.

మొత్తానికి సంజయ బారు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లు కాంగ్రెస్ ని ఎన్నో వ్యతిరేక అంశాలు వెంటాడుతున్నాయి. మరోవైపు మోడీ కి అనుకూల వ్యాఖ్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు.

English summary

Ex- Prime minister of India Manmohan Singh's Media adviser Sanjaya Baru praises Narendra Modi in HLF event which was conducted in Hyderabad.