మరో అద్భుతానికి తెర తీసిన శాస్త్రవేత్తలు.. ఈసారి గాలి, నీరే ఇంధనం!

Ship powered entirely by green energy

01:02 PM ON 23rd September, 2016 By Mirchi Vilas

Ship powered entirely by green energy

సూర్య కిరణాల ఆధారంగా ఉత్పత్తి చేసే ఇంధనమే సౌర శక్తి. దీన్ని వినియోగించుకుని సాధిస్తున్న ప్రగతికి చిహ్నాలు ఎన్నో వున్నాయి. ఇక సౌర శక్తిని ఉపయోగించి, ప్రపంచాన్ని చుట్టేసిన సోలార్ ఇంపల్స్ విమానం స్పూర్తిగా మరో ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. సోలార్ ఇంపల్స్ విమానం గగనతలంలో చేసిన ఫీట్ ను సముద్రంపై చేసేందుకు ఎనర్జీ అబ్జర్వర్ అనే పడవ సిద్ధమవుతోంది. సోలార్ ఇంపల్స్ విమానం కేవలం సౌరశక్తితో మాత్రమే నడవగా, ఎనర్జీ అబ్జర్వర్ మాత్రం సౌరశక్తితోపాటు, సముద్రంలో వీచే బలమైన గాలులను, నీటిని విడగొట్టడం ద్వారా పుట్టే హైడ్రోజన్ ను కూడా ఇంధనంగా వినియోగించుకోబోతోంది. ఫ్రాన్స్ కు చెందిన రెండు కంపెనీలు ఎనర్జీ అబ్జర్వర్ ప్రపంచయాత్రకు సిద్ధం చేస్తున్నాయి.

ఎనర్జీ అబ్జర్వర్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 దేశాల్లోని 101 నౌకాశ్రయాలను చుట్టేయనుంది. సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్రాన్స్ లో తయారవుతున్న ఈ ఎనర్జీ అబ్జర్వర్ ద్వారా సంప్రదాయేతర ఇంధన వనరుల సుస్థిర, సమర్థ వాడకాన్ని పెంపొందించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 2017 ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న ఎనర్జీ అబ్జర్వర్ ప్రపంచయాత్ర ఆరేళ్లలో జలమార్గం ద్వారా ప్రపంచాన్ని చుట్టనుంది. ఎనర్జీ అబ్జర్వర్ 30 మీటర్ల పొడవు, 12.80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిలో సుమారు 130 చదరపు మీటర్ల వైశాల్యంలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయనున్నారు.

వీటితోపాటు రెండు వర్టికల్ యాక్సిస్(నిట్ట నిలువుగా తిరిగే) విండ్ టర్బయిన్లతో పాటు నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్ గా విడగొట్టేందుకు అవసరమైన ఎలక్ట్రాలసిస్ పరికరాలను కూడా ఏర్పాటు చేస్తారు. దీంతో ఇది సోలార్, విండ్, ఎలక్ట్రాలసిస్ విధానాల ద్వారా పని చేస్తుంది. హైడ్రోజన్ ను ఫ్యుయెల్ సెల్స్ లోకి పంపి విద్యుత్తును ఉత్పత్తి చేసి దానిని శక్తిమంతమైన బ్యాటరీల్లో నిక్షిప్తం చేస్తారు. దీనికి సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్ల ద్వారా సమకూరే విద్యుత్త్ జత అవుతుంది. దీంతో పడవ ప్రయాణం సాఫీగా జరుగుతుందని సదరు కంపెనీలు భావిస్తున్నాయి. వాతావరణం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు కనుక సోలార్, విండ్ పవర్(గాలి ద్వారా విద్యుత్) పని చేయనప్పుడు ఎలక్ట్రాలసిస్ విధానం ద్వారా విద్యుత్ ను ఉత్పత్తి చేసి పడవ ప్రయాణం సాగిస్తారు.

దానితో పాటు పడవలోని శక్తిమంతమైన బ్యాటరీల్లో నిక్షిప్తం చేసిన విద్యుత్ ను వినియోగించుకుంటారు. ఇది వినియోగంలోకి వేగంగా వస్తే, పురోగతి దశాదిశా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary

Ship powered entirely by green energy