సిలికాన్‌ వ్యాలీ దానకర్ణులు వీరే

silicon valley titans who gave their whealth to philanthropy

03:27 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

silicon valley titans who gave their whealth  to philanthropy

ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ తన సంస్థలోని 99శాతం షేర్లను చారిటీ కోసం దానం చేయనున్నట్లు చేసిన ప్రకటన యావత్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. తండ్రిగా మారిన సందర్భంలో తన కన్నబిడ్డను తొలిసారి చూసిన ఆనందంలో ఒక తండ్రిగా తన బిడ్డకే కాక, యావత్‌ప్రపంచలోని పసివాళ్ళకు అతి విలువైన కానుకను అందించాడు జుకర్‌బర్గ్‌.

చేతికి ఎముకే లేనట్లు దానం చేయడంలో అమెరికన్‌ సిలికాన్‌ వ్యాలీ దానకర్ణులు ఎన్నో లక్షల కోట్ల రూపాయలను దానం చేసారు. వీరిలో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఒకరు మాత్రమే. తరతరాలకు తరగని ఆస్తులను కూడబెట్టాలనే తాపత్రయంతో నానా గడ్డీ కరిచి సంపాందించేందుకు వెనుకాడని వాళ్ళకు కొదవే లేదు. కోట్ల కొలదీ వచ్చే డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియక సొంతంగా దీవులను, పెద్ద పెద్ద భవంతులను, విమానాలను కొనుక్కొని ఆనందించే బిలియనీర్లకు లెక్కే లేదు. అలాంటి వారికి విభిన్నంగా వచ్చిన కొండంత సంపదను మళ్ళీ ప్రపంచానికే తిరిగి ఇచ్చేసిన దానగుణ సంపన్నులను చూద్దాం.

బిల్‌గేట్స్‌, మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు

మైక్రోసాఫ్ట్‌ సంస్థకు పరిచయం అవసరం లేదు. కంప్యూటర్‌ యుగంలో చెరగని ముద్రవేసిన మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని కొన్ని దేశాల జిడిపితో సమానంగా సంపదను కలిగిన ఉన్న బిల్‌గేట్స్‌ తమ ముగ్గురు పిల్లలకు నామమాత్రం డబ్బును మిగిల్చి 85బిలియన్‌ డాలర్లను స్వచ్ఛంద కార్యక్రమాలకు వినియోగిస్తున్నాడు. కొన్ని వేల సంవత్సరాల పాటు ప్రయత్నించినా కూడా సాధ్యం కాని సంపాదనను ఆర్జించిన బిల్‌గేట్స్‌ తమ పిల్లలకు అంతమొత్తం ఆస్థిని అందించడం మంచిది కాదన భావనను వ్యక్తం చేస్తారు. బిల్‌, మెలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ పేరిట 1994 నుండి స్వచ్ఛంద సేవలు అందిస్తున్నాడు. మరొక కుభేరుడు వారెన్‌ బఫెట్‌తో కలిసి దాతృత్వాన్ని పెంపొందించే దిశగా కార్యక్రమాలు చేపడుతున్న బిల్‌గేట్స్‌ తన లాంటి బిలియనీర్లు తమ సంపదలో సగం స్వచ్ఛంద కార్యక్రమాలకు వెచ్చించాలని కోరుతున్నాడు.

స్టీవ్‌ కేస్‌ ఎఒఎల్‌ వ్యవస్థాపకుడు

కోట్లాది అమెరికన్లకు ఇంటర్నెట్‌ను పరిచయం చేసిన అమెరికన్‌ ఆన్‌లైన్‌ (ఎఒఎల్‌) సంస్థ వ్యవస్థాపకుడు తన సంపదలోని అత్యధిక భాగాన్ని స్వచ్ఛంద కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడు. 1997లో ప్రారంభించిన కేస్‌ ఫౌండేషన్‌ద్వారా సాటి బిలియనీర్లను దాతృత్వ కార్యక్రమాలలో పాల్గనేలా సేవలందిస్తున్నాడు. మనం సంపాదించిన ఆస్తులు మనవి కావని భావించే అత్యుత్తమ భావనతో సేవా కార్యక్రమాలలో పాల్గనే కేస్‌ మరింత మంది కంపెనీలు తనలాగే సేవా కార్యక్రమాలలో పాల్గనేందుకు శ్రమిస్తున్నాడు.

మార్క్‌ బీన్‌ఆఫ్‌, సేల్స్‌ఫోర్స్‌ సిఇఒ

టెక్నాలజీ కంపెనీ సేల్స్‌ఫోర్స్‌ సిఇఒ మార్క్‌ కూడా సిలికాన్‌ వ్యాలీలో దాతృత్వాన్ని మరింత పెంపొందించేందుకు తోడ్పడుతున్నాడు. సేల్స్‌ఫోర్స్‌ టెక్నాలజీ ప్లాట్‌ఫాం ద్వారా 60రోజులలో 10మిలియన్లను సేకరించడం ద్వారా వివిధ సేవాకార్యక్రమాలలో ఖర్చుచేసేందుకు మార్క్‌ ప్రయత్నం చేస్తున్నారు. మార్క్‌ ఇప్పటికే తన భార్యతో కలిపి 200మిలియన్‌ డాలర్లను సేవా కార్యక్రమాలను నిమిత్తం వెచ్చించాడు.

ఐర్విన్‌ జాకబ్స్‌, క్వాల్‌కామ్‌ వ్యవస్థాపకుడు

ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలకు చిప్‌సెట్‌లను తయారు చేస్తున్న క్వాల్‌కామ్‌ సంస్థ అందరికీ సుపరిచతమే. క్వాల్‌కామ్‌ వ్యవస్థాపకుడు ఐర్విన్‌ జాకబ్స్‌ సైతం దాతృత్వ కార్యక్రమాలలో ముందంజలో ఉంటాడు. ఇప్పటికే 500మిలియన్‌ డాలర్ల సేవాకార్యక్రమాలను చేసిన జాకబ్‌ తన భార్యతో కలిపి భవిష్యత్‌లో మరిన్ని కార్యక్రమాలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే తన సంపదలో సగంకు పైగా దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చించనున్నట్లు ఐర్విన్‌ ప్రకటించాడు.

ఇబే వ్యవస్థాపకుడు పియర్రీ ఒమ్డియార్‌

ఇ కామర్స్‌ దిగ్గజం ఇబే వ్యవస్థాకుడు పియర్రీ ఒమ్డియార్‌కు సేవా కార్యక్రమాలలో పాల్గనడమంటే ఎంతో ఇష్టమట. తను స్థాపించిన ఇబే స్టాక్‌మార్కెట్‌లో లిస్ట్‌ అవ్వగా వచ్చిన 1బిలియన్‌ డాలర్లను పియర్రీ సేవా కార్యక్రమాలకు వెచ్చించి ఔరా అనిపించాడు. అంతులేని సంపదను సృష్టించి దాన్ని తన కుటుంబం వద్దే ఉంచుకోవడం భావ్యం కాదని చెప్పే ఫియర్రీ తన జీవితాంతం తన ఆస్థిని సేవా కార్యక్రమాలకు వెచ్చించాలని ప్రతిజ్ఞ చేసాడు. ప్రపంచంలో ఎన్నో అంతు చిక్కని సమస్యలను సంపదతో నాశనం చేయవచ్చని అలాంటప్పుడు సంపద ఏ ఒక్కరి కొందరి వద్దే మూలిగి పోవడం మంచిది కాదన్నది ఇబే వ్యవస్థాపకుని ఆలోచన.

ఇంటెల్‌ వ్యవస్థాపకుడు గోర్డాన్‌ మూర్‌

కంప్యూటర్‌ చిప్‌ల తయారీలో అగ్రగామి అయిన ఇంటెల్‌ సంస్థ వ్యవస్థాపకుడు గోర్డాన్‌ మూర్‌ సేవా కార్యక్రమాలలో ఎవ్వరికీ తీసి పోనని నిరూపించుకున్నాడు. మూర్‌ ఫౌండేషన్‌ పేరిట ఇప్పటికే బిలియన్‌ డాలర్ల సేవా కార్యక్రమాలను చేసిన మూర్‌ బిలియనీర్లంతా తమ సంపదలో సగంకు పైగా సామాజిక సేవా కార్యక్రమాలలో వెచ్చించాలని కోరుతున్నాడు. పర్యావరణ సమస్యలు, ఆరోగ్య సమస్యలపై పోరు సలిపేందుకు మూర్‌ ఫౌండేషన్‌ విశేషంగా సేవలు అందిస్తుంది. 2012లో బిల్‌గేట్స్‌ పిలుపునిచ్చిన దాతృత్వ ప్రతినలో భాగంగా మూర్‌ తన సంపదలో సగాన్ని సేవా కార్యక్రమాలకు ఇస్తున్నట్లు ప్రకటించాడు.

ఎలాన్‌ముస్క్‌, టెస్లా వ్యవస్థాపకుడు

బ్యాటరీ కార్లు, అంతరిక్ష పర్యాటకం ఇలా తాను ప్రవేశించని రంగం అంటూ లేని ఎలాన్‌మస్క్‌ను అమెరికన్‌ సమాజం రియల్‌ ఐరన్‌మేన్‌ అని కొనియాడుతుంది. పలు టెక్నాలజీ కంపెనీలను స్థాపించిన ఎలాన్‌ బ్యాటరీ కార్ల సంస్థ టెస్లాతో ప్రపంచ కుభేరుల సరసన చేరాడు. బిల్‌గేట్స్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన సంపదలో సుమారు 13బిలియన్‌ డాలర్లను సేవా కార్యక్రమాలకు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు. సైన్స్‌, ఇంజనీరింగ్‌ రంగాలలో వినూత్న పరిశోధనలు చేసేందుకు తన సంపదను వెచ్చిస్తున్నాడు. ఏడాదికి కేవలం ఒక్క డాలర్‌ను మాత్రమే జీతంగా తీసుకునే ఎలాన్‌ మస్క్‌ ప్రపంచలోనే అత్యుత్తమ కార్ల కంపెనీగా టెస్లాను తీర్చిదిద్దాడు.

లారీఫేజ్‌ గూగిల్‌ వ్యవస్థాపకుడు

ఇంటర్నెట్‌ రారాజు గూగిల్‌ వ్యవస్థాపకుడు లారీఫేజ్‌ మాత్రం సేవా కార్యక్రమాల విషయంలో మరింత వినూత్నంగా ముందుకు వెళుతున్నాడు. బిలియన్‌ డాలర్లను కేవలం స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళంగా ఇవ్వడం కాకుండా, ప్రపంచాన్ని మార్చివేసే వినూత్నమైన ఆలోచనలతో వచ్చేవారిని ప్రోత్సహించేందుకు కార్యక్రమాలను రూపొందిస్తున్నాడు లారీఫేజ్‌. తన పిల్లలకు తన సంపదను ఇవ్వడం కన్నా, ప్రపంచంలో ఎన్నో సమస్యలకు సమాధానాలను చూపెట్టగలిగే ప్రతిభావంతులకు తన సంపద ఉపయోగపడితేనే తనకు ఇష్టమని లారీఫేజ్‌ చెబుతుంటాడు.

లారీఎలిసన్‌ ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు

సాప్ట్‌వేర్‌ దిగ్గజం ఒరాకిల్‌ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్‌ తన సంపదలో 95శాతం దాతృత్వ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు. తన సంస్థకు చెందిన ఫౌండేషన్‌ద్వారా వైద్య ఆరోగ్య సంబంధిత సమస్యలపై పరిశోధనలకు కోట్లాది డాలర్లను వెచ్చిస్తున్న లారీ తన పిల్లలకు కూడా సేవా కార్యక్రమాలలో పాల్గనమని చెబుతుంటాడట. 2010లో వారెన్‌బఫెట్‌ ఇచ్చిన పిలుపు మేరకు తన సంపదలో అధిక భాగాన్ని సామాజిక కార్యక్రమాలకు, సేవా కార్యక్రమాలకు వెచ్చించేందుకు సిద్ధమయ్యాడు లారీ.

పాల్‌ అలెన్‌, మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు

తన చిరకాల స్నేహితుడు మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ పిలుపు మేరకు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటున్న మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు పాల్‌ అలెన్‌ తన సంపదలో అధిక వాటా దాతృత్వ కార్యక్రమాలకే వెచ్చిస్తున్నాడు. అలెన్‌ తన 17బిలియన్‌ డాలర్ల ఆస్తులను తన సోదరితో కలిపి నిర్వహించే ఫౌండేషన్‌కు రాసిచ్చేసారు.

రిచర్డ్‌ బ్రాన్‌సన్‌

వర్జిన్‌ సంస్థల వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్‌సన్‌ సైతం సేవా కార్యక్రమాలలో చురుగ్గానే పాల్గంటున్నాడు. రిచర్డ్‌తో పాటు తన భార్య, కుమారుడు, కుమార్తె కూడా దాతృత్వంవైపు అడుగులు వేస్తున్నారు. 2013లో దాతృత్వ ప్రతిజ్ఞ చేసిన రిచర్డ్‌ కుటుంబం తమ సంపదను సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తోంది. డబ్బు తమనకు శాశ్వత ఆనందాన్ని సమకూర్చలేదని గ్రహించిన రిచర్డ్‌ సేవా కార్యక్రమాల ద్వారా ఆనందాన్ని వెతుక్కుంటున్నాడు.

మార్క్‌ జుకర్‌బర్గ్‌

మార్క్‌జుకర్‌ బర్గ్‌ 2010లో దాతృత్వ ప్రతిజ్ఞ చేసినపుడు అతని సంపద విలువ కేవలం 6బిలియన్‌ డాలర్లు మాత్రమే. కానీ ఇప్పుడు మార్క్‌ సంపద విలువ 47బిలియన్‌ డాలర్లకు చేరింది. డిసెంబర్‌ 1వ తేదీన తనకు పాప పుట్టిన సందర్భంగా తన సంపదలోని 95శాతం డబ్బును సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నట్లు ప్రకటించాడు. తన వారసురాలికి తన సంపదను ఇవ్వడానికి బదులుగా ప్రపంచంలోని ప్రతీ ఒక్క చిన్నారి క్షేమం కోరే కార్యక్రమాలను రూపు దిద్దేందుకు పూనుకున్నాడు.

ప్రపంచం నుండి ఎంతో సంపదను సృష్టించిన ఈ సిలీకాన్‌ వ్యాలీ వీరులు మళ్ళీ అదే ప్రపంచానికి తిరిగి ఇచ్చేయాలంటే ఎంతో పెద్ద మనసు ఉండాలి.


English summary

The silicon valley titans who gave their wealth to philanthrophy. Various bussiness tycoons like bills gates and markzuker berg are there in this list