టీమిండియాకు శ్రీలంక షాక్

Srilanka Win Against India in First T20

10:20 AM ON 10th February, 2016 By Mirchi Vilas

Srilanka Win Against India in First T20

మూడు టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ లో శ్రీలంక టీమిండియాకు షాక్ ఇచ్చింది. పుణెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలడంతో 101 పరుగులకే కుప్పకూలిన భారత్‌.. బౌలింగ్‌లో చివరి వరకు పోరాడినా స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోలేక 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ విజయంతో సిరీస్‌లో శ్రీలంక 1-0తో ఆధిక్యంలో నిలిచింది. టాస్‌ గెలిచిన శ్రీలంక కెప్టెన్‌ చండిమాల్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా పరుగుల ఖాతా తెరవకుండానే శ్రీలంక అరంగేట్రం పేసర్‌ కసున్‌ రజిత ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఓపెనర్‌ రోహిత్‌ శర్మను డకౌట్‌గా పెవిలియన్‌ పంపి షాకిచ్చాడు. భారత్‌ తేరుకోకముందే ఆ ఓవర్‌ చివరి బంతికి రహానె(4)ని కూడా ఔట్‌ చేసి ఆతిథ్య జట్టును పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేశాడు.

అయితే కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ధాటిగా ఆడేందుకు ప్రయత్నించిన ధావన్‌ (9), సురేశ్‌ రైనా(20)కూడా ఫేలవ షాట్లతో జట్టు స్కోరు 49లోపే పెవిలియన్‌ చేరారు. ఆదుకుంటాడనుకున్న కెప్టెన్‌ ధోని (2), యువరాజ్‌ (10), హార్దిక్‌ పాండ్య (2) ఏడు పరుగుల వ్యవధిలో వరుసగా వికెట్లు చేజార్చుకోవడంతో 11 ఓవర్లకు భారత్‌ 58/7తో నిలిచి కనీసం 100 పరుగుల మార్కును కూడా దాటలేదేమో అనిపించింది. జట్టు టాప్‌ స్కోరర్‌ అశ్విన్‌ (31: 24 బంతుల్లో 5×4) చివర్లో బ్యాట్‌ ఝళిపించడంతో టీమిండియా 101 పరుగులు చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో కసున్‌ రజిత (3/29), శనక (3/16), చమీరా (2/14), సేననాయకే (1/18) సమష్టిగా రాణించి భారత్‌ను కట్టడి చేశారు. స్వల్ప లక్ష్య ఛేదనకు బరిలో దిగిన శ్రీలంక భారత్‌ పేసర్‌ ఆశిష్‌ నెహ్రా విజృంభనతో 23 పరుగులకే ఓపెనర్లు డిక్వెలా (4), గుణతిలక (9) వికెట్లను కోల్పోయింది. అయితే వికెట్‌ కాపాడుకుంటూ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన చండిమాల్‌ (35), మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ కపుగెదర(25)తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడి శ్రీలంకను గెలుపు తీరాలకు చేర్చాడు. చివర్లో సిరివర్ధనె (21 నాటౌట్‌) సమయోచితంగా ఆడి విజయ లాంఛనాన్ని 18 ఓవర్లలో 105/5తో పూర్తి చేశాడు. రెండో టీ20 మ్యాచ్‌ రాంచి వేదికగా ఫిబ్రవరి 12న జరగనుంది.

English summary

Team India was bowled out for a paltry 101 in 18.5 overs by Sri Lanka in the first Twenty20 international on Tuesday.India batting collapsed for bowling line-up of Sri Lanka and failed to set a big target; Sri Lanka chase down 102 in 18 overs.SL beats India by 5 wickets