సీతమ్మ పుస్తెలు ఇంకా దొరకలేదు.. ఇక పోలీసులే తేల్చాలట!

Still not identified Seethamma thalli pusthelu

01:24 PM ON 25th August, 2016 By Mirchi Vilas

Still not identified Seethamma thalli pusthelu

ఖమ్మం జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో మాయమైన ఆభరణాలకు సంబంధించి, ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే ఆభరణాలు మిస్ అయిన విషయంపై స్పష్టత వచ్చేసింది. పోయిన ఆభరణాల విషయంలో ఇప్పటివరకూ ఉన్న ఒక్క ఆశ కూడా ఆవిరైంది. సీతమ్మ పుస్తెలు హుండీలోనూ లభించలేదు. ఎవరైనా అర్చకులు ఆభరణాలను తీసి ఉంటే వాటిని రామాలయంలోని ఏదో ఒక హుండీలో వేసి ఉంటారనే అనుమానంతో బుధవారం ఆలయంలోని అన్ని హుండీలనూ తెరిచి చూశారు. భారీ ఇనుప జల్లెడ కింద బకెట్లు పెట్టి మరీ వెతికారు. అయినా ఆభరణాల ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసు మార్కు విచారణతోనే ఆభరణాల విషయం తేలాల్సి ఉంది.

ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించడంతో భద్రాచలం సీఐ బి.శ్రీనివాసులు స్వయంగా కేసు విచారణ చేపట్టారు. ఆలయ ఈవో టి.రమేశ్‌ బాబు రెండు రోజుల క్రితమే ఈ విషయమై పట్టణ పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. మరోవైపు ఆలయ అర్చకుల వద్ద నిత్యపూజల కోసం ఉంచిన ఆభరణాల్లో 59 ఆభరణాలను ఆలయ అధికారులు బ్యాంకు లాకర్లలోకి చేర్చారు. ఆలయంలో ఇటీవలి వరకు అర్చకుల వద్ద నిత్యపూజల కోసం ఇతర ఆభరణాలు 90 ఉండాలని అధికారులు గుర్తించారు. గత రెండు రోజులుగా దేవాదాయశాఖకు చెందిన జ్యూయలరీ వెరిఫికేషన్ అధికారి ఇందుకు సంబంధించిన లెక్కలను తేల్చి, రెండు ఆభరణాలు గల్లంతయినట్లు గుర్తించారు.

దీంతో అర్చకుల వద్ద ఉన్నవాటిలో 59 ఆభరణాలను నిత్యపూజలకు వినియోగించాల్సిన అవసరంలేదని నిర్ణయించారు. మిగిలిన ఆభరణాలను ప్రస్తుతం నిత్యపూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అర్చకులకు అందజేశారు. ఈ సమయంలో అర్చకులతోపాటు ఒక పర్యవేక్షకుడికి వాటి పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుతం మిస్ అయిన ఆభరణాల ఆచూకీ తేల్చేందుకు పోలీస్ మార్క్ విచారణ తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ నగలకే దిక్కు లేకపోతే ఇక మామూలు వాళ్ళ గతేమిటని పలువురు నెటిజన్లు, భక్తులు మండిపడుతున్నారు.

English summary

Still not identified Seethamma thalli pusthelu