నేతాజీ చివరి రోజులు ఇలా గడిచాయా?

Subash Chandrabose Death Mystery

12:44 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Subash Chandrabose Death Mystery

నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. 1945 ఆగస్టు 18న ఆయన ప్రయాణిస్తున్న విమానం తైవాన్‌లో కూలినందువల్లే మరణించారనేది ఇప్పటి వరకూ కొనసాగుతున్న వాదన. అయితే మిస్టరీ మాత్రం ఇంకా వీడలేదు. కేంద్రంలో మోడీ సర్కార్ వచ్చాక దీనిపై నిజానిజాలు నిగ్గు తేలతాయని అంటున్నారు. ఆ దిశగా కొంత తతంగం నడిచింది. బంగాల్ దీదీ మమతా బెనర్జీ కూడా దీని పై స్పందించారు. మరోపక్క బంగాల్ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. బోస్ మరణ మిస్టరీ కీలక అంశం కానుందని భావిస్తున్నారు.

అయితే ఇదే సమయంలో బోస్ గడిపిన ఆఖరి రోజుల వివరాల పేరిట బోస్ మనవడు, స్వతంత్ర పాత్రికేయుడైన ఆశిష్‌ రే విడుదల చేసిన తాజా పత్రాల అంశం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నేతాజీ చివరి రోజుల సమాచార పత్రాలను తాను ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌ www.bosefiles.infoలో అందరికీ అందుబాటులో ఉంచారు.

ఈ డాక్యుమెంట్స్‌లోని వివరాల ను పరిశీలిస్తే , 1945 ఆగస్టు 17న నేతాజీ తన బృందంతో బ్యాంకాక్‌ నుంచి విమానంలో మధ్యాహ్నం వేళకు వియత్నాంలోని సైగాన్‌ (ప్రస్తుతం హోచిమిన్‌ సిటీ) చేరుకున్నారు. నిజానికి నేతాజీ ఈశాన్య ఆసియా వెళ్లాల్సి ఉంది. కానీ, రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ ఓ రెండు రోజుల ముందు లొంగిపోవడంతో అక్కడి వెళ్లే వీలులేక నేతాజీ బృందం సైగాన్‌లో దిగాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో నేతాజీ నాయకత్వంలోగల భారత జాతీయ సైన్యం (ఐఎన్‌ఏ), జపాన్‌కు మధ్యవర్తిగా ఉన్న ‘హికరి కికన్‌' సంస్థకు చెందిన జనరల్‌ ఇసోదా ఆయనతో మాట్లాడారు.

టోక్యో వెళుతున్న 14 సీట్ల జపాన్‌ యుద్ధ విమానంలో రెండు సీట్లున్నాయని, తమతో రావచ్చునని నేతాజీని కోరినట్లు , తప్పనిసరి పరిస్థితిలో కల్నల్‌ రహ్మన్‌తో కలిసి నేతాజీ బయలుదే రినట్లు అందులో వుంది. అయితే, తనతోపాటు చైనాలోని మంచూరియా రావాలని లెఫ్టినెంట్‌ జనరల్‌ షిదెయ్‌ సూచించగా ఆయన అంగీకరించారు. అయితే విమానం ఆలస్యంగా బయల్దేరడంతో పైలట్‌ సూచనమేరకు తౌరేన్‌లో ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారట.

ఇదండీ .... ప్రస్తుతానికి నేతాజీ మనవడు తన వెబ్‌సైట్‌ వెల్లడించిన వివరాలు. నేతాజీ మరణించడంపై వాస్తవాలను తదుపరి పత్రాల్లో వెల్లడిస్తామని అందులో పేర్కొ నడం కొసమెరుపు.

ఇక నేతాజీ మరణం మిస్టరీపై 1956లో మేజర్ జరనల్ షా నవాజ్ ఖాన్ ఆధ్వర్యంలో ఓ కమిటీని వేశారు. ఆ తర్వాత నేతాజీ మరణం మిస్టరీపై ఐఎన్ఏ చీఫ్‌గా మేజర్ జనరల్ భోస్లే బ్రిటిష్ మిలిటరీ ఇంటిలిజెన్స్‌ను సైతం విచారించినట్లు చెబుతుంటారు. ఈ విచారణలో ఆగస్టు 17, 1945 ఉదయం నేతాజీ బాంకాక్ నుంచి సైగాన్ వెళ్లినట్లు వెల్లడైంది.

అయితే నేతాజీ బోస్ 1945 లో చనిపోలేదని , చాలాకాలం జీవించి వున్నారని ఎప్పటినుంచో ఓ వాదన బలంగానే వినిపిస్తోంది. రష్యా జైలులో బోస్ చాలాకాలం బందీగా వున్నట్టు , ఆతర్వాత ఇండియా కూడా వచ్చినట్లు ... ఇలా రకరకాల ఊహాగానాలు , వాదనలు వినిపిస్తూనే వున్నాయి.

ఒక్క బోస్ గురించే కాదు విప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు మరణంపై కూడా మిస్టరీ వుందని అంటుంటారు. చాలాకాలం అల్లూరి జీవించి వున్నారని అంటుంటారు.

ఇందులో నిజమెంతో , అసలు ఇలాంటి నేతల మరణంపై మిస్టరీ కొనసాగడానికి గల బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా వంటి విషయాలు నిగ్గు తేలేనా?

English summary

Netaji Subash Chandra Bose's death is still shrouded in mystery. But the various conspiracy theories about it make it even more mysterious.