రైల్వే శాఖకు సుప్రీం మొట్టికాయలు

Supreme Court gives warning to railways

03:36 PM ON 6th July, 2016 By Mirchi Vilas

Supreme Court gives warning to railways

రైళ్ళ టాప్ పై ప్రయాణిస్తూ ఎవరైనా ప్రమాదవశాత్తూ మరణిస్తే అందుకు రైల్వే శాఖదే బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు తాము బాధ్యత వహించబోమన్న రైల్వే వర్గాల వాదనను కోర్టు తోసి పుచ్చింది. దీనికి సంబంధించి.. గతంలో(2011లో) షాజహాన్ పూర్ జిల్లాలో జరిగిన ఘటన పూర్వాపరాల్లోకి వెళ్తే.. బరైలీ నుంచి బయలుదేరిన జమ్మూ తావి-హౌరా హిమగిరి ఎక్స్ ప్రెస్ టాప్ పై ప్రయాణిస్తూ.. 19 మంది యువకులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి తగిలి గాయాలకు గురై మరణించారు. ఆ ప్రమాదం జరిగినప్పటికీ రైలు ఆగకుండా మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించింది.

ఈ ఘటనపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఆ యువకుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని రైల్వే శాఖను ఆదేశించింది. రైలు టాప్ పై నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించడం తప్పే.. కానీ ప్రమాదం జరిగి ఎవరైనా మృత్యువాత పడితే అందుకు బాధ్యత తమది కాదని రైల్వే శాఖ తప్పించుకోజాలదు అని చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ యు.యు.లలిత్ లతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది. 2011 ఫిబ్రవరి 1న ఇండో- టిబెటన్ బార్డర్ పోలీస్ సెలెక్షన్ కోసం చాలా మంది యువకులు యూపీ చేరుకున్నారు. సెలెక్ట్ కానివారిలో కొందరు తిరుగు ప్రయాణంలో.. జనం రద్దీ దృష్ట్యా రైలు టాప్ పైకెక్కి ప్రయాణించారు.

అయితే షాజహాన్ పూర్ జిల్లాలో ఒకచోట ఫుట్ ఓవర్ బ్రిడ్జి తగిలి గాయపడ్డారు. తీవ్ర గాయాలకు గురైన వారిలో 19 మంది మృతి చెందారు.. ఆ సమయంలో రైలు గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. యాక్సిడెంట్ జరిగినప్పటికీ రైలు ఆగకుండా మూడు కి.మీ. దూరం వెళ్ళిపోయింది. ఇది చాలా అమానుషమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. మొత్తానికి సుప్రీం వేసిన మొట్టికాయలతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా రైల్వే శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని ఆశిద్దాం.

English summary

Supreme Court gives warning to railways