జయలలితపై సుప్రీం సీరియస్

Supreme court serious on Jayalalitha

11:30 AM ON 25th August, 2016 By Mirchi Vilas

Supreme court serious on Jayalalitha

మాంచి జోరుమీద తన పనులు తాను చేసుకుపోతూ, ఎదుటి వాళ్ళను కట్టడి చేయడం, అవసరమైతే కేసులు వేయడం చేస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఎదురుదెబ్బ తగిలింది. ఆమెపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పనితీరును విమర్శిస్తున్న వారి నోరు మూయించేందుకు క్రిమినల్, పరువు నష్టం కేసులు దాఖలు చేస్తున్న తీరును ఎండగట్టింది. ప్రజా జీవితంలో ఉన్న వారు విమర్శలను ఎదుర్కోవాల్సిందేనని తెలిపింది. ప్రజాస్వామ్యం గొంతు నులిమేందుకు పరువు నష్టం కేసులను వాడుకోలేరు. ఇది ప్రజాస్వామ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు అని తెలిపింది. ఈ ఏడాది జూలైలోనూ ఇదే అంశంపై జయను తప్పుపట్టిన సుప్రీం... మంగళవారం మరోసారి మండిపడింది.

విమర్శించిన వారిపై పరువు నష్టం కేసులు వేసే బదులు, సుపరిపాలన అందించడంపై దృష్టి సారిస్తే మంచిది అని తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీం సలహా ఇచ్చింది. తనపై దాఖలైన పరువునష్టం కేసులు కొట్టివేయాలంటూ డీఎండీకే అధిపతి విజయ్ కాంత్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్ విచారణ జరిపారు. విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్లను ఇదివరకే ఈ ధర్మాసనం నిలిపివేసింది. ఈ కేసు బుధవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సి.నాగప్పలతో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రజా జీవితంలో ఉన్నారు. విమర్శలు ఎదుర్కోక తప్పదు. విమర్శలను సహించే లక్షణం ఉండాలి.

పరువునష్టం కేసులను రాజకీయ అస్త్రాలుగా ఉపయోగించవద్దు. రాజకీయ ప్రత్యర్థులపై కేసులు పెట్టేలా ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించజాలదు. ప్రభుత్వాన్ని, అధికారులను విమర్శించిన వారందరిపై కేసులు పెడుతూపొతే భయానక పరిస్థితి నెలకొంటుంది అని ధర్మాసనం పేర్కొంది. పరువునష్టం కేసులను తమిళనాడులాగా మరే రాష్ట్రమూ దుర్వినియోగం చేయడంలేదని తెలిపింది. తన ఆరోగ్య పరిస్థితిపై వార్తలు రాసినా జయలలిత పరువు నష్టం కేసులు పెడుతున్నారని తెలిపింది. ముఖ్యమంత్రి ఆరోగ్య పరిస్థితి గురించి రాసినంత మాత్రాన కేసులు పెట్టలేరు అని తెలిపింది.

గత ఐదేళ్లలో ప్రభుత్వం 200 పరువు నష్టం కేసులు దాఖలు చేసినట్లు తమిళనాడు సర్కారు తరఫు న్యాయవాది ఇదివరకే సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించారు. అందులో 55 కేసులు మీడియాపై దాఖలయ్యాయి. 85 కేసులు అచ్చంగా ముఖ్యమంత్రి జయలలితపై చేసిన విమర్శలకు సంబంధించినవే. ఒక్క విజయ్ కాంత్ పైనే సుమారు పాతిక కేసులు పెట్టారు. ఈ నివేదికను సుప్రీంకోర్టు నిశితంగా పరిశీలించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణ వచ్చేనెల 21వ తేదీకి వాయిదా వేసింది. గతంలో ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు నేరుగా జయలలితకే సమన్లు జారీ చేసిందని చెప్పవచ్చు.

English summary

Supreme court serious on Jayalalitha