వీరిద్దరికీ  తెలంగాణ తెలుగు తమ్ముడి లేఖ       

TDP Fan Letter To Pawan and NTR

10:14 AM ON 15th February, 2016 By Mirchi Vilas

TDP Fan Letter To Pawan and NTR

టిడిపి తరపున నెగ్గిన ఎంఎల్ఎ లు టిఆర్ఎస్ గూటికి చేరిపోతుండడం, తెలంగాణ లో టీడీపీ పరిస్థితి నానాటికి ఇబ్బందికరంగా మారడం పట్ల ఓ అభిమాని ఆవేధన వ్యక్తం చేస్తూ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు, ఎన్టీఆర్ కు ఓ లేఖ రాశాడు. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గౌరవనీయులైన నా అన్నలకు..మీ అభిమాని గంగారాం అంటూ తెలంగాణా యాసలో చాలా విచిత్రంగా లేఖ సంధించాడు.

'అన్నా..మీ మానాన మీరు సినిమాలు తీస్తా బాగానే ఉన్నారు. మీ సినిమాలు చూస్తూ మేము బాగానే ఉన్నాం. కానీ మిమ్మల్నే నమ్ముకున్న చంద్రం పెద్దయ్య పరిస్థితే ఏం బాలేదు. ఆపరేషన్ ఆకర్ష్ తో ఓ పెద్దాయన సైకిల్ తొక్కుతున్నవారందరిని..కారెక్కించుకుంటున్నాడు. మనోళ్లు సైకిల్ తొక్కలేక..ఓలా..ఊబర్ లలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మరీ కారెక్కేస్తున్నారు. అటు పెద్దయ్య మాత్రం సైకిల్ ను రీసైకిల్ చేసి..ఇటు నన్ను..అటు కార్యకర్తల్ని కాపాడే మీకోసం దిక్కులు చూస్తున్నాడు. ఇటు నేనున్నా..నేనున్నా అని పలికిన అమూల్ బేబీ లోకేష్ అన్న సై”కిల్”ను ఓ రేంజ్ లో తొక్కి హైదరాబాద్ లో పార్టీని నిజంగానే నెంబర్ వన్ చేశాడు. అందుకే ఆ నెంబర్ వన్ పార్టీలో మేముండమంటూ సైకిల్ కు పంక్చర్ చేసి సీటు ఒకళ్లు, టైర్ ఒకళ్లు ఎత్తుకెళ్లిపోయారు. రిమ్ములు లేని సైకిల్ని మన తెలంగాణ పులిబిడ్డ మాత్రం ఎన్ని రోజులు తొక్కుద్ది. ఎవరైనా హస్తం అందించినా కార్లో లిఫ్ట్ ఇచ్చినా వెళ్లిపోతుందేమో అని పెద్దయ్య బాధపడుతున్నాడు' అంటూ ఆలేఖ లో పేర్కొన్నాడు.

ఎన్టీఆర్ అన్నా.. అప్పుడు ఏమన్నావో గుర్తుందా జూనియర్ ఉద్దేశించి ఇలా రాసాడు. 'మనం అధికారంలో ఉండవచ్చు..లేకపోవచ్చు..ప్రతిపక్షంలో ఉండవచ్చు..కానీ మన బాధ్యతలో ఏ విధమైన మార్పు ఉండకూడదన్నారు. అధికారంలో ఉంటే అన్నీ మనం చేద్దామనుకోవడం అది మన బ్రమ మాత్రమే . మన జాతిపిత ను గుర్తు చేసి అయన అధికారంలో లేడు కానీ మన భారత జాతికి ఆయన చేసిన సేవల్ని మనం మరిచిపోతామా. ప్రపంచ చరిత్రను మార్చిన ఎన్నో ఉద్యమాలు కూడా అధికారంతో సంబంధం లేకుండా జరిగాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బావిలో నీళ్లు ఉన్నప్పుడు చుట్టూ కప్పలే కనిపిస్తాయి. కానీ నీళ్లు లేనప్పుడే అసలు రంగు కనబడేది. మనం అధికారంలో ఉన్నప్పుడు మన చెవుల్లో బాకాలూదే నాయకులు మనకొద్దు. పార్టీ కి కష్టమొచ్చిన, నష్టం వచ్చినా కాపాడుకోవడానికి మేమున్నాం అని ముందుకొచ్చే నికార్సయిన, నిజమైన కార్యకర్తలు కావాలన్నావ్ అన్నా నువ్వన్నట్లే ఆ కప్పులు వెళ్లిపోయాయి. బాకాలూదే నాయకులు వెళ్లిపోయారు. మరి మిగిలింది నేను, మన కార్యకర్తలు. కనీసం మమ్మల్ని కాపాడటానికైనా నువ్వు రావాలన్నా..నీ రాక కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం. మేమే కాదు..మీ కోసం మన పెద్దయ్య వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు' అంటూ జూనియర్ ని ఆ లేఖలో కోరాడు.

ఇక అన్నో పవన్ అన్నా..నువ్వేం తక్కువేం తినలేదు అంటూ పవర్ స్టార్ ని ఉద్దేశించి కూడా రాసేశాడు.

'ఆటు ఆంధ్రాలో పెద్దయ్యకు పెద్దదిక్కువై సైకిల్ జోరును పెంచేలా చేశావ్. అందుకే “నమో”కూడా నిన్నే నమ్మాడు. అంతే కాదు ఆయన నామస్మారణ ఎక్కడ జరిగినా అందులో నిన్ను భాగస్వామిని చేశారు. మరి నువ్వేమో ఇప్పుడు ఏమీ పట్టనట్టుగా సినిమాలు చేసుకుంటున్నావ్. నాలాంటి వాళ్లమేమో దశ – దిశ తెలియకుండా ఇలా పడున్నాం' అని పవన్ కి మొర పెట్టుకున్నాడు. ఈ లేఖల పరిస్థితి చూస్తే, ఎన్ టి ఆర్ , పవన్ కళ్యాణ్ లు మాత్రమే తెలంగాణాలో పార్టీని గట్టెక్కించ గలరనే అభిప్రాయం వ్యక్తం చేసాడు గంగారాం. మరి బాబు గారు ఏమి చేస్తారో చూడాలి.

English summary

A Telugu Desam Party in Telangana Named Ganga Ram wrote a letter to Heroes Pawan Kalyan and Junior NTR.In that letter he requested Pawana Kalyan And Junior NTR to support Telugu Desam Party in Telangana State