పార్లమెంట్ కి తెలుగు వివేకానందుడు

TDP MP Siva Prasad came as Swami Vivekananda to parliament

12:05 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

TDP MP Siva Prasad came as Swami Vivekananda to parliament

రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంటు దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో దాదాపుగా అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో నాటి అధికారపక్షం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎంపీలంతా నిరసనలు.. నినాదాలు చేసేవారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ రోజుకో వేషంలో పార్లమెంటుకు వచ్చి తనకు తోచిన వ్యాఖ్యలు చేస్తూ, వినోదాన్ని కూడా పంచేవారు. విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కూడా మళ్లీ అలాంటి సన్నివేశమే పార్లమెంటు దగ్గర చోటు చేసుకోవటం గమనార్హం. నాడు.. విభజనకు వ్యతిరేకంగా ఏపీ ఎంపీలు గళం విప్పితే, నేడు ప్రత్యేక హోదా మీద వాయిస్ వినిపిస్తున్నారు. విభజన సమయంలో పార్లమెంటు దగ్గర గాంధీ విగ్రహం దగ్గర నిరసనలు నిర్వహించటం.. ప్లకార్డులు ప్రదర్శించటం, నినాదాలు చేయటం, ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టటం చేసేవారో, ఇప్పుడు అలానే చేస్తున్నారు.

అయితే, నాడు కాంగ్రెస్ పార్టీని తప్పు పడితే, నేడు బీజేపీని తప్పు పడుతున్నారు. మిగిలినదంతా సేమ్ టు సేమ్. సోమవారం లోక్ సభలో ఏపీ ఎంపీలు హోదా అంశంపై చెలరేగిపోవటం, ప్లకార్డులు ప్రదర్శించి నిరసన చేసిన తీరులోనే మంగళవారం దాదాపు అలాంటి పరిస్థితులే చోటు చేసుకున్నాయి. మంగళవారం ఉదయం పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు మహాత్ముడికి నివాళులు అర్పించి, ప్రత్యేక హోదాపై నినాదాలు చేశారు. వారు వచ్చిన కాసేపటికి అక్కడకు చేరుకున్న తెలుగుదేశం ఎంపీలు నివాళులు అర్పించి నినాదాలు చేశారు. అయితే అధికార.. విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నది ఒకే అంశమైనప్పటికీ వేర్వేరుగా వారు తమ నిరసనల్ని వ్యక్తం చేస్తూ, తెలుగువారి అనైక్యత చాటారు. ఇక, విభజన సమయంలో మాదిరే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ మరో వేషం వేశారు. వివేకానందుడి గెటప్ లో వచ్చారు.

ఇంటి దగ్గరే వివేకానందుడి వేషం వేసుకొని వచ్చిన ఆయన, తప్పును సరిదిద్దకుంటే అది మరింత ముప్పును తెచ్చి పెడుతుందంటూ వివేకానందుడి సూక్తుల్ని వల్లె వేశారు. ఇక.. ఏపీ అధికారపక్ష ఎంపీలు ప్లకార్డులు పట్టుకొని, హోదాకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. ఏళ్లు గడిచాయే తప్పించి, ఏపీకి జరిగిన అన్యాయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదన్నది. నాడు విపక్షంగా ఉన్న తెలుగుదేశం నేడు అధికారపక్షానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే నిరసనల్ని చేపట్టాల్సిన దుస్థితి దాపురించింది.

English summary

TDP MP Siva Prasad came as Swami Vivekananda to parliament