కృష్ణా పుష్కరాలు తొలిసారి చేయనున్న టిడిపి ప్రభుత్వం

TDP To Host Krishna River Pushkaram For THe First Time

01:32 PM ON 25th November, 2015 By Mirchi Vilas

TDP To Host Krishna River Pushkaram For THe First Time

గోదావరి పుష్కరాలను రెండు సార్లు తెలుగుదేశం ప్రభుత్వమే నిర్వహించింది. అయితే కృష్ణా పుష్కరాలను తొలిసారి నిర్వహించబోతోంది. 2003, 2015లలో హైటెక్ సొబగులు అద్ది, తనదైన శైలిలో సిఎమ్ చంద్రబాబు గోదావరి పుష్కరాలను నిర్వహించి , మంచి మార్కులే కొట్టేసారు. అయితే కృష్ణా పుష్కరాలను నిర్వహించే చాన్స్ మాత్రం వచ్చే ఏడాది దక్కబోతోంది. 1983లో టిడిపి అధికారంలోకి వచ్చినా , అప్పటికే 1979 లో గోదావరి పుష్కరాలు, 1980లో కృష్ణా పుష్కరాలు అయిపోయాయి. ఇక 1991 గోదావరి పుష్కరాలైనా నిర్వహించాలను కుంటే , 1989ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ చాన్స్ దక్కలేదు. 1991 గోదావరి పుష్కరాలను,1992లో కృష్ణా పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించింది.

1994 లో ఎన్ టి ఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా , పార్టీలో తిరుగుబాటు వలన ఎన్ టి ఆర్ అధికారం కోల్పోయి, 1995 సెప్టెంబర్ లో చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టారు. 1999 ఎన్నికల్లో కూడా టిడిపి గెలవడంతో 2003 గోదావరి పుష్కరాలను చంద్రబాబు నిర్వహించే అదృష్టం దక్కించుకున్నారు. ఎన్ టి ఆర్ కి దక్కని అవకాశం బాబుకి వచ్చింది. తొలిసారి గోదావరి పుష్కరాలను నిర్వహించిన చంద్రబాబు ఆతర్వాత 2004ఎన్నికల్లో ఓడిపోవడంతో కృష్ణా పుష్కరాలు నిర్వహించే సావకాశం కోల్పోయారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం తో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సారధ్యంలో కృష్ణా పుష్కరాలు జరిగాయి.

మళ్ళీ 2015గోదావరి పుష్కరాలు వచ్చేసరికి 2014ఎన్నికల్లో గెలుపొందిన చంద్రబాబు సిఎమ్ అయ్యారు. 2003 గోదావరి పుష్కరాల అనుభవంతో 2015పుష్కరాలకు కూడా భారీ ఏర్పాట్లే చేయించారు. అయితే పుష్కర ఘాట్ దగ్గర తొక్కిసలాట సంభవించి, 30మంది వరకు ప్రాణాలు కోల్పోవడంతో రాజమండ్రిలోనే సిఎమ్ చంద్రబాబు మకాం వేసి ,స్వీయ పర్యవేక్షణ లో పుష్కరాలు జరిపించి , ముగింపు సభలో అందరినీ ప్రశంసించి మరీ వెళ్ళారు.

ఇక ఇప్పుడు కృష్ణా పుష్కరాలు కూడా వచ్చే ఏడాది వస్తున్నందున భారీ ఏర్పాట్లకు టిడిపి ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పైగా రాజధాని ముఖ ద్వాతంగా వున్న విజయవాడలో కృష్ణా పుష్కరాలను మంచి వేదికగా చేసుకొనే ప్రయత్నం కనిపిస్తోంది. గోదావరి పుష్కరాలకు కోటిలింగాల ఘాట్ ని విస్తరించి దేశంలోనే అతి పెద్ద ఘాట్ గా మలిచడం , వచ్చిన యాత్రికుల రద్దీని తట్టుకోడానికి దోహదపడం నేపధ్య్హంలో కృష్ణా పుష్కరాలకు కూడా పెద్ద నిడివి గల ఘాట్ నిర్మాణానికి కసరత్తు చేస్తున్నారు. అదికూడా అతి పెద్ద ఘాట్ గా వుండాలని చూస్తున్నారు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు అధ్యక్షతన మంగళవారం మొట్టమొదటి పుష్కర ఏర్పాట్ల సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాలలో నిర్మించిన భారీ ఘాట్‌ను దృష్టిలో పెట్టుకుని కృష్ణా పుష్కరాలకు దానిని తలదన్నే ఘాట్‌ నిర్మించాలని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈసందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అధికారుఅతొ సమీక్షిస్తూ, పలు సూచనలు చేసారు.

'రాజధాని ముఖద్వారం ఇబ్రహీంపట్నం నుంచి దుర్గాఘాట్‌ వరకు 14 కిలోమీటర్ల నిడివి కలిగిన కృష్ణానదీ తీరం వెంట భారతదేశంలో కెల్లా అతిపెద్ద పొడవైన ఘాట్‌ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి' అని మంత్రి సూచించారు. ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానది తీరం వెంబడి ప్రకాశం బ్యారేజీ సమీపంలో ఉన్న దుర్గాఘాట్‌ వరకు ఒకే ఘాట్‌ నిర్మిస్తే అత్యద్భుతంగా ఉంటుందని నిర్ణయించారు. ఇబ్రహీంపట్నం నుంచి దుర్గా ఘాట్‌ వరకు ఎంత దూరం ఉంటుందని మంత్రి ప్రశ్నించగా మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుందని అధికారులు వివరించారు.

మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం దగ్గర గోదావరి, కృష్ణా నదుల పవిత్ర సంగమం నుంచి ఘాట్‌ నిర్మాణాన్ని ప్రారంభించి ప్రకాశ బ్యారేజి, ఇంద్రకీలాది ముఖ ద్వారం వరకు ఒకే ఘాట్‌గా అభివృద్ధి పరచాలని ఆదేశించారు. పధ్నాలుగు కిలోమీటర్ల మేర ఘాట్‌ నిర్మాణం చేపడితే భారతదేశంలోనే అతిపెద్ద ఘాట్‌గా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ఘాట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులు, అనుమతులు కోసం జిల్లా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇరిగేషన ఎస్‌ఈ రామకృష్ణకు మంత్రి ఉమా సూచించారు.

రాజధాని బేస్డ్ గా సాగే కృష్ణా పుష్కరాలను టూరిజం కోణం తో పాటూ అందరీ ఆకర్షించే రీతిలో నిర్వహించడానికి టిడిపి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందనడానికి నిన్నటి సమావేశమే తార్కాణం. మరి ఎలాంటి హంగులు జత చేస్తారో చూడాలి.

English summary

Telugu Desam Party Government To Host Krishna Riverr pushkarams for the first time in Andhra Pradesh. Recently Tdp government hosted godavari river pushkaralu and makes it a grand success. Tdp is looking buil a 14 kilometer ghat on river krishna.