'నంది' రూపు మారుతోంది!

Telangana Government To Change Nandi Award Name

12:17 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Telangana Government To Change Nandi Award Name

తెలుగు సినిమాకి సంబంధించి నంది అవార్డు అంటే అదో అవార్డే కాదు పెద్ద రివార్డు గా భావించే పురస్కారం. దీన్ని అందుకోవడం తారలు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. 2010 వరకు ప్రతి సంవత్సరం ఉగాది రోజున ప్రభుత్వం నంది వేడుక నిర్వహిస్తూ వుండేది. అందుకే తెలుగు వారి పండుగ అయిన ఉగాదికి నంది సినీ పండగ ప్రత్యేక ఆకర్షణ అయ్యేది. కానీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత నంది నాటకోత్సవాలు మాత్రం ఎపిలో నిర్వహిస్తున్నా, సినిమాలకు సంబంధించి నంది అవార్డులు ఇస్తారా? లేదా? ఇస్తే ఏ ప్రభుత్వం ఇవ్వాలి అన్నదానిపై ఇంతవరకు తెలుగు రాష్ట్రాలలోని ఏ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. పైగా సినీ పరిశ్రమ వున్న హైదరాబాద్ తెలంగాణాలో వుండడం వలన సినీ పెద్దలూ ఈ విషయం గురించి ఇంకా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు.

ఈలోగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు రావడం , టిఆర్ఎస్ ఘన విజయం అందుకోవడం నేపధ్యంలో ఇప్పుడు తెలంగాణా ప్రభుత్వం ముందుకు వచ్చి నంది అవార్డుల విషయం పై ఓ కమిటీ వేసింది. తెలంగాణ చిత్ర పరిశ్రమను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపై మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్ , కెటిఆర్, తమ్మినేనితో కూడిన బృందం సీనియర్ సినీ ప్రముఖులతో సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ భేటీలో దాసరి నారాయణ రావు, రాజేంద్రప్రసాద్, సురేష్ కుమార్, అశోక్ కుమార్, కెఎస్ రామారావు, ఆర్.నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ నంది అవార్డుల పేరును మారుస్తున్నట్టు సూచనప్రాయంగా చెప్పారు. అంతేకాదు, నంది అవార్డులిచ్చే విషయంపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన చేస్తామన్నారు.

ఇక సినిమా పరిశ్రమలో ఉన్న పలు సమస్యల గురించి కూడా మంత్రి ప్రస్తావిస్తూ, సినిమా షూటింగ్ లకు అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో ద్వారా పరిష్కరించాలనుకున్నట్లు చెప్పారు. చిత్రపురి కాలనీని మరింత మెరుగు పరుస్తామని, మౌలిక వసతులు కల్పిస్తూ 10 వేల మందికి కొత్తగా ఇళ్లు కట్టిస్తామని, థియేటర్లలో 5 షోలు వేయడానికి పెట్టుకున్న ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని వివరించారు. లేపాక్షి నంది అని అంటుంటాం కదా , లేపాక్షి ఎపిలోని అనంతపురం లో వుంది. అందుకే నంది పేరుని మార్చేసి, తెలంగాణాలో వ్యవహారంలో వున్న పేరుని పెడతారని భావిస్తున్నారు.

English summary

Telangana Government decided to change the name of most prestigious Nandi awards name which was given to movie artists.According to an information Telangana Government has thinking on this change