పాక్ యూనివర్సిటీలో తెగబడ్డ ఉగ్రవాదులు

Terrorist Attack In Bacha Khan University In Pakistan

01:09 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Terrorist Attack In Bacha Khan University In Pakistan

ఉగ్రవాదులకు అదీ ఇదీ అని తేడాలేదు .... పసిపిల్లలు , పెద్దవాళ్ళు , మహిళలు , గుడి, బడి అనే తేడాలేదని మరోసారి నిరూపిస్తూ పాకిస్తాన్ లో ఉగ్రవాదులు చెలరేగిపోయారు. తుపాకులు , బాంబులతో విశ్వవిద్యాలయంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. దీంతో పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. వివరాలోకి వెళితే,

వాయువ్య ప్రాంతమైన చర్సడా నగరంలోని బచాఖాన్‌ యూనివర్సిటీపై బుధవారం ఉదయం ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. సాయుధులైన ఉగ్రవాదులు యూనివర్సిటీ క్యాంపస్‌లోకి చొరబడి పేలుళ్లు, కాల్పులతో విరుచుకుపడడంతో యునివర్సిటీ దద్దరిల్లింది. ఉదయం నుంచి యూనివర్సిటీలోని విద్యార్థులు, ఉపాధ్యాయులపై ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో జరుగుతున్న ఓ ఈవెంట్‌ సందర్భంగా ప్రస్తుతం అక్కడ 3వేల మంది విద్యార్థులు, 600 మంది అతిథులు ఉన్నారు. ముష్కరుల కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, 50మందికి గాయాలైనట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. ముష్కరుల దాడిలో దాదాపు 20మంది వరకు మృతిచెందినట్లు తెలుస్తోంది. ఉదయం దట్టంగా పొగమంచు కమ్ముకోవడంతో యూనివర్సిటీలోకి ఎంతమంది ఉగ్రవాదులు చొరబడ్డారన్న దానిపై పోలీసులు స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. యూనివర్సిటీ ప్రాంగణం చుట్టూ భద్రతా సిబ్బంది భారీగా మోహరించి ఉగ్రవాదులపై ఎదురుదాడి సాగిస్తున్నారు.

ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చినట్లు తెలుస్తోంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులను రక్షించేందుకు ఆపరేషన్‌ నిర్వహిస్తున్నట్లు డిప్యుటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సయీద్‌ వజీర్‌ వెల్లడించారు. ఉగ్రదాడితో భయాందోళనకు గురైన విద్యార్థులు భయంతో పరుగులు తీశారు. సైనికులు హెలికాప్టర్ల ద్వారా రక్షణ చర్యలు చేపట్టారు. ఉగ్రదాడి విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు యూనివర్సిటీ వద్దకు భారీగా చేరుకున్నారు.

కాగా బచాఖాన్‌ యూనివర్సిటీపై దాడికి పాల్పడింది తామేనని తెహ్రిక్‌-ఇ-తాలిబన్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. పాక్ ప్రభుత్వం ఎలర్ట్ ప్రకటించింది

English summary

Terrorists attacked in Bacha Khan University in Pakistan During An Event In The University. In this incident almost 20 people were died and 50 members were injured.