పంజాబ్ లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు 

Terrorist Attack In Punjab

10:52 AM ON 2nd January, 2016 By Mirchi Vilas

Terrorist Attack In Punjab

నలుగురు ఉగ్రవాదుల హతం - ఇద్దరు సైనికుల మరణం

గత జులై 27న గురుదాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ముష్కరులు దాడులకు పాల్పడిన ఘటన తర్వాత మరోసారి పంజాబ్‌లో ఉగ్రవాదులు తమ ప్రతాపం చూపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, మరో ఇద్దరు వైమానిక స్థావరంలోకి ప్రవేశించారు. భద్రతా బలగాలు వేటాడి మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టాయి. ఉగ్రవాదులతో జరిగిన పోరులో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే,.... శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్‌ వాహనంలో వచ్చిన నలుగురు ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. దాడులకు పాల్పడింది జైష్‌-ఎ-మహ్మద్‌ ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారు. వైమానిక స్థావరం ధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. పఠాన్‌కోట్‌లో నిన్న గురుదాస్‌పూర్‌ ఎస్పీ సల్వీందర్‌సింగ్‌ కారులో వెళ్తుండగా సాయుధులు అపహరించారు. ఎస్పీ అపహరణ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధముందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రదాడుల నేపథ్యంలో పంజాబ్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. హైఅలర్ట్‌ ప్రకటించిన అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

6 నెలల వ్యవధిలో రెండో సారి ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డారు. జులై 27న గురుదాస్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌పై ముష్కరులు దాడిచేయడంతో నలుగురు పోలీసులు అమరులయ్యారు. భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించి ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టడంతో ఆపరేషన్‌ ముగిసింది. ఇప్పుడు మరో నలుగురు ముష్కరులు హత మయ్యారు. పంజాబ్‌లో వరుస ఉగ్రదాడులతో స్థానికులు భయాందోళన కు గుర్వవుతున్నారు.

కాగా పంజాబ్‌లో ఉగ్రదాడి నేపథ్యంలో శంషాబాద్‌ విమానాశ్రయంలో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటింఛి, విమానాశ్రయంలో ప్రయాణికులను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు.

ఇక పంజాబ్ ఘటన అనంతరం ఉన్నతాధికారులతో భారత జాతీయ సలహాదారు అజిత్‌ ధోవల్‌ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఘటనపై పాక్‌ జాతీయ సలహాదారుతో ధోవల్‌ మాట్లాడ నున్నట్లు బోగట్టా.

English summary