అదో వింత షాపు, ఓనరు ఉండడు, కావాల్సింది తీసుకుని డబ్బులు వేయడమే

The Trust Shop in Bangalore

10:16 AM ON 14th April, 2016 By Mirchi Vilas

The Trust Shop in Bangalore

ఈ కలియుగంలో ఒకరినొకరు నమ్మడానికి వీలులేని స్థితి. చివరకు కుటుంబ సభ్యులనే నమ్మడానికి వెనకుడుగు వేసే దుస్థితి. అలాంటిది ఓ వ్యక్తి ముక్కూ మొఖం తెలియని వ్యక్తుల్ని నమ్మి వ్యాపారం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు పీసీ ముస్తఫా. అతను పెట్టిన షాప్‌ పేరు పీసీ ఫుడ్స్‌. అయితే బెంగళూరులోని అందరూ దీనిని ‘ట్రస్ట్‌ షాప్‌’ అని పిలుస్తారు. అరుదైన ఈ షాపు గురించి తెలుసుకోవాల్సిందే. ఈ షాప్‌ గొప్పతనం ఏమంటే.. సేల్స్‌మేన్‌, క్యాషియర్‌ అంటూ ఎవరూ ఉండరు. ఓ పెద్ద ఫ్రిజ్‌లో పిల్లలకు కావాల్సిన చిరుతిళ్లు, పాలు, పెరుగు, ఇతర పదార్థాలు ఉంటాయి. కష్టమర్లు ఆ షాప్‌లోకి వెళ్లి ఫ్రిజ్‌ డోర్‌ తెరిచి తమకు కావాల్సిన వస్తువు తీసుకుంటారు.

అనంతరం దాని మీద ఉన్న ఎమ్‌ఆర్‌పీ ఆధారంగా డబ్బులను ఆ డోర్‌కు అమర్చిన చిన్న బాక్స్‌లో వేసేస్తారు. తక్కువ వేసారా, ఎక్కువ వేసారా, అసలు వేయలేదా అనేది చూడడానికి అక్కడ ఎవరూ ఉండరు. కేవలం నమ్మకం మీద మాత్రమే నడుస్తుంది ఆ షాప్‌. ఒక్కోసారి వినియోగదారుడి వద్ద డబ్బులు లేకపోతే వాయిదాల రూపంలో డబ్బులు ఆ బాక్స్‌లో వేసే వెసులుబాటు వుంది. మొదట్లో ఇలాంటి వ్యాపారం చేస్తానంటే అందరూ తనను పిచ్చివాడిగా చూశారని, అయితే ప్రస్తుతం ఇలాంటి షాప్‌లను బెంగళూరు వ్యాప్తంగా 17 తెరిచానని ముస్తఫా అంటున్నారు. వినియోగదారులను పూర్తిగా నమ్మడమే తన వ్యాపార రహస్యం అని ఆయన తెలిపారు.

ప్రతీరోజూ సామాన్లు తీసుకువచ్చి ఫ్రిజ్‌లో ఉంచుతామని చెప్పారు. ఏదైనా నమ్మకమే పెట్టుబడి, నమ్మకమే ఆయుధం, అదే ఊపిరి అంటారు కదా.. ఇక్కడ అది బానే వర్క్ అవుట్ అవుతోంది.

English summary

The Trust Shop in Bangalore.