మరణం అంచున వున్నా .. పిల్లల కోసం ఒక్క రోజులో రూ.17 కోట్లు సేకరించిన బాలుడు

This Small Boy Collected 17 Crores in Just One Day

10:32 AM ON 31st December, 2016 By Mirchi Vilas

This Small Boy Collected 17 Crores in Just One Day

పట్టుదల, కృషి ఉంటే ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఓ విధంగా సంకల్పమే ఎవర్నయినా ముందుకు నడిపిస్తుంది. అదే లక్ష్యం సామాజిక సేవతో కూడుకున్నదయితే దానికి అందరి మద్దతు లభిస్తుంది. అప్పుడు అనుకున్నది సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా… ఇదే సూత్రాన్ని ఓ బాలుడు వంటబట్టించుకున్నాడు. తాను బతికేది కొంత కాలమే అయినా నలుగురి కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఓ వ్యాధితో బాధపడుతున్న ఇతర పిల్లలకు సహాయం అందించాలని సంకల్పించాడు. అదే అతన్ని ముందుకు నడిపించింది. దీంతో ఒకే రోజు రూ.17 కోట్ల నిధులను ఆ బాలుడు సేకరించగలిగాడు. అతనిప్పుడు అక్కడి ప్రజలందరి దృష్టిలోనూ హీరో అయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే,

అతని పేరు టిజ్న్ కోల్స్టెరెన్. నెదర్లాండ్ బాలుడు. వయస్సు 6 ఏళ్లు. అయినా అతని ఆలోచనా శక్తి అమోఘం. తనకు బ్రెయిన్ క్యాన్సర్ ఉందని తెలిసినా, మరికొంత కాలమే తాను బ్రతుకుతానని వైద్యులు చెప్పినా ఆ బాలుడు మాత్రం తోటి వారికి సహాయం చేయాలనే గొప్ప మనస్సు పెంపొందించుకున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా న్యుమోనియాతో బాధ పడుతున్న చిన్నారులకు వైద్య సహాయం అందించడం కోసం నిధులు సమీకరించాలని అనుకున్నాడు. అయితే అందుకు టిజ్న్ ఎంచుకున్న మార్గం సోషల్ మీడియా..! అవును, అదే. సోషల్ మీడియాలో ఆ బాలుడు ఓ వినూత్న క్యాంపెయిన్ నిర్వహించాడు. అదేమిటంటే…

న్యుమోనియా చిన్నారులకు సహాయం అందించేందుకు గాను నిధుల సమీకరణ కోసం ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేశాడు. అనంతరం దాని లింక్‌ను ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో పోస్ట్ చేస్తూ అక్కడ నెయిల్ చాలెంజ్ పేరిట ఓ పోటీని కూడా పెట్టాడు. ఎవరైనా సదరు సైట్లో నిధులు విరాళంగా ఇచ్చి అనంతరం ఆ బాలుడు చెప్పినట్టుగా నెయిల్ చాలెంజ్‌ను స్వీకరించాలి. డొనేషన్ చేయగానే నెయిల్ (గోర్లు) పెయింట్ వేసుకుని ఆ ఫొటోలను సోషల్ సైట్లలో పోస్ట్ చేయాలి. ఆ పోస్ట్‌లో డొనేషన్ వెబ్‌సైట్‌ను కూడా ఉంచాలి. అదీ… టిజ్న్ పెట్టిన చాలెంజ్ కమ్ డొనేషన్.

అంతే, అతని చాలెంజ్ కేవలం కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. కొన్ని కోట్ల మంది దాన్ని స్వీకరించి పెద్ద ఎత్తున విరాళాలు అందజేశారు. తాము వేసుకున్న నెయిల్ పెయింట్ ఫోటోలను సోషల్ సైట్లలో షేర్ కూడా చేశారు. అయితే అలా విరాళాలు ఇచ్చి చాలెంజ్ స్వీకరించిన వారిలో పెద్ద పెద్ద స్టార్ హీరోలు, పొలిటిషియన్లు, వీఐపీలు కూడా ఉండడం విశేషం. ఈ క్రమంలో కేవలం ఒక్క రోజులోనే ఆ బాలుడు 2.50 మిలియన్ పౌండ్లకు పైగా (రూ.17 కోట్లు) నిధులను సేకరించగలిగాడు. దీంతో అక్కడి మీడియా టిజ్న్ను హీరోగా అభివర్ణిస్తూ తమ తమ న్యూస్ పేపర్లు, టీవీ ఛానళ్లలో వార్తలను ప్రసారం చేశాయి. నిజమే మరి..! అంత చిన్న వయస్సులో ఉండి కూడా, అదీ మరికొద్ది నెలల్లో తాను చనిపోతానని తెలిసీ పిల్లల కోసం అంతటి పెద్ద మొత్తంలో విరాళాలను ఒక్క రోజులోనే సేకరించాడంటే… అతడి సంకల్ప బలం గొప్పది. అందుకే అతడు హీరో అయ్యాడు.

ఇవి కూడా చదవండి: ఇక నుంచి అంత్యక్రియలు కూడా లైవ్ లో చూడొచ్చు

ఇవి కూడా చదవండి: 20ఏళ్ల క్రితం ఆగిపోయిన మూవీ మళ్ళీ సెట్స్ పైకి ..

English summary

A six year old boy from Netherlands was inspired everyone by collecting 17 crores for charity even though he was suffering with cancer.