కారెక్కనున్న మరో ముగ్గురు టిడిపి  ఎమ్మెల్యేలు!

Three TDP MLAs To Join In TRS

05:48 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Three TDP MLAs To Join In TRS

ఇక తెలంగాణ లో టిడిపి ఎంఎల్ఎ లు దాదాపు ఖాళీ అయినట్లే. ఇప్పటికే 10మంది ఎంఎల్ఏలు టిఆర్ఎస్ గూటికి చేరిపోగా, తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్ కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈనెల 11న టిఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం కూడా పెట్టుకున్నారట. వాస్తవానికి ఎంఎల్ఎ లు మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీలు బుధవారమే టిడిపి తీర్ధం పుచ్చుకోవాలనుకున్నా, అమావాస్య కారణంగా 11కు వాయిదా వేసుకున్నట్లు చెబుతున్నారు. వీరిద్దరితో పాటు ఆ రోజుకు మరో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా వస్తారని టిఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. వీరి ముగ్గురి చేరిక ఖరారైందని, ముహూర్తమే ఆలస్యమని తెలిసింది. వీరు ముగ్గురూ కారెక్కితే ఇక తెలంగాణ టిడిపి లో రేవంత్‌రెడ్డి, ఆర్‌.కృష్ణయ్యలే మిగులుతారు.

పార్టీ సమావేశానికి నలుగురి గైర్హాజర్....

కాగా ఈ నెల 10న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో టిడిపి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు మంగళవారం ఎన్టీఆర్‌ భవన్‌లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ ఆధ్వర్యంలో ముఖ్యనేతలంతా సమావేశమయ్యారు. కానీ ఐదుగురు ఎమ్మెల్యేలకు గాను రేవంత్‌రెడ్డి ఒక్కరే దీనికి హాజరయ్యారు. నగరంలోనే ఉన్న గోపీనాథ్‌, గాంధీ, కృష్ణయ్యతో పాటు సండ్ర కూడా గైర్హాజరయ్యారు. తనకు నిరుద్యోగులతో సమావేశం ఉన్నందున రాలేకపోతున్నట్లు కృష్ణయ్య వర్తమానం ఇచ్చినట్లు చెబుతున్నారు. గాంధీ, గోపీనాథ్‌లు టిఆర్ఎస్ లో చేరే ప్రయత్నాల్లో ఉన్నందున డుమ్మా కొట్టారు. ఇక ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల కార్యక్రమాలున్నందున రాలేకపోతున్నట్లు సండ్ర చెప్పినప్పటికీ, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాత్మక సమావేశానికి ఐదుగురిలో నలుగురు రాకపోవడం చర్చనీయాంశం అయింది.

ఇక మిగిలేది ఇద్దరే ?....

ఆర్‌.కృష్ణయ్య పార్టీని వదిలి పెడతారన్న ప్రచారం పెద్దగా లేదు. అయితే బిసి రిజర్వేషన్ లలో కాపులను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ, ఇటీవల కాలంలో పలు జిల్లాల్లో తిరగడం , ఉద్యమానికి సన్నద్ధంగా వుండాలని పిలుపు నివ్వడం వంటి కారణాల నేపధ్యంలో కృష్ణయ్య టిడిపి కార్యక్రమాల్లో అంతగా పాల్గొనడం లేదు. ఇక కృష్ణయ్య, రేవంత్‌రెడ్డిలే అసెంబ్లీలో టిడిపి తరపున పాల్గొంటారా లేక సండ్ర వెంకటవీరయ్య కూడా వీరితోనే ఉంటారా అన్నది ఈ నెల 11 నాటికి స్పష్టత వస్తుంది. గోపీనాథ్‌, గాంధీలు సైకిలు దిగేయడం , కారు ఎక్కడం ఖాయమని స్పష్టంగా తేలిపోయింది.

English summary

Another Three Telangana TDP MLA's was getting ready to join in TRS party.MLA's Maganti Gopinadh,Arikepudi Gandhi,Sandra Venkata Veerayya was planning to jump into TRS.