మీనాతో లింకు నిజమే..(వీడియో)

Trivikram Srinivas agreed the copy of Meena movie

10:30 AM ON 6th June, 2016 By Mirchi Vilas

Trivikram Srinivas agreed the copy of Meena movie

ఇదేమిటి అనుకుంటున్నారా.. మీనా అంటే ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ కాదండి బాబూ, ఒకప్పటి టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల నటించిన 'మీనా' చిత్రం అప్పట్లో విజయం సాధించింది. నాటి ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల మీనా ఆధారంగా ఆ చిత్రం రూపుదిద్దుకుంది. మరి ఈ సినిమా గురించి ఇప్పుడు చర్చ ఎందుకు వచ్చిందంటే.. నితిన్, సమంతలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అ..ఆ.. మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మెల్లగా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. అయితే ఈ మూవీ కథ వివాదంలా మారి రచ్చకెక్కింది.

యద్దనపూడి సులోచనారాణి నవల మీనా నుంచి బేసిక్ ప్లాట్ లైన్‌ను ఈ సినిమా స్టోరీలో వాడుకున్నారని, దాదాపు కాపీ కథలా నడిచిందని టాక్ వచ్చింది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం టైటిల్స్‌లో సులోచనారాణికి క్రెడిట్ ఇవ్వకపోవడమేమిటనే విమర్శలు రాగా.. వీటి పై త్రివిక్రమ్ వివరణ ఇచ్చాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం తాను సులోచనారాణిని కలిసినప్పుడు ఈ కథ, పాత్రల గురించి ఆమెతో చర్చించానన్నాడు. అందువల్ల మూలకథ క్రెడిట్ ఆమెకే దక్కుతుందని చెప్పాడు. కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ చిత్రంలో సులోచనారాణికి స్పెషల్‌గా వేసిన థ్యాంక్స్ కార్డు రాలేదని, ఇక పై టైటిల్స్‌లో ఈ క్రెడిట్ కనిపిస్తుందని అన్నాడు.

దీంతో వివాదం పరిష్కారమైనట్టే.. ఇంతకంటే నేను చెప్పేదేమీ లేదు అన్నాడు. అయితే త్రివిక్రమ్ ఈ విషయాన్ని ముందే చెప్పి ఉండవచ్చు కదా.. వివాదం తలెత్తింది గనుక సీన్ లోకి వచ్చాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. నిజానికి జూన్ 2న సినిమా రిలీజ్ కి ముందే... మే నెల చివరి వారంలో ఈ మూవీని సెన్సార్ చేసినప్పుడే సాంకేతిక తప్పిదాలన్నీ సరిచేసి ఉండవచ్చుగా అనే అభిప్రాయాలకు ఆన్సర్ చెప్పేవారెవరు..? మొత్తానికి సోషల్ మీడియాలో వరుస కధనాలు వచ్చేసరికి, ఉన్న విషయాన్ని త్రివిక్రమ్ వొప్పేసుకోవడం అభినందనీయం అంటున్నారు కొంతమంది నెటిజన్లు.

English summary

Trivikram Srinivas agreed the copy of Meena movie