కారు జోరు ముందు నిలవని  విపక్షాలు 

TRS Holds Hyderabad Mayor Seat

06:58 PM ON 5th February, 2016 By Mirchi Vilas

TRS Holds Hyderabad Mayor Seat

*భాగ్యనగరం లో గులాబీ గుబాళింపు
*సొంతంగా మేయర్ సీటు దక్కే చాన్స్
*'నాన్నకు ప్రేమతో' విజయాన్ని అందించిన కెటిఆర్
*సెటిలర్స్ సైతం కారుకే పట్టం
*ఖంగు తిన్న కాంగ్రెస్ - వికసించని కమలం
*డీలా పడ్డ తెలుగు తమ్ముళ్ళు
*దారిడాపుల్లో లేని ప్రతి పక్షాలు
* ఓల్డ్ సిటీలో మజ్లీస్ హవా

గ్రేటర్‌ ఎన్నికలలో కూడా కారు యమ జోరు మీద దూసుకుపోయింది. ఆపార్టీ వ్యూహం ఫలించింది. ఫలితాల్లో అనూహ్య విజయం నమోదు చేసుకుంది. మంత్రి కె టి ఆర్ మీద ఆపార్టీ నేత , సిఎమ్ పెట్టిన బాధ్యతకు పూర్తి న్యాయం చేకూరుస్తూ. 'నాన్నకు ప్రేమతో' బంగారు పళ్ళెం లో విజయాన్ని అందించాడు. ఫలితాట సరళి చూస్తే, టి ఆర్ ఎస్ చెప్పిన విధంగా 100 స్థానాల్లో విజయం సాధించే దిశగా నడుస్తోంది. సొంతంగా మేయర్ సీటుని కైవసం చేసుకునే స్థాయికి టి ఆర్ ఎస్ ఎదిగితే , మరోపక్క విపక్షాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఒక డివిజన్‌లో గెలుపొందగా.. టిడిపి 2, బిజెపి 3 చోట్ల విజయం దక్కించుకుంటున్నాయి. మజ్లీస్ (ఎంఐఎం) 35స్థానాల కన్నా ఎక్కువ దక్కే అవకాశాలున్నాయి. ఎన్నో గొప్పలు చెప్పిన కాంగ్రెస్ చతికిల పడగా, కమలం వికాసం లేదు. ఇక ఫలితాలు ఘోరంగా ఉండడంతో తెలుగు తమ్ముళ్ళు నైరాశ్యంలో వున్నారు. సెటిలర్లు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో సైతం టి ఆర్ ఎస్ దూసుకుపోయింది. దీంతో టిడిపి కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇక ఎన్నికల ఫలితాలతో తెలంగాణ భవన్‌లో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ భవన్‌ వద్ద తెరాస కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ సంబరాల్లో మునిగితేలుతున్నారు.

తిరుగులేని విజయం ఇది : కెటిఆర్

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం నేపధ్యంలో ఐటీ, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ టి ఆర్ ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామన్నారు ఈ గొప్ప గెలుపుతో తెరాస కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిందన్నారు. ఈ అపూర్వ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి వినమ్రంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతిహామీని చిత్తశుద్ధితో అమలుచేస్తామని ఆయన స్పష్టంచేశారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అన్నింటికీ మించి అఖండమైన రీతిలో ప్రజలు తమను ఆదరించినందునే ఈ విజయం సాధ్యమైందన్నారు.

కెటిఆర్ కు అభినందల వెల్లువ

కాగా పార్టీ తరపున అన్నీ తానై నడిపించిన మంత్రి కేటీఆర్‌పై పార్టీ శ్రేణులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఫలితాల్లో తెరాస భారీ విజయం దిశగా దూసుకుపోతున్న నేపధ్యంలో తెలంగాణ భవన్‌కు వచ్చిన మంత్రి కేటీఆర్‌ను టి ఆర్ ఎస్ శ్రేణులు చుట్టుముట్టి అభినందనలు తెలిపారు. కేటీఆర్‌ నినాదాలతో తెలంగాణ భవన్‌ మార్మోగిపోయింది.
మొత్తం 150 డివిజన్లలో టి ఆర్ ఎస్ 95, ఎం ఐ ఎం 33, టిడిపి 2,బిజెపి 3, కాంగ్రెస్ ఒక చోట గెలుపు కనిపించడంతో ఇదే ట్రెండ్ కొనసాగనుందని తేటతెల్లం అవుతోంది. రాత్రి కి పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

డిప్యూటి సిఎమ్ తనయుని ఓటమి

రాజకీయ ప్రముఖుల వారసులకు గ్రేటర్ ఎన్నికలు ఓటమి రుచి చూపించాయి. కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ తనయుడు విక్రమ్‌గౌడ్‌ సైతం పరాజయం పాలయ్యాడు. ఇక టి ఆర్ ఎస్ దూసుకుపోతుంటే... ఉపముఖ్యమంత్రి మహమూద్‌అలీ కుమారుడు మాత్రం ఓటమి చవిచూసాడు.

కెసిఆర్ అభివృద్ధికి ఇది నిదర్శనం

భాగ్యనగర ప్రజలు టిఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యం కట్టబెట్టారని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.తమ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టారన్నారు. ఈ విజయంతో తమ బాధ్యత మరింత పెరిగిందన్నారు. కేటీఆర్‌ అన్నీ తానై తెరాస విజయానికి కృషి చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. విపక్షాలు ఇకనైనా అసత్య ప్రచారం కట్టిపెట్టి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

English summary

TRS won in Greater Hyderabad Municipal Corporation (GHMC) elections,TRS won the Mayor Seat by winning in GHMC Elections,TDP,Congress,BJP parties won less than ten seats.This was the worst defeat in GHMC History