భాగ్యనగరంలో సరికొత్త చరిత్ర టిఆర్ఎస్ సొంతం

TRS New Record In GHMC Elections

01:21 PM ON 6th February, 2016 By Mirchi Vilas

TRS New Record In GHMC Elections

*99 డివిజన్ల గెలుపుతో అనూహ్య విజయం

*ఆదినుంచి దూసుకుపోయిన కారు

*ఆనంద డోలికల్లో గులాబి శ్రేణులు

*కాంగ్రెస్ కి ఎదురు దెబ్బ

*ఒకే ఒక్క స్థానానికి టిడిపి పరిమితం

*కమల దళానికి కల్సి రాని కాలం

*పాతబస్తీ ని కమ్మేసిన మజ్లీస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అన్నంత పనీ చేసింది. 100 స్థానాలు గెలుచుకుంటామని ప్రజ్ఞ చేసి మరీ లక్ష్యానికి చేరువైంది. ఇటీవల కాలంలో ఏ పార్టీ సింగిల్ గా సాధించని మెజార్టీ టిఆర్ఎస్ సాధించింది. ఎంతో ఊహించుకున్న కాంగ్రెస్ కి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. బిజెపి - టిడిపి జోడీ కట్టినా, కమలనాధులకు కల్సి రాలేదు. ఇక టిడిపి భారీ ఎత్తున ప్రచారం సాగించి, చతికిల పడింది. తెలుగు తమ్ముళ్ళకు నైరాశ్యం మిగిలింది. వివరాల్లోకి వెళితే, ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి టిఆర్ఎస్ ఎవరికీ అందనంత వేగంతో దూసుకుపోయింది. మొత్తం 150 డివిజన్లలో 99 డివిజన్లను కైవసం చేసుకుని సొంతంగా మేయర్ సీటు గెలుపొందే, స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. సెటిలర్లు సైతం గులాబి దళాన్ని నమ్మి పట్టం కట్టారు. ఇక పాతబస్తీలో ఎప్పటిలాగే ఎంఐఎం తన సత్తా చాటింది. 44 డివిజన్లు గెలుచుకున్న ఆ పార్టీ ప్రతి పక్ష హోదా తెచ్చుకుంది. ఇక పాతబస్తీలోని పురానాపూల్‌ డివిజన్‌లో కూడా ఆ పార్టీయే గెలవడం విశేషం. 2వ తేదీన జరిగిన ఎన్నికల సందర్భంగా పురానాపూల్‌లో ఘర్షణ తలెత్తిన నేపథ్యంలో పురానాపూల్‌లో శుక్రవారం రీపోలింగ్‌ నిర్వహించారు. ఫలితం ఎంఐఎం కి అనుకూలంగా వచ్చింది. బిజెపి 4 డివిజన్లలో విజయం సాధించింది. కాంగ్రెస్‌ 2 డివిజన్లలో గెలుపొందగా, టిడిపి ఒకేఒక డివిజన్‌తో సరిపెట్టుకునే పరిస్థితి కి వచ్చేసింది.

ప్రముఖుల వారసులను వరించిన విజయం ....

ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు ప్రముఖుల వారసులను అదృష్టం వరించింది. టీఆరెస్ సెక్రెటరీ జనరల్ కేశవరావు (కేకే) కుమార్తె గద్వాల విజయలక్ష్మి బంజారాహిల్స్ నుంచి గెలుపొందారు. ఖైరతాబాద్‌లో ఇదే పార్టీ నుంచి బరిలోకి దిగిన దివంగత ప్రముఖ కాంగ్రెస్ నేత, మాజీమంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి కూడా విజయం సాధించారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ముషీరాబాద్ నుంచి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు చింతల విజయశాంతి అల్వాల్ నుంచి విజయం నమోదు చేసుకున్నారు.

మాజీ మేయర్లకు పరాభవం ...

ఈ ఎన్నికలు మాజీ మేయర్లకు చేదు అనుభవాలను మిగిల్చాయి. కాంగ్రెస్ తరఫున తార్నాక నుంచి పోటీ చేసిన మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి ఓడిపోయారు. సమైక్యాంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు టీడీపీ హయాంలో నగర మేయర్‌గా పనిచేసి, ప్రస్తుతం టీఆరెస్ తీర్థం పుచ్చుకున్న తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి ఆర్కే పురంలో ఓటమి పాలయ్యారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమార్తె, కుమారుడు ఘోర పరాభవం పొందారు. . కాంగ్రెస్ తరఫున మేయర్ అభ్యర్థిగా జాంబాగ్ స్థానం నుంచి ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముఖేష్ కుమారుడు విక్రమ్ గౌడ్ అక్కడ ఓడిపోగా, ముఖేష్‌ కుమార్తె శిల్పా గౌడ్‌‌ గన్ ఫౌండ్రీ నుంచి బరిలో ఓటమి పాలయింది.

ఇది చారిత్రిక విజయమన్న కెసిఆర్ .......

గత ఎన్నికల రికార్డులను చెరిపేస్తూ గ్రేటర్‌ ప్రజలు టిఆర్ఎస్ కు చారిత్రక విజయం కట్టబెట్టారని తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో అనూహ్య విజయం అందుకున్న నేపధ్యంలో కెసిఆర్ స్పందిస్తూ, ఈ విజయం మంత్రులు, టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితమే ని విశ్లేషించారు. నగర చరిత్రలో ఏ ఒక్కపార్టీ కూడా స్వయంగా అధికారం చేపట్టిన దాఖలాలు లేవని ఆయన చెబుతూ, కానీ ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ కు ప్రజలు అద్భుత అవకాశం ఇచ్చారన్నారు. ఈ గెలుపుతో ప్రభుత్వానికి బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజల రుణం తప్పకుండా తీర్చుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు ఎన్నో విమర్శలు చేశాయని, అయినప్పటికీ వాటన్నింటినీ ప్రజలు తిప్పికొట్టారని కేసీఆర్‌ పేర్కొంటూ, ప్రజలకు కృతజ్ఞతలు తెల్పారు. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని విపక్షాలకు ఆయన సూచించారు.

English summary

Telangana Rashtra Samiti (TRS) party has created new record in Greater Hyderabade Municipal Corporation elections.TRS won more number of seats in GHMC elections.