టీఆర్ఎస్ మద్దతుతో పెద్దల సభకు కాంగ్రెస్ నేత? 

TRS supporting congress Mp for elections

10:28 AM ON 10th March, 2016 By Mirchi Vilas

TRS supporting congress Mp for elections

రాజకీయాలన్నాక సవాలక్ష వుంటాయి. అందుకే శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రత్వం ఉండవని అంటారు. అందునా ఎన్నికల వేళ ఎన్ని ఎత్తుగడలైనా వేస్తారు. ఏం చేయడానికైనా మొహమాట(సిగ్గు) పడరు. ఇదంతా ఎందుకంటే తెలంగాణాలో రాజ్యసభ సీట్లకు ఎన్నికలు రాబోతున్నాయి. ముందుగా సీట్ల కోసం అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. ఇక రాజ్యసభకు ఎన్నికవ్వాలంటే, ఓట్లేసే ఎమ్మెల్యేలను బుట్టలో వేసుకోవాలి మరి. వేరే పార్టీ అధినేతలను సైతం ప్రసన్నం చేసుకోవాలి. ఈ క్రమంలో త్వరలో పదవీ కాలం ముగియనున్న కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ తన ప్రయత్నాన్ని కొత్తగా మొదలు పెట్టి ట్విస్ట్ ఇస్తున్నారు.

పెద్దల సభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతానని చెప్పిన వీహెచ్, తనకు మద్దతివ్వాల్సిందిగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు విన్నవించారు. అలా తనకే ఎందుకు మద్దతు ఇవ్వాలో ఆ లాజిక్ కూడా వీహెచ్ చెప్పారు. గతంలో టీఆర్ఎస్ తరఫున కేకేను బరిలోకి దింపినపుడు కాంగ్రెస్ మద్దతిచ్చిందని గుర్తుచేస్తూ, ఇపుడు తన విషయంలో కూడా అలానే బలపర్చే విధానాన్ని ఫాలో కావాలని కోరారు. అంతేకాదు తనను ఎంపీగా గెలిపించడం వల్ల సోనియాగాంధీ సైతం తెలంగాణ బిడ్డను గౌరవించారని ఫీలవుతారని వీహెచ్ సరికొత్త భాష్యం చెప్పారు. ఇలా మీడియా ఎదుట అడుగుతున్నానని కేసీఆర్ అనుకోవక్కర్లేదని కూడా విహెచ్ అంటూ, కావాలంటే కేసీఆర్ ను స్వయంగా కోరతానని చెప్పారు.

ఈ కధ అలా వుంటే, అసలు కిటుకు మరోటి వుంది. వీహెచ్ పదవి ఊడిన తర్వాత ఢిల్లీలో ఆయన ఖాళీ చేసే క్వార్టర్ ను తనకు కేటాయించాలని ఇప్పటికే కేకే తన వినతిపత్రాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చేయగా, కేసీఆర్ కూతురు, ఎంపీ కవిత మహిళా దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీని స్తుతించారు.. కొంపదీసి, కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందం కాదు, కాదు ప్రత్యక్ష సంబంధం కుదురుతుందా? మరి టీఆర్ఎస్ ని ఓడించడానికి అవసరమైతే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని గతంలో కాంగ్రెస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పిన మాటలకు ప్రస్తుత తతంగం పూర్తి భిన్నం కాదా?

English summary

TRS supporting congress Mp VH for elections.